బొత్స సంచలనం... మూడో సస్పెన్షన్ తప్పదంట

April 07, 2020

ఏపీ సీఎంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత... టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు (వైసీపీ చేసినవే) అధికారులపై వరుస చర్యలు షురూ అయిపోయాయి. ఈ తరహా చర్యలు ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగానే మారిపోయాయని చెప్పక తప్పదు. ఇప్పటిదాకా ఇద్దరు కీలక అధికారులను సస్పెండ్ చేసిన జగన్ సర్కారు... అంతటితో ఈ చర్యలను ఆపేది లేదని, మున్ముందు మరింత మంది అదికారులపై చర్యలు తప్పవని కూడా స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఈ తరహా వార్తలకు తాజాగా వైసీపీ కీలక నేత, మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం చేసిన ఓ కామెంట్ నిదర్శనంగా నిలుఃస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

అయినా బొత్స నోట నుంచి వచ్చిన మాట ఏమిటన్న విషయానికి వస్తే... ‘‘అవినీతి ఆరోపణలపైనే ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఏబీతో పాటు మరో అధికారిపై ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతానికి ఓ అధికారిపై వేటు పడింది. త్వరలో మరో అధికారిపైనా చర్యలు తీసుకోనున్నాం’’ అని బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. బొత్స వ్యాఖ్యలు చూస్తుంటే... ప్రస్తుతం ఐటీ దర్యాప్తు చేస్తున్న అధికారి పెండ్యాల శ్రీనివాసరావే. గతంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వద్ద పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన పెండ్యాలపై ఐటీ శాఖ గడచిన ైదు రోజులుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.

అంటే.. ఆ మధ్య ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ ను సస్సెండ్ చేసిన జగన్ సర్కారు... ఆయనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై జాస్తి... సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్)ను ఆశ్రయించగా... ఆ వివాదం క్యాట్ లో విచారణ సాగుతోంది. ఈ వ్యవహారంపై క్యాట్ లో విచారణ సాగుతున్నా... జగన్ సర్కారు జాస్తిపై దర్యాప్తును కొనసాగిస్తూనే ఉంది. తాజాగా రెండు రోజుల క్రితం సీనియర్ ఐపీఎస్ అదికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావును రాత్రికి రాత్రే సస్పెండ్ చేసిన జగన్ సర్కారు... జాస్తికి మాదిరే ఏబీపైనా దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బొత్స వ్యాఖ్యలతో పెండ్యాలపైనా సస్పెన్షన్ వేటు పడటం ఖాయంగానే కనిపిస్తోంది.