మొన్న రాజు, నేడు ఎంవీవీ... వైసీపీకి టెన్షనే టెన్షన్

June 03, 2020

ఏపీలో ఎలాగోలా అధికారాన్ని చేజిక్కించుకున్న వైసీపీకి ఆ పార్టీ ఎంపీలు ఎప్పటికప్పుడు టెన్షన్ పెంచుతూనే ఉన్నారు. పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాటను బుట్ట దాఖలు చేస్తూ వ్యవహరిస్తున్న ఆ పార్టీ ఎంపీల తీరు నిజంగానే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. బీజేపీ నేతలను, కేంద్ర మంత్రులను కలిసే విషయంలో పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభలో పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల అనుమతి తీసుకున్నాకే ముందడుగు వేయాలని ఓ పక్క జగన్ ఆదేశాలు జారీ చేసినా... వైసీపీ ఎంపీలు మాత్రం తమదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తూ జగన్ కు బీపీ పెంచేస్తున్నారు. 

మొన్నటికి మొన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. తనకు తారసపడ్డ ప్రధాని మోదీకి నమస్కారం పెడితే... మోదీ ఏకంగా రాజుగారూ బాగున్నారా? అంటూ ఆప్యాయంగా పలకరించడంతో పాటు రాజుగారి భుజాన్ని తట్టిన వైనం వైసీపీలో పెను కలవరాన్నే రేపింది. రాజు గారు బీజేపీలోకి జంప్ కొట్టడం ఖాయమేనన్న వార్తలు నిజంగానే జగన్ లో బీపీని పెంచేశాయి. ఈ క్రమంలో రాజు గారిని నేరుగా తాడేపల్లికి పిలిపించుకున్న జగన్ అక్షింతలు వేసి పంపారు. అయినా కూడా రాజుగారు... ఆ తర్వాత ఏకంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమైన తీరు కలకలం రేపింది. 

తాజాగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా రాజు గారి బాటలో నడిచి జగన్ కు బీపీ పెంచేశారు. మంగళవారం పార్లమెంటు సమావేశాలకు హాజరైన సత్యనారాయణ... పార్లమెంటు ఆవరణలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. రాజ్ నాథ్ తో కలిసి ఓ ఫొటో కూడా తీయించుకున్నారు. ఈ వార్త ఇప్పుడు వైసీపీలోనే కాకుండా జగన్ లో మరింత కలవరాన్ని పెంచేసిందని చెప్పక తప్పదు. వద్దు వద్దంటున్నా... బీజేపీ కీలక నేతలను కలిసే విషయంలో వైసీపీ ఎంపీలు ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో వారిని ఎలా నిలువరించాలో తెలియక జగన్ నానా తల పట్టుకున్నారట.