జ‌గ‌న్ గారు‌.. అవినీతి గురించి చెప్తే అరెస్టు చేసేస్తారా?

August 13, 2020

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స‌ర్కారు చ‌ర్య‌ల గురించి ప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఏపీ సీఎం చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారా లేక‌పోతే ప‌గ‌బ‌ట్టి ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా అనేది తెలియ‌డం లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

పేదవాళ్ల కోసం పనిచేస్తున్న 108 అంబులెన్స్‌లపై కూడా జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని టీడీపీ నేత పట్టాభిరాం గ‌త కొద్దిరోజుల కింద‌ట‌ విమర్శించారు. జగన్‌ ప్రభుత్వ అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని మండిప‌డుతూ,108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలోనూ కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు.

జగన్‌ ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదని పట్టాభి విమర్శించారు. అయితే, దీనిపై ప‌ట్టాభికి నోటీసులు జారీ అయ్యాయి.  ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలి.. లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో తేల్చిచెప్పారు.

108 అంబులెన్స్‌లకు సంబంధించి స్కామ్ జరిగిందని పేర్కొన్న ప‌ట్టాబి దీనికి సంబంధించిన వివ‌రాలు, ఆధారాలు ఇవి అంటూ మీడియాకు కొంత‌ స‌మాచారం ఇచ్చారు.

గత టీడీపీ ప్రభుత్వం 108 అంబులెన్స్‌లకు సంబంధించి జీవీకే సంస్థ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 2016లో టెండర్లకు పిలిచి మళ్లీ జీవీకే సంస్థకు ఇచ్చిందని.. ఎక్కడ అవినీతికి తావులేకుండా చాలా పారదర్శకంగా జరిగిందని పట్టాభిరాం చెప్పారు. 

అయితే, అనంత‌రం వ‌చ్చిన జ‌గ‌న్ స‌ర్కారు నిబంధ‌న‌లు ప‌క్కన పెట్టి ఈ గడువు పూర్తి కాకముందే వాహనాల పెంపుతో పాటు కాంట్రాక్టును కూడా అరబిందో సంస్ధకు కట్టబెట్టింది. ఈ అరబిందో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డిది కావడంతోనే ప్రభుత్వం జీవీకే కాంటాక్టును వీరికి కట్టబెట్టిందని, ఇందులో రూ.307 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపించారు.

ప‌ట్టాభి వ్యాఖ్య‌లు పెద్ద ఎత్తున దుమారం లేపాయి. అయితే, కొద్దిరోజుల‌కు మ‌రో కీల‌క ప‌రిణామం జ‌రిగింది. 108 అంబులెన్స్ ల నిర్వహణలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి చెందిన సంస్ధకు భారీ ఎత్తున లబ్ది చేకూరుతుందని ఆరోపణలు చేసిన టీడీపీ నేత పట్టాభి ఇంటికి పోలీసులు వెళ్లి ఆయన ఇంటి చుట్టూ మోహరించారు.

దీనిపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మ‌రోవైపు అవినీతి వివ‌రాలు బ‌య‌ట‌పెట్టిన‌ప్ప‌టి నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, చంపేస్తామని బెదిరిస్తున్నారని పట్టాభి వాపోయారు.ఇలాంటి క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలోనే తాజాగా, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.

108 వాహనాల కాంట్రాక్ట్ లో అవినీతి జరిగిందన్న వ్యాఖ్యలపై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి  నోటీసులు జారీ చేశారు.ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలి.. లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో తేల్చిచెప్పారు.

అయితే, ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విజయసాయిరెడ్డి అల్లుడిపై ఆరోపణలు చేస్తే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నిర్దారించుకోకుండా పట్టాభి ఇంటికి పోలీసులు వెళ్ల‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. దానికి కొన‌సాగింపుగా క్రిమిన‌ల్ నోటీసులు ఇస్తామ‌ని పేర్కొన‌డం, ప‌రోక్షంగా అరెస్టు సూచ‌న‌లు చేయ‌డం ఏంట‌ని టీడీపీ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి.