లెంపలేసుకున్నారు - ఎఫ్ డీఐలపై వైసీపీ నాడు...నేడు

May 25, 2020

2014లో చంద్రబాబు సీఎం అయ్యేనాటికి అవశేషాంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అస్థవ్యస్తంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని తన అనుభవంతో చంద్రబాబు గాడిలో పెట్టారు. రాజధాని అమరావతిని ప్రపంచపటంలో నిలబెట్టారు. పారిశ్రామిక అభివృద్ధితోనే అవశేషాంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు ముడిపడి ఉందని గ్రహించారు. ఏపీలో పెట్టుబడుల వేటలో చంద్రబాబు విదేశాలలో పర్యటించారు. ఆ పెట్టుబడులు తేవడంలో...అనేక పరిశ్రమలు ఏపీకి రావడంలో చంద్రబాబు పాత్ర ఎనలేనిది.

అయితే, పెట్టుబడులంటూ చంద్రబాబు విదేశాలకు తిరిగారని....తెచ్చిన పెట్టుబడులు పెద్దగా ఏమీ లేవని వైసీపీ నేతలు విమర్శించేవారు. కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు విదేశాలకు వెళ్లారంటూ విమర్శించారు. తాజాగా, మాజీ సీఎం చంద్రబాబు హయాంలో తెచ్చిన పెట్టుబడుల గణాంకాలు వెల్లడి కావడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. అంతేకాదు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సాధించి దేశంలోనే 6 వ స్థానంలో ఏపీ నిలిచిందని స్వయంగా వైసీపీ నేతల నోటితోనే చెప్పాల్సి వచ్చింది. గతంలో తాము అబద్ధాలంటూ ప్రచారం చేసిన విషయాలను నేడు నిజాలని వైసీపీ నేతలు రాతపూర్వకంగా అంగీకరించాల్సి వచ్చింది.

చంద్రబాబు హయాంలో 2016-19 మధ్యకాలంలో ఏపీకి దాదాపు రూ.50 వేల కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్ డీఐ) వచ్చాయని తేలింది. ఈ గణాంకాలను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్వయంగా పార్లమెంటులో వెల్లడించారు. పార్లమెంటుకు విజయసాయి నేతృత్వంలోని వాణిజ్య స్థాయీ సంఘం సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 18 రాష్ట్రాలలో ఏపీ 6వ స్థానంలో నిలిచింది. దీంతో, వైసీపీ నేతలపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రాజధాని కూడా సరిగ్గా లేని రాష్ట్రాన్ని చంద్రబాబు తన అనుభవంతో ముందుకు తీసుకువెళ్లారని, జగన్ మాత్రం వెనక్కు తీసుకువెళుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలో (2016-19) మూడేళ్ళలో 50,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సాధించామని వైసీపీ నేతల నోటితో చెప్పాల్సి రావడం శోచనీయమని అంటున్నారు. గతంలో విదేశీ పెట్టుబడులపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేశారని....నేడు అదే నోటితో తాము చెప్పింది అబద్ధమని అంగీకరించాల్సి వచ్చిందని విమర్శిస్తున్నారు.