ఏపీలో ఉన్నతాధికారులకు కొత్త కొత్త అనుభవాలు - ఇదేం పోయేకాలం

August 10, 2020
చట్టాలు, నిబంధనలు పట్టవు
కొందరు అధికారులపై కత్తిగట్టి సస్పెన్షన్లు
నోరెత్తితే పిచ్చోళ్లంటూ ముద్ర
పోలీసులతో దాష్టీకం
మానవ హక్కులకు విలువ లేదు
ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?
జగన్‌ తీరుపై ఉన్నతాధికారులు బెంబేలు

పరిపాలన అంటే ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడం.. ప్రభుత్వం అంటే సామ్రాజ్యం.. తానే సర్వంసహా చక్రవర్తి. తాను చెప్పిందే రాజ్యాంగం.. అంబేడ్కర్‌ వంటి మేధావులు రాసిన భారత రాజ్యాంగం ఓ పూచికపుల్ల.. చట్టాలు, నిబంధనలు తనకు వర్తించవు. తనపై ఎవరు గళమెత్తినా తొక్కేస్తారు. తనపై సీబీఐ కేసులకు ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌ కారణమని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కక్ష పెంచుకున్నారు.
 
తన ఎమ్మెల్యేలను బెదిరించి టీడీపీలో చేరేలా చేశారని నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావునూ టార్గెట్‌ చేశారు. అందుకే సీఎం కాగానే వారిని పక్కకు తప్పించి పోస్టింగ్‌ ఇవ్వలేదు. కనీసం జీతభత్యాలు కూడా చెల్లించలేదు. గత ప్రభుత్వంలో ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవోగా ఉన్నప్పుడు కృష్ణకిశోర్‌.. తన మాతృసంస్థ, కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆదాయ పన్ను శాఖకు వెళ్లిపోతానన్నా రిలీవ్‌ చేయలేదు సరికదా..
 
ఈడీబీలో అవినీతికి పాల్పడ్డారని ఏకంగా సస్పెండ్‌ చేశారు. సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. నిఘా పరికరాల కొనుగోళ్ల కాంట్రాక్టును తన కుమారుడి సంస్థకు ఇప్పించేందుకు ప్రయత్నించారని ఏబీవీని కూడా సస్పెండ్‌ చేశారు.
 
హైకోర్టు జోక్యం చేసుకుని చాచి లెంపకాయలు కొట్టింది. కృష్ణకిశోర్‌ తన మాతృసంస్థకు వెళ్లిపోయారు. పదోన్నతిపై ఐటీ ప్రధాన కార్యాలయంలో కీలక పోస్టులో చేరారు. దీనినిబట్టే ఆయనెంత సమర్థుడైన అధికారో తెలియడం లేదా! జగన్‌ పత్రిక సాక్షిని ప్రచురించే జగతి పబ్లికేషన్స్‌ షేర్‌ విలువ పది రూపాయలు కూడా చేయదని..
 
కానీ రూ.350కి పెంచి చూపించారని కృష్ణకిశోర్‌ గతంలో నిరాఽ్ధరించారు. దీని ఆధారంగానే సీబీఐ జగన్‌, విజయసాయిరెడ్డిపై 12 చార్జిషీట్లు నమోదుచేసింది.
 
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పలు కంపెనీల ఆస్తులను జప్తుచేసింది. విలువ పెంచి చూపించామని ప్రముఖ ఆడిట్‌ సంస్థ డెలాయిట్‌ కూడా ఆ తర్వాత అంగీకరించింది. 2006లో జగతి పబ్లికేషన్స్‌ విలువ రూ.146 కోట్లు కాగా.. మరుసటి ఏడాదికి రూ.3,450 కోట్లకు పెంచేశారు.
 
తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. కొన్ని కంపెనీలకు ప్రభుత్వ ప్రయోజనాలు సమకూర్చి.. ఆయా కంపెనీలతో జగతి షేర్లు కొనిపించిన ఘనుడు జగన్‌.
 
