రౌడీ షీటర్లకు జగన్ బంపరాఫర్... !!

May 25, 2020

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్రకు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత...అంతకుముందు పాలన సాగించిన టీడీపీపై, ఆ పార్టీ నేతలపై ఓ రేంజిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా గురువారం నాడు విశాఖలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును అడ్డగించిన వైనం నిలుస్తోంది. ఇప్పటిదాకా కక్షసాధింపు పాలనకు మాత్రమే పరిమితమైన జగన్... ఇప్పుడు కొత్తగా రౌడీ రాజ్యానికి శ్రీకారం చుట్టారని కూడా చెప్పాలి. ఎందుకంటే... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో ఓపెన్ అయిన రౌడీ షీట్లను జగన్ సర్కారు ఎత్తివేస్తోంది. అంటే... సమాజంలో రౌడీలుగా ముద్రపడి అరాచకాలకు కేంద్ర బిందువులుగా మారిన రౌడీలందరికీ జగన్ స్వేచ్ఛ ఇస్తున్నారన్న మాట.

ఈ దిశగా ఇప్పుడు ఏపీలో రాజకీయంగానే కాకుండా అన్ని విషయాల్లోనూ కీలకమైన జిల్లాగా పరిగణిస్తున్న కృష్ణా జిల్లాలో రౌడీ షీట్ల ఎత్తివేత తంతు మొదలైపోయింది. శనివారం ఒక్క రోజే జిల్లావ్యాప్తంగా 210 రౌడీ షీట్లను ఎత్తివేశారు. వీటిలో జిల్లా కేంద్రం మచిలీపట్నం కేంద్రంగా నమోదైన 126 రౌడీ షీట్లను ఎత్తివేయగా... అవనిగడ్డ పరిధిలో నమోదైన 84 రౌడీ షీట్లను ఎత్తివేశారు. ఇక మరో రెండు, మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా నమోదైన రౌడీ షీట్లను కూడా ఎత్తివేసే దిశగా జగన్ సర్కారు పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. ఈ చర్య ద్వారా ఇప్పటిదాకా రౌడీ షీట్ల నమోదుతో ఒకింత చేతులు కట్టేసుకుని కూర్చున్న అరాచక శక్తులు ఇకపై పేట్రేగిపోవడం ఖాయమేనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

అయినా తాను అధికారంలోకి వస్తే... రాజన్య రాజ్యాన్ని తీసుకువస్తానని చెప్పిన జగన్... ఇలా తన పాలన ఏడాది కూడా పూర్తి చేసుకోకముందే రాష్ట్రవ్యాప్తంగా రౌడీ షీట్లను ఎత్తివేసే దిశగా ఎందుకు నిర్ణయం తీసుకున్నాన్న విషయంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. రౌడీ షీట్లతో చేతులు కట్టేసుకుని కూర్చున్న రౌడీలంతా జగన్ ఇస్తున్న స్వేచ్ఛతో రెచ్చిపోతే జరిగే నష్టానికి బాధ్యత ఎవరన్న ప్రశ్న కూడా బలంగానే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... రౌడీ షీట్ల ఎత్తివేతలోనూ జగన్ బ్యాచ్ తమ వర్గానికి చెందిన వారు, తమకు అనుకూలంగా ఉంటారన్న వారితో పాటు తమ పార్టీకి చెందిన వారిపై ఉన్న రౌడీ షీట్లనే ఎత్తివేస్తున్నట్గుగా ప్రచారం సాగుతోంది. మరి జగన్ స్వచ్ఛ ఇస్తున్న రౌడీ షీటర్లకంతా స్వేచ్ఛ వచ్చేస్తే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.