జగన్ ఐడియాతో జగన్ కే చుక్కలు చూపిస్తున్న రఘురామరాజు

August 05, 2020

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ... అసెంబ్లీ దద్దరిల్లేలా ఓ మాట చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించను అని, ఎవరైనా తన పార్టీలోకి రావాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని అన్నారు.

కట్ చేస్తే ఆరు నెలలకే యథావిధిగా మాట తప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను తన వైపు లాక్కున్నారు. జనసేన ఏకైక ఎమ్మెల్యేను తనవైపు తిప్పుకున్నారు ముఖ్యమంత్రి జగన్. వారు బహిరంగంగా జగన్ ని పొగుడుతున్నారు, తాము గెలిచిన చంద్రబాబును తిడుతున్నారు.

కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలిగిరి గెలిచింది తెలుగుదేశం పార్టీలో. కానీ వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతారు. అదేపనిగా తమ పార్టీ అధినేత చంద్రబాబును తిడతారు. మరి వీటిని ఫిరాయింపులు అనక ఏమంటారు? రాకాపా వర ప్రసాద్ గెలిచింది జనసేన పార్టీలో. ఆయన పవన్ ను తిట్టడం లేదు గాని వైసీపీలో చేరిపోయినట్లే మానసికంగా.

ఇంకా తమాసా ఏంటంటే... వైసీపీ నుంచి గెలిచిన ఎంపీ రఘురామరాజు జగన్ ను పల్లెత్తు మాట అనకుండా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే నీకిష్టం లేకపోతే రాజీనామా చేసిపో, పార్టీలో ఉంటూ పార్టీని వ్యతిరేకిస్తావా? మాలాగా కుక్కతో పోటీపడుతూ జగన్ కు విశ్వాసంగా ఉండాలి, జగన్ బొమ్మతో గెలిచి జగన్ ను తిడతావా? ఇది అధర్మం అంటున్నారు.

మరి ఇవే కామెంట్లు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరికి వర్తించవా? వారు చంద్రబాబు సీటిచ్చి గెలిపిస్తే ఎందుకు తిడుతున్నారు. రాజీనామా చేయంని చెప్పరెందుకు. సరిగ్గా ఇదే లాజిక్ తో చెలరేగిపోతున్నారు వైసీపీ ఎంపీ రఘురామరాజు. 

వంశీ, కరణం, గిరి, రాపాక లాగనే... వేరే పార్టీలో అఫిషియల్ గా చేరకుండా సొంత పార్టీకి దూరం జరుగుతున్నారు. ఇపుడు రఘురామ రాజును ప్రశ్నించాలంటే ముందు ఈ నలుగురిని ప్రశ్నించాలి. రఘురామ కృషరాజుతో రాజీనాామా చేయడమే నైతికత, ధర్మం అయితే... ఈ నలుగురు కూడా రాజీనామా చేయాలి. అపుడే కదా లెక్క కుదిరేది. 

కాబట్టి... రఘురామరాజును ఏం చేయాలనేది పార్టీ చేతిలో ఉంది. దమ్ముంటే సస్పెండ్ చేయొచ్చు. లేదంటే వదిలేయొచ్చు. లేదు రాజీనామా చేయాలంటే... రఘురాముడితో పాటు ఈ నలుగురిని రాజీనామా చేయమని డిమాండ్ చేయాలి. అపుడే వైసీపీకి ధర్మం, నైతికత ఉన్నట్టు జనం అంగీకరిస్తారు.

లేదంటే... జగన్ ఇచ్చిన ఐడియాతో చెలరేగిపోతున్న RRR ని సైలెంటుగా భరించాలి.