లంచాలు తీసుకోకుండా.. సొంత సొమ్ము పైసా లేకుండా కంపెనీలను ఇందులో భాగస్వాములను చేసి.. ఆ తర్వాత ఆ వాటాలను తాను కొనుగోలు చేసినట్లు చూపారన్న మాట. ఇది బయటపెట్టినందుకే కృష్ణకిశోర్‌పై జగన్‌ కక్ష పెంచుకున్నారని బహిర్గతమైంది,

ఏబీవీకి ఊరట
ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఫిబ్రవరి 8వ తేదీన జారీ చేసిన ఆదేశాలను న్యాయస్థానం కొట్టివేసింది. ఆయన సస్పెన్షన్‌ను సమర్థిస్తూ... ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) మార్చి 17వ తేదీన ఇచ్చిన ఆదేశాలనూ రద్దు చేసింది.
 
ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఆయనకు రావాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని స్పష్టం చేసింది.
 
అధికారులు ఆరోపణలు ఎదుర్కొనేటప్పుడు.. వాటిపై విచారణ కోసం సర్వీసు నిబంధనల్లో తగినంత గడువు నిర్దేశించారని, వెంకటేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలపై ఆ గడువులోగా విచారణను పూర్తి చేయాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. కక్ష సాధింపులో భాగంగానే ఏబీవీని సస్పెండ్‌ చేశారన్నది జగద్విదితం. సాధారణంగా ఎవరైనా అధికారి తప్పు చేస్తే దానిపై విచారణ జరిపించడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సహజం.
 
అయితే ఏబీవీ విషయంలో ఆయనేదో పొరపాటు చేశారు కనుక సస్పెండ్‌ చేయడం కాకుండా... సస్పెండ్‌ చేయాలని ముందుగానే నిర్ణయం తీసుకుని.. ఆ తర్వాత దానికోసం సాకులు వెతికారు. రక్షణ పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని, వాటిని తన కుమారుడి కంపెనీకి కాంట్రాక్టుకు ఇచ్చి తెప్పించారన్నది ఆయనపై సర్కారు మోపిన అభియోగం.
 
అయితే అసలా పరికరాలు కొనుగోలు చేశారా.. చేస్తే వచ్చాయా.. వాటికి బిల్లుల చెల్లింపు జరిగిందా తదితర విషయాలేమీ రూఢి కాలేదు. సస్పెండ్‌ చేసి నెలలు గడుస్తున్నా.. సదరు ఆరోపణలకు ప్రభుత్వం రుజువులు చూపించలేకపోయింది.
 
దీనివల్లే హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. చంద్రబాబు హయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలువురు ఐఏఎస్‌ అధికారులకు ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలని ఒత్తిళ్లు తెస్తోంది.
 
డాక్టర్లపై అమానుషం..
కరోనా వైరస్‌ నేపథ్యంలో డాక్టరకు, పారామెడికల్‌ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లే ఇవ్వలేదన్నందుకు నర్సీపట్నం ఎనస్తీషియన్‌ డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేశారు. అంతటితో ఆగకుండా అనాగరికంగా ఆయనపై పోలీసులతో కొట్టించి.. పెడరెక్కలు విరిచికట్టి రోడ్డుపై పడేసి.. మద్యం తాగి ఉన్నాడని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
 
చివరకు మానసిక స్థితి సరిగా లేదని మెంటల్‌ హాస్పిటల్‌లో పడేశారు. పిచ్చెక్కించే మందులిచ్చారు.
 
పిచ్చాసుపత్రిలో చేర్చాలంటే ముందు కోర్టు అనుమతి తీసుకోవాలి. మానసిక స్థితి సరిగా ఉందో లేదో... ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలో మెడికల్‌ బోర్డు నిర్ణయించాలి. కానీ సుధాకర్‌ పిచ్చివాడని జగన్‌ చెప్పాడు కాబట్టి పోలీసుల నుంచి డాక్టర్ల దాకా స్వామిభక్తి ప్రదర్శించి ఆయన్ను పిచ్చోడిని చేయాలని చూశారు.
 
పిచ్చోడని సర్టిఫికెట్‌ ఇచ్చేశారు. ఆయన విషయంలో దారుణంగగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. మెంటల్‌ ఆస్పత్రిలోకి చివరకు ఆమె తల్లిని కూడా అనుమతించకుండా చికిత్స చేశారు.
 
తనకు ఇక్కడ సరైన చికిత్స అందడం లేదని మరో ఆస్పత్రికి తరలించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పట్టించుకోకుండా.. మేం ఇలాగే చేస్తామనడం.. చికిత్స చేసే డాక్టర్లను రోజూ మార్చడం అనేక అనుమానాలకు కారణమయ్యాయి.
 
ఈ సంఘటన జరిగిన రెండ్రోజుల తర్వాత హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచాలని కూడా పేర్కొంది. కానీ అప్పటికప్పుడు ఒక కమిటీ వేసి, ఆయనకు మానసిక స్థితి సరిగాలేదని హైకోర్టు వరకు ప్రయాణించడం కష్టమని ఒక అఫిడవిట్‌ సమర్పించింది.
 
అయితే ప్రభుత్వ తీరును అనుమానించిన హైకోర్టు.. నిజనిర్ధారణకు, అక్కడ జరుగుతున్న తంతును స్వయంగా పరిశీలించడానికి ఒక న్యాయాధికారిని ఆస్పత్రికి పంపింది. డాక్టర్‌ సుధాకర్‌ వాంగ్మూలాన్ని నమోదు చేయించింది. ఆయన శరీరంపై ఒకటే గాయం ఉందని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొనగా.. న్యాయాధికారి ఆరు గాయాలను గుర్తించారు.
 
సుఽధాకర్‌ మామూలుగానే మాట్లాడారు. జరిగిందంతా వివరించారు. తనను పోలీసులు కొట్టినవైనం, పిచ్చాస్పత్రికి తరలింపు.. అక్కడ జరుగుతున్న చికిత్స తదితరాల గురించి పూసగుచ్చినట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్దేశాలను పసిగట్టిన హైకోర్టు దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు ఆదేశించింది.
 
ఆ సంస్థ దర్యాప్తు సాగిస్తోంది. హైకోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆయన విడుదలయ్యారు. నిజానికి కోర్టు తగినంత సమయం ఇచ్చినా...ప్రభుత్వం తప్పు దిద్దుకోలేదు. డాక్టర్‌ సుధాకర్‌ పట్ల మానవతా దృక్పథంతో కాకుండా,  ‘మమ్మల్నే విమర్శిస్తావా’ అనే కసి, కోపమే కనిపించింది. సీబీఐ విచారణ జరుగుతున్నా ఈ ధోరణిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు.
 
వాస్తవాలేమిటో బయటి ప్రపంచానికి తెలియకుండా కట్టడిచేశారు. ఈ సంఘటనను ప్రభుత్వం, అధికార యంత్రాంగం మానవ హక్కులపై చేస్తున్న దాడిగా అభివర్ణిస్తూ అంతర్జాతీయ పత్రికల్లో సైతం వార్తాకథనాలు వెలువడడంతో ఆంధ్ర పరువు మరోసారి మంటగలిసింది.

బాధితురాలిపైనే దర్యాప్తు
చిత్తూరు జిల్లా పెనుమూరు పీహెచ్‌సీ డాక్టర్‌ అనితారాణి విషయంలో మరింత ఘోరం. ఆమె బాత్రూంలో ఉంటే వైసీపీ స్థానిక నేతలు ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేశారు. ఆమె కంప్లయింట్‌ ఇస్తే జిల్లా వైద్యాధికారి ఆమెపైనే చర్యలు తీసుకున్నారు. చిత్తూరు టీబీ వార్డుకు బదిలీచేశారు. ఈ విషయం బయటకు పొక్కేసరికి ఆమెకు మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రకటించారు.
 
ఆమె ఆరోపణలపై వైసీపీ నేతలను విచారించాల్సిన సీఐడీ.. ఆమె ఇంట్లోకి చొరబడి ఇంటరాగేషన్‌ చేయడం ఏమిటో.. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థమే కావడం లేదని కొందరు ఉన్నతాధికారులు అంటున్నారు.
 
అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న సందేహం కలుగుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.