లోకల్ బరిలో ‘క్రిమినల్’ పావు... జగన్ కు బూమరాంగేనా?

June 01, 2020

నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సదరు దూకుడు జగన్ కు ఏ మేర ప్రయోజనం చేస్తుందో తెలియదు గానీ... ప్రతీదీ బూమరాంగ్ అయ్యే ప్రమాదమే కనిపిస్తోంది. ఇప్పటికే చాలా నిర్ణయాలు జగన్ కు ఎదురు దెబ్బేయగా... తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు జగన్ ఎంచుకున్న అస్త్రం... ఏకంగా ఆయనకే ఎదురు తన్నేలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సదరు అస్త్రం ద్వారా జగన్ కు ఎదురు తన్నులు తర్వాత... ఇప్పుడు సదరు విషయంపై సోషల్ మీడియా వేదికగా జగన్ పై భారీ స్థాయిలో డైరెక్టుగానే సెటైర్లు పడిపోతున్నాయి.

లోకల్ బాడీ ఎన్నికల్లో విపక్షం టీడీపీకి చెక్ పెట్టేందుకు జగన్... ఏకంగా క్రిమినల్ కేసుల అస్త్రాన్ని ఎంచుకున్నారు. ఎన్నికల్లో డబ్బు పంచినా, మద్యం పంచినా... అనర్ణత వేటు వేస్తానని జగన్ సర్కారు ఇటీవలే ప్రకటించింది. అంతేకాకుండా అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తూ ఏకంగా జీవోను కూడా జారీ చేసి పారేసింది. తాజాగా దీరనికి కొనసాగింపుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రిమినల్ కేసులు నమోదైన వ్యక్తులను అనర్హులుగా ప్రకటిస్తామని కూడా జగన్ సర్కారు ప్రకటించింది. ఎవరైనా ఇలాంటి కేసులను దాచేసి సర్పంచ్ గానో, లేదంటే జడ్పీటీసీగానో, ఎంపీటీసీగానో, లేదంటే ఎంపీపీగానో ఎన్నికైనా... క్రిమినల్ కేసులు ఉన్నాయని తర్వాత తెలిసినా... వారిని అనర్హులుగా ప్రకటిస్తూ పదవి నుంచి పంపించేస్తామని జగన్ సర్కారు ప్రకటించింది.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో నెటిజన్లు జగన్ వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే 11 కేసులను ఎదుర్కొంటున్న జగన్ పై సీబీఐతో పాటు ఈడీ కూడా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న నెటిజన్లు... ఒక్క క్రిమినల్ కేసు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనర్హులను చేసేస్తానంటూ బీరాలు పలుకుతున్న మీకు... 11కు పైగా కేసుల్లో బెయిల్ పై బయట ఉన్న సీఎం కుర్చీలో కూర్చునే హక్కు ఉందా? నెటిజన్లు అదిరేటి సెటైర్లు సంధిస్తున్నారు. అంతేకాకుండా అసలు క్రిమినల్ కేసులను బూచిగా చూపి ఎన్నికల్లో అనర్హులను చేయాలంటే తొలుత వేటు పడేది మీ మీదేనంటూ కూడా మరింత ఘాటు పోస్టులు పోస్టవుతున్నాయి. మొత్తంగా క్రిమినల్ అస్త్రాన్ని ఆసరా చేసుకుని విపక్షాన్ని దెబ్బతీయాలని ప్లాన్ వేస్తున్న జగన్ కు అదే విషయంలో అదిరిపోయే సెటైర్లు స్వాగతం చెబుతున్నాయి.