ఆత్మ‌కూరు ఘ‌ట‌న‌తో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో జ‌గ‌న్‌...!

January 26, 2020

ఏపీలో 100రోజుల పాల‌న‌లో ఎన్నో అద్భుతాలు చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి మొద‌టిసారి ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టె సంఘ‌ట‌న ఆత్మ‌కూరు నిలిచింది. ఆత్మ‌కూరు బాధితుల పేరుతో టీడీపీ, వైసీపీలు వేర్వేరు బాధితుల శిభిరాల‌ను ఏర్పాటు చేయ‌డంతో ఇప్పుడు రాజ‌కీయం వేడెక్కింది. అయితే చంద్ర‌బాబు నాయుడు ఆత్మ‌కూరు సంఘ‌ట‌న‌ను త‌న‌కు అనుకూలంగా మలుచుకోవ‌డంలో విజ‌యం సాధించ‌గా, సీఎం జ‌గ‌న్ మాత్రం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డాడు. పోలీసులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే ఈ పరిస్థితి దాపురించింద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. సీఎం జ‌గ‌న్‌కు ఇప్పుడు ఆత్మ‌కూరు సంఘ‌ట‌న మింగుడు ప‌డ‌ని వ్య‌వ‌హారంగా మారింది.

వాస్త‌వానికి ఆత్మ‌కూరు బాధితులు టీడీపీ శిబిరాల‌కు చేర‌డానికి అనేక మందికి వ్య‌క్తిగ‌త కార‌ణాలు అనే ఆరోప‌ణ‌లు వినిపిస్తుండ‌గా, టీడీపీ మాత్రం వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న ఆరాచ‌కాల‌తోనే టీడీపీ కార్య‌కర్త‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌తుకుతున్నార‌ని టీడీపీ ఆరోపిస్తుంది. ఆరోప‌ణ‌ల‌తో ఆగ‌ని టీడీపీ ఏకంగా ఛ‌లో ఆత్మకూరు అంటూ పిలుపునిచ్చింది. దీనికి ప్ర‌తిగా వైసీపీ నేత‌లు కూడా టీడీపీ బాధిత కుటుంబాల పేరుతో వైసీపీ ఓ ప్ర‌త్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి వైసీపీ కూడా ఛ‌లో ఆత్మ‌కూరు అంటూ పిలుపునిచ్చింది. దీంతో ప‌ల్నాడు ప్రాంతం రాజకీయ పోరాట‌ల‌కు వేదికైంది. దీంతో పోలీసులు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లుగా వెంట‌నే ఛ‌లో ఆత్మ‌కూరుకు టీడీపీ అనుమ‌తి ఇచ్చి అధికార వైసీపీకి అనుమ‌తి నిరాక‌రించారు.

అయితే తెల్లారేస‌రికి రెండు పార్టీల న‌డుమ పోరాటం త‌ప్ప‌ద‌ని గ్ర‌హించి శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ను తెర‌పైకి తెచ్చి టీడీపీ నేత చంద్ర‌బాబును, మిగ‌తా నేత‌ల‌ను హౌజ్ అరెస్ చేసింది పోలీసు యంత్రాంగం.
పోలీసులు ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించారు. 144 సెక్షన్‌ విధించడంతో పాటు రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ రంగంలోకి దించారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. పల్నాడులో పరిస్థితి స్వయంగా డీజీపీ పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి.

చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే, ఆయన ఇంటి వద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు అధికారులు. మాజీ మంత్రి దేవినేని ఉమ, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు.
గుంటూరు జిల్లా పల్నాడులో వైసీపీ అరాచకం సృష్టిస్తోందని ఆరోపిస్తున్న టీడీపీ... తమ వాళ్లను పునరావాస శిబిరాలకు తరలించింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగా జరుగుతున్న ఈ దాడుల నుంచి తమ వాళ్లను రక్షించుకుంటామని స్పష్టం చేసింది.

టీడీపీ శిబిరాలకు వెళ్లిన పోలీసులు... బాధితులను ఇళ్లకు చేరుస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వాళ్లతో వెళ్లేందుకు నిరాకరించాయి బాధిత కుటుంబాలు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక... ఇప్పుడు తమకు రక్షణ కల్పిస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించాయి. చివ‌రికి పోలీసులు టీడీపీ శిబిరంలో ఉన్న సుమారు 125 బాధిత కుటుంబాల‌ను త‌మ గ్రామాల‌కు ప్ర‌త్యేక వాహ‌నాల్లో పంపించారు. ఇక ఆత్మ‌కూరుకు చెందిన సుమారు 66 కుటుంబాల‌ను కూడా వారి ఇళ్ల‌కు పంపారు.

అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే బాధితులు ముందుగానే పోలీసు స్టేష‌న్ల‌కు వ‌స్తే వారికి న్యాయం చేస్తే ప‌రిస్థితి ఇక్క‌డి దాకా వ‌చ్చేది కాదు.. పోలీసులు స‌రిగా స్పందించ‌క‌పోవ‌డంతోనే టీడీపీ దాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంది. ఇప్పుడు టీడీపీ దాన్ని త‌మ‌కు రాజ‌కీయ మైలేజ్‌గా మార్చుకోగా, వైసీపీ నేత‌ల వ్య‌వ‌హ‌రంతో సీఎం జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ఓ దెబ్బ‌గా మారింది.