నత్వానీకే రాజ్యసభ బెర్తు... జగన్ కు మరో ఆప్షన్ లేదబ్బా

June 05, 2020

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు నిజంగానే ఆప్షన్ లేదనే చెప్పాలి. ఎందుకంటే.... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్దేశించిన మేరకు వైసీపీకి రాజ్యసభలో దక్కనున్న నాలుగు సీట్లలో ఓ సీటును రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమళ్ నత్వానీకి ఇవ్వక తప్పని పరిస్థితిలో జగన్ పడిపోయారు. నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీలోనే కింగ్ పిన్ గా ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా చెప్పిన తర్వాత... నత్వానీకి సీటివ్వలేనని చెప్పడం జగన్ కు సాధ్యం కాదు కదా. అసలే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కోర్టులో విచారణ దశలోఉన్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో విబేధిస్తే... జైలుకు వెళ్లడం ఖాయమేనన్న విషయం తెలిసిన తర్వాత కూడా జగన్... నత్వానీకి సీటివ్వక చస్తారా?

గత నెలలో వరుసగా రెండు పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన జగన్... ముందు రోజు మోదీతో, ఆ తర్వాతి రోజు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే నత్వానీకి రాజ్యసభ సీటు ప్రతిపాదన రాగా... బీజేపీతో సఖ్యత కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్న జగన్ అక్కడికక్కడే ఓకే చెప్పేశారట. అయితే దానిపై అప్పుడే ప్రకటన చేస్తే తాను పలచన అవుతానని భావించిన జగన్ మౌనంగా ఉండిపోయారట. ఆ తర్వాత మొన్న నత్వానీని వెంటేసుకుని ముఖేశ్ అంబానీ స్వయంగా అమరావతికి వచ్చేసి జగన్ తో భేటీ అయ్యారు కదా. ఈ భేటీలో కూడా నత్వానీకి సీటిచ్చే విషయంలో జగన్ మరో మాట మాట్లాడలేదట. తన పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత గానీ తాను ఈ విషయంపై నిర్ణయం తీసుకోలేదన్న మాటను బయటకు పంపించిన జగన్... ఈ విషయంలో తానేమీ పెద్దగా భయపడటం లేదన్న వాదనను వినిపించే యత్నం చేశారట. 

అయితే బీజేపీ ముఖ్యుల వద్ద ఒప్పేసుకున్న జగన్... నాలుగు సీట్లకు అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన కసరత్తులో కేవలం మూడు సీట్లకు సంబంధించిన కసరత్తునే చేస్తున్నారట. నత్వానీకి కేటాయించిన సీటును అసలు ప్రస్తావించకుండానే జగన్ తన కసరత్తును లాగించేస్తున్నారట. ఈ క్రమంలో మూడు సీట్లకు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలతో పాటు తనకు అత్యంత సన్నిహితుడు, తన సొంత సామాజిక వర్గానికి చెందిన అయోధ్య రామిరెడ్డిని ఎంపిక చేసినట్లుగా జగన్ తన పార్టీ ముఖ్యులకు చెబుతున్నారట. మొత్తంగా తనపై ఉన్న కేసుల నుంచి తననను తాను రక్షించుకునే పనిలో భాగంగానే జగన్... మోదీ, షాలు ఆదేశించిన మేరకు రాజ్యసభ సీటును నత్వానీకి జగన్ ఎప్పుడో ఇచ్చేశారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అంటే... జగన్ కు ఈ విషయంలో మరో ఆప్షన్ లేదనే చెప్పాలి.