ఏపీలోనే కాదు.. ఆ మాటకు వస్తే మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ లేని విధంగా విశాఖ సీపీ ఆర్కే మీనా ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. ఈ ఉత్తర్వుల గురించి విన్న వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లౌకిక రాజ్యంలో ఏ ఒక్క మతానికి ప్రత్యేకత ఇవ్వరు. అన్ని మతాలు సమానమే. అలాంటప్పుడు విశాఖ పరిధిలోని చర్చిలకు ప్రత్యేక భద్రత కల్పించే రీతిలో ఉత్తర్వులు ఇవ్వటం ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఈ వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి జగన్ ఉన్నారన్న ప్రచారం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటే రాష్ట్రం మొత్తం ఇస్తారు కానీ..ఒక్క విశాఖపట్నంలోనే ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్నను సంధిస్తే ఆసక్తికర సమాధానాన్ని చెబుతున్నారు.
ఏపీలోని విశాఖపట్నం అంటే సీఎం జగన్ కు కోపమని.. స్టీల్ సిటీపై యువనేత పగబట్టినట్లుగా చెబుతారు. ఎందుకలా? అంటే విశాఖ వాసుల నోటి నుంచి వచ్చిన సమాధానం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. 2014 ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ విశాఖ ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె గెలుపు నల్లేరు మీద నడక అనుకున్నా.. విశాఖ ప్రజలు మాత్రం అందుకు భిన్నంగా ఆమెను ఓడించారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇదో సంచలనమైంది.
అప్పటి నుంచి విశాఖపట్నం అంటే జగన్ కు అగ్రహంగా చెబుతారు. తన తల్లిని ఓడించిన విశాఖలో తాను నమ్మిన మతాన్ని మరింత బలోపేతం చేయటం ద్వారా.. రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా తిరుగులేని రీతిలో ఎగరాలన్న ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నట్లు కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి.
నిజానికి ఈ ఆరోపణకు ఎలాంటి రుజువులు లేకున్నా.. వారి వాదనలు మాత్రం లాజిక్ ను టచ్ చేసేలా ఉండటంతో ఈ వాదనకు బలం అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తోడు తాజాగా బీజేపీ ధార్మిక విభాగం రంగంలోకి దిగి.. రాష్ట్ర సీఎం తాను నమ్మిన మతాన్ని ఫాలో అయ్యే వారికే రక్షణ కల్పిస్తామని సీపీ తాజా ఉత్తర్వులతో పరోక్షంగా చెప్పినట్లైందంటున్నారు. ఈ ఉత్తర్వుల మీద ప్రచారం అంతకంతకూ పెరిగే కొద్దీ.. జగన్ ఇమేజ్ అదే స్థాయిలో డ్యామేజ్ కావటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.