అమరావతి స్పెషల్: ప్రజలను కష్టపెట్టి పైసలు మిగులుస్తానంటున్న జగన్

July 07, 2020
CTYPE html>
రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు నిర్ణయాలు.. అక్కడ ప్లాన్ చేసిన భారీ ఏర్పాట్లు, నిర్మాణాలు, వసతులు.. ఇలా అన్నిటి విషయంలోనూ వైసీపీ చేసిన ఆరోపణలు అన్నీఇన్నీ కావు. రాజధానికి అంత హడావుడి అవసరమా? అంటూ పాదయాత్రలో ప్రతి ఊర్లోనూ ప్రశ్నించారు జగన్. ఇప్పుడు సీఎం సీట్లో ఉన్నది ఆయనే. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను కూడా సవరించాలని నిర్ణయించారు. చంద్రబాబు రాజధాని ప్లానింగ్‌లో లక్ష తప్పులను ఎంచిన జగన్ ఇప్పుడు ఆ తప్పుల తడక మాస్టర్ ప్లానులో ఎలాంటి మార్పులు చేయబోతున్నారో, ఎంత మిగుల్చుతున్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే. అన్ని కోట్ల ప్రాజెక్టులో ఆయన మిగుల్చుతామంటున్నది రూ.543 కోట్లే. అది కూడా ... సిమెంటు రోడ్లకు బదులు తారు రోడ్లు వేయడంద్వారానట. అంతేకాదు.. చంద్రబాబు ఎంతో ముందుచూపుతో ప్లాన్ చేసిన పాదచారులకు ప్రత్యేక మార్గాలు, పాదచారుల వంతెనలను ఇప్పుడు ప్లాన్ నుంచి తప్పించారు. అంతకుమించి చంద్రబాబు ప్లాన్ చేసిన రాజధానిని ఏమాత్రం మార్చలేకపోయారు జగన్. జగన్ ప్రభుత్వ కొత్త ప్లాన్లో రూ.543 కోట్లు మిగుల్చుతుంటే.. మౌలిక సదుపాయాల్లో కోత విధించడం ద్వారానే రూ.445 కోట్లు మిగిల్చారు. అంటే రూ.98 కోట్లు మినహా మిగతాదంతా మౌలిక సదుపాయాలకు కోత వేసి మిగుల్చుతున్నదే. మరి మౌలిక సదుపాయాలు లేకుండా చేస్తే ప్రజలకే అసౌకర్యం అనే పాయింట్ ఎందుకు మిస్సవుతున్నారో.

* చంద్రబాబు డెవలప్డ్ కంట్రీస్‌లా మార్చాలనుకున్నారు..

చంద్రబాబు తన ప్రణాళికలో అభివృద్ది చెందిన దేశాల తరహాలో ఉపయోగకరమైన మౌలిక వసతులు ప్లాన్ చేశారు. గతంలో సింగపూర్ సంస్థ ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో 13 రకాలైన మౌలిక సదుపాయల కల్పనకు సంబంధించి 1147 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు. సీఆర్డీయే అధికారులు తాజాగా ఇచ్చిన ప్రతిపాదనలలో వాటిలో చాలావరకు కట్ చేశారు. అలా చేస్తే 445 కోట్ల రూపాయల వ్యయం తగ్గుతుందని చెబుతున్నారు.

* పాదచారులు రోడ్డు ప్రమాదాకు గురయినా ఫరవాలేదా?
వాహనాల కోసం ప్రత్యేక వంతెనలు రూ.19 కోట్లతో కట్టాలని చంద్రబాబు తలపోస్తే ఆ వంతెనలే అవసరం లేదని జగన్ కొత్త ప్లాన్ నిర్ణయించింది. పాదచారుల ప్రత్యేక రహదారుల కోసం 234 కోట్లు అవసరమని చంద్రబాబు భావిస్తే అసలు పాదచారులకు ప్రత్యేక బాటలు ఎందుకని జగన్ ప్రభుత్వం నిర్ణయిస్తోంది. అంటే, ఇప్పటికే ఫుట్ పాత్‌లు లేని రోడ్లపై బస్సులు, ఆటోలు, లారీలు, కార్లు, ద్విచక్రవాహనాల మధ్య నడుస్తూ పాదచారులు రోడ్డు ప్రమాదాలకు బలి కావాల్సిందే. అంతేకాదు.. ఫుట్ పాత్‌లు, సైకిల్ తొక్కేవారికి ప్రత్యేక ట్రాక్‌లు, అంతటా లైటింగ్ వ్యవస్థ వంటివన్నీ కొత్త ప్లాన్లో తప్పించేశారు. ఇవన్నీ ప్రజలకు సంబంధించిన సౌకర్యాలే.

* ముంపు ప్రాంతమనేది మీరే.. మరి, తారు రోడ్లు వేస్తే పాడవ్వవా?
రాజధాని అమరావతి విషయంలో జగన్, వైసీపీ నాయకులు నిత్యం చంద్రబాబుపై ఓ ఆరోపణ చేస్తారు. అధిక వర్షపాతం, కృష్ణానది ముంపు ప్రాంతం అయిన చోట రాజధాని కడుతున్నారని ఆరోపణలు చేస్తుంటారు. వర్షపాతం ఎక్కువన్న వారి మాటలు నిజమే. అందుకే.. చంద్రబాబు రాజధానిలో రోడ్లన్నీ కాంక్రీటుతో నిర్మించాలనుకున్నారు. వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతాల్లో తారు రోడ్లు వేగంగా పాడవుతాయి. అదే కాంక్రీట్ రోడ్లయితే నీరు పడితే మరింత మన్నిక వస్తాయి. ఈ విషయం దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు రాజాధానిలో కాంక్రీట్ రోడ్లు వేయాలనుకున్నారు.
కానీ, ఇప్పడు జగన్ కొత్త ప్లానులో అమరావతి ప్రాంతంలో రహదారులను సిమెంట్, కాంక్రీట్తో కాకుండా బీటీ రోడ్లుగా నిర్మించాలని ప్రతిపాదించారు. సిమెంట్, కాంక్రీట్ రోడ్డుకు అన్ని లేయర్లతో కలుపుకొని ఒక చదరపు మీటరుకు 2,100 రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. అదే బీటీ రోడ్డుకు అన్ని లేయర్లతో కలుపుకొని ఒక చదరపు మీటరకు 2,040 రూపాయల ఖర్చు అవుతుంది. అంటే చదరపు మీటరుకు రూ.60 మిగులుతుంది. రాజధాని ప్రాంతంలో 67 లక్షల 30వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రహదారులను నియమించాల్సి వున్నది. ఆ మొత్తాన్ని బీటీ రోడ్లు వేయటం వల్ల 40 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నదని కొత్త ప్రభుత్వం అంచనా.

* తారు రోడ్లతో మిగిలేది గోరంత మెయింటెనెన్స్ కొండంత
కానీ, అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం వర్షాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తారు రోడ్ల జీవిత కాలం పది సంవత్సరాలయితే సిమెంట్ కాంక్రీట్ రోడ్ల జీవిత కాలం 40 సంవత్సరాలు. అంటే సిమెంటు రోడ్