‘‘జగన్ నుంచి మమ్మల్నెవరూ కాపాడలేరు’’

May 26, 2020

అధికార వికేంద్రకరణతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. దీంతో , అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించారు. అయితే, అధికార వికేంద్రీకరణ నేపథ్యంలో విశాఖకు సచివాలయ ఉద్యోగులు తరలివెళ్లడంపై కొన్నాళ్లుగా సందిగ్దం ఏర్పడింది. అమరావతి నుంచి విశాఖకు తరలిరావలంటూ ఉద్యోగుల ముందు ఏపీ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు ఉంచింది. తాజాగా, జగన్ సర్కార్ ప్రతిపాదనలకు ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. మే 31 లోపు అమరావతి నుంచి విశాఖకు తరలి వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

జూన్ మొదటి వారంలో విద్యాసంస్థలు ప్రారంభం అయ్యే అవకాశమున్నందున...మే 31 లోపు ఈ తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు ఓ తీర్మానం పంపనున్నాయి. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ఉద్యోగసంఘాలు అంగీకరించడంతో ఈ విషయంపై ఏ నిమిషంలోనైనా అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. అమరావతి నుంచి విశాఖ తరలి వెళ్లేందుకు ప్రభుత్వంతో కొన్ని రోజులుగా ఉద్యోగులు చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం ప్రభుత్వ ప్రతిపాదనలకు సచివాలయ ఉద్యోగ సంఘం అంగీకారం తెలిపింది. విశాఖకు సచివాలయ తరలింపునకు ఆమోదం తెలుపుతున్నట్లు ఉద్యోగసంఘాలు ఈరోజు ప్రకటించాయి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అందిన మిగతా ప్రతిపాదనలను ఆమోదించిన ఉద్యోగులు...31లోపు తరలింపు తదితర అంశాలను కూడా ప్రభుత్వానికి విన్నవించాలని నిర్ణయించారు.

 

నిమ్మగడ్డ ఎపిసోడ్ తో అధికారులకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఒక స్వతంత్ర కేంద్ర నియామక సంస్థ టాప్ పర్సన్ ని, జడ్జి స్థాయి వ్యక్తిని జగన్ అతని టీం బహిరంగంగా భయం లేకుండా బెదిరించారు అంటే... ఇక సచివాలయం జగన్ కచ్చితంగా ఇక్కడ ఉంచరు. 30 వేల మంది రైతులు ధర్నాలు చేస్తున్నా అమరావతి గురించి పట్టించుకోని జగన్ మా ధర్నాలకు చలించరు. అవసరం అయితే... సచివాలయం నుంచి అందరినీ బదిలీ చేసిపారేస్తారు గానీ మా డిమాండ్ జగన్ పట్టించుకోరు అని సచివాలయ ఉద్యోగులకు ఫుల్ క్లారిటీ ఉండటం వల్ల వారు ఇక వైజాగ్ తరలిపోవడానికి డిసైడైపోయినట్లున్నారు. కోర్టు రాజధానిని ఆపినా ఏదో విధంగా జగన్ సచివాలయాన్ని ఇక్కడుంచరు అని ఫిక్సయ్యారు ఉద్యోగులు. అందుకే చివరకు ఈ నిర్ణయం తీసేసుకున్నట్టు తెలుస్తోంది.