తల్లి ఉసురు తప్పదు, ప్రభుత్వానికి కళ్లు లేవా - డా. సుధాకర్ తల్లి

August 14, 2020

‘‘జీవితాంతం ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఉన్నంతలో మంచి చేయాలి.  ఇంత చండాలం ఎన్నడూ చూడలేదు. కళ్లు మూసుకుని ప్రభుత్వాన్ని ఏలుతున్నారా... ఒక తల్లి ఉసురు తగులుతుంది. జగన్ కీ తల్లి ఉంది. కానీ ఒక తల్లి బాధ అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ తల్లి పడే బాధ తెలుసుకోలేకపోతున్నాడు’’ అని తీవ్ర ఆవేదన చెందారు కావేరీ భాయి.    

15 రోజులుగా ఎంతో ఆరోగ్యంగా ఉన్న తన కొడుకును పిచ్చాసుపత్రిలో ఉంచారని... వాడికి ఏమవుతుందో అన్న భయంతో బతుకుతున్నామని సుధాకర్ తల్లి కావేరీ భాయి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టరు పలకరింపుతోనే రోగికి సగం జబ్బు తగ్గాలి. కానీ అక్కడున్న డాక్టరు రామిరెడ్డి తన కొడుకు మీద కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక డాక్టర్ అయ్యి ఉండి అవసరం లేని వైద్యం చేస్తున్నాడంటే... తన బిడ్డ ఏం కావాలని ఆమె ప్రశ్నించారు.

ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుని పాలిస్తోంది. జగన్ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. మా సొంత ఖర్చులతో మా బిడ్డకు ట్రీట్ మెంట్ ఇప్పించుకుంటాం. దయచేసి అతన్ని విడిచిపెట్టండి అని ఆమె కోరారు. ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే బిడ్డకు ప్రాణహాని ఉందని భయమేస్తోందన్నారు. సుధాకర్‌పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అతన్ని వేధించడానికి సుధాకర్‌పై తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని ముద్ర వేశారు. డాక్టర్లపై రాజకీయ ముద్ర ఎలా వేస్తారు. అతను ఏమైనా పార్టీల కోసం తిరిగాడా? డ్యూటీకి వెళ్తాడు. వస్తాడు. అలాంటి వాడి మీద ఎలా రాజకీయ ముద్ర వేస్తారని ఆమె ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వానికి కళ్లు మూసుకుపోయాయి. సుధాకర్ కు చికిత్స ఇస్తున్న డాక్టర్‌ రామిరెడ్డి 15 రోజుల్లో కేవలం రెండు సార్లు మాత్రమే ఆస్పత్రికి వచ్చారు. రామిరెడ్డి తన కొడుకును వేధిస్తున్నాడు. ఈ మేరకు సుధాకర్ తో మాట్లాడిన కాల్ రికార్డును ఆమె మీడియాకు వినిపించారు. ఇదేం రాజ్యమయ్యా... ఒక డాక్టరును పట్టుకుని ఇంత వేధిస్తారా? కనీసం మనిషి అన్న కనికరం లేదా?