బాబు అరెస్ట్... జగన్ కు జన్మలో సాధ్యం కాదంతే

May 25, 2020

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన వైసీపీ సాగిస్తున్న తంతును చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం వేయక మానదు. జగన్ సీఎం పీఠం ఎక్కిన నాటి నుంచి టీడీపీని కూకటి వేళ్లతో పెకిలించేయడంతో పాటుగా ఏ క్షణాన్నైనా చంద్రబాబును అరెస్ట్ చేస్తామంటూ తమదైన శైలిలో ప్రకటనలు గుప్పిస్తూ వస్తోంది. టీడీపీని గమనంలో లేకుండా చేయడమేమో గాేనీ... ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయితే చాలంటూ జగన్ వర్గం ఓ రేంజిలో వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు ఇటీవల పలువురు టీడీపీకీ చెందిన వ్యక్తులతో పాటు టీఆర్ఎస్ మిగిలిన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై ఐటీ శాఖ చేసిన దాడులను... కేవలం టీడీపీ నేతల మీదే దాడులు జరిగినట్లుగా వైసీపీ చిత్రీకరిస్తున్న తీరు.... ఆ పార్టీ వాదనను జనంలోకి బలంగా చొచ్చుకెళ్లేలా చేస్తున్న జగన్ పత్రి సాక్షి రాస్తున్న రాతలు నిజంగానే రోత పుట్టిస్తున్నాయని చెప్పక తప్పదు.

సాధారణంగా ఎక్కడ దాడులు జరిగినా... ఆ దాడుల వివరాలను, దాడుల్లో లభ్యమైన నగదు, నగలు ఇతరత్రా వివరాలను ఆదాయపన్ను శాఖ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి వెల్లడించడం ఆనవాయితీ. ఆ వివరాలను సీబీడీటీ మీడియాకు ప్రకటనల రూపంలో విడుదల చేయడం కూడా సర్వసాధారణమే. ఈ క్రమంలో మొన్నటి ఐటీ దాడులకు సంబంధించి సీబీడీటీ ఓ ప్రకటన వెలువరించడం, దానిలో రూ.2 వేల కోట్ల మేర అక్రమాలు వెలుగు చూశాయని ఆ శాఖ వెల్లడించడంతో... అదే అదనుగా బాబుపైకి వైసీపీ మరో కుట్రకు తెరలేపింది. ఈ కుట్రలో భాగంగా దేశంలోని 40 ప్రాంతాల్లో తాము దాడులు చేశామని ఐటీ చెబుతుంటే... ఆ దాడులన్నీ కేవలం టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లోనే జరిగినట్లుగా వైసీపీ ప్రచారం చేసింది. అంతేకాకుండా రూ.2 వేల మేర అక్రమాలు కూడా కేవలం టీడీపీ వాళ్ల వద్దే లభించాయని, అవన్నీ కూడా కేవలం చంద్రబాబుకు మాత్రమే డబ్బు దోచిపెట్టేవేనని ప్రచారం చేసింది.

ఈ మొత్తం ప్రచారంలో చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు ఇంటిలో లభించిన నగదు, నగలు ఇవేనంటూ ఐటీ శాఖ రూపొందించిన పంచనామా ఇప్పుడు వైసీపీ కుట్రలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పక తప్పదు. పెండ్యాల ఇంటిలో ఐటీ శాఖ కేవలం రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారాన్ని మాత్రమే సీజ్ చేసింది. అంతేకాకుండా ఆ మొత్తం ఎవరి ఇంటిలోనైనా ఉండేవనంటూ వాటిని కూడా వదిలేసి వెళ్లిందట. అదేదో బ్రహ్మ పదార్థమంటూ వైసీపీ నేతలు సదరు ఐటీ పంచనామాను చూపి చిందులు తొక్కాలనుకున్నారు. అయితే అదే పంచనామా ప్రతి వారి కుట్రలను బట్టబయలు చేస్తుందని ఊహించలేకపోయారు. 2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం ఎక్కడ... రూ.2 వేల కోట్ల మేర అక్రమాలెక్కడ. నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కదూ. అంతే మరి... ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలు ఇలానే ఉంటాయి. బాబును ఇరికించడానికి ఆధారాలు లేకుండా వైసీపీ చేసే కుట్రలు కూడా ఇలానే ఉంటాయి మరి. మరి చెప్పొచ్చేదేమంటే... ఇప్పుడు కాదు కదా... జగన్ బితికున్నంత కాలం, వైసీపీ గమనంలో ఉన్నంత కాలం టీడీపీని కాదు కదా... చంద్రబాబును ఇసుమంత అవినీతిలో కూడా ఇరికించలేరనే కదా.