జగన్... ఆ తీర్పు చదువు, లేకపోతే బుక్కవుతావు- చంద్రబాబు

August 10, 2020

జగన్ మోహన్ రెడ్డి... తప్పు ఒప్పులను బేరీజు వేయకుండా, తదనంతర పరిణామాలను పట్టించుకోకుండా... తనకు నచ్చింది మాత్రమే చేసే మనిషి. పార్టీ వరకు అయితే, ఈ సిద్దాంతం చెల్లుతుంది గానీ ప్రభుత్వంలో అలా కుదరదు. అందుకే 151 మంది ఎమ్మెల్యేలున్నా అడుగడుగునా ఇబ్బందులు, ఆటంకాలే. రాజ్యాంగ అవగాహన లేక ఇంటా బయటా ఎదురుదెబ్బలు. తప్పులు ఎవరైనా చేస్తారు. దిద్దుకున్న వారు గెలుస్తారు, ఇగోకు పోతే త్వరగా ఓడిపోతారు. మరి ఏ దారి ఎంచుకోవాలన్నది జగన్ చేతిలోనే ఉంటుంది.

వైజాగ్ ప్రమాదం నేపథ్యంలో స్పందించిన చంద్రబాబు రెండు విషయాలను జగన్ కి తగిలేలా వివరించారు. నచ్చింది చేయడం పెద్ద విషయం కాదు, నచ్చేలా చేయడమే ముఖ్యం. నచ్చాల్సింది సొంతమనుషులకు కాదు, సమాజానికి అంటూ చురకలేశారు. 

ప్రమాదాలు జరిగినపుడు ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి. తదుపరి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అది సమాజానికి తీవ్ర విపత్తుగా పరిణమిస్తుంది. ఎల్జీ పాలిమర్స్ వంటి దుర్ఘటన జరిగినపుడు మేల్కొన్నట్టు నటించారు. కానీ చర్యలు లేవు. పరిశ్రమల నిర్వహకులను ఇష్టానికి వదిలేశారు. దీంతో రెండు వారాల్లో రెండు ప్రమాదాలు జరిగాయి. బాధితుల వైపు కాకుండా అపుడు, ఇపుడు యాజమాన్యాల వైపే ప్రభుత్వం మొగ్గుచూపడం విచారకరం అన్నారు. నివారణ లేదు, అంతకుమించి నిర్లక్ష్యం ఉందని జగన్ ని తప్పు పట్టారు.

ఈ సందర్భంగా మాన్సాస్ ట్రస్టుపై కూడా చంద్రబాబు జగన్ కి ఒక చక్కటి ఉదాహరణతో జ్జానోదయం కల్పించే ప్రయత్నం చేశారు. జగన్ తాజాగా సుప్రీంకోర్టు కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయ నిర్వహణపై సోమవారం ఇచ్చిన తీర్పును చదువుకోవాలన్నారు. అది ఒక మైలురాయి వంటి తీర్పు అన్నారు. ట్రస్టుల నిర్వహణలో సంప్రదాయాల పవిత్రతను సుప్రీంకోర్టు రక్షించిందన్నారు.  సింహాచలం బోర్డు, మాన్సాస్ ట్రస్టు విషయంలో జోక్యం మానేయాలని జగన్ ను ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇంతకీ సుప్రీంకోర్టు ఏమందంటే... ప్రభుత్వ జోక్యం చెల్లదు, ట్రావెంకోర్ రాజులవే ట్రస్టు అధికారాలు అని తేల్చి చెప్పింది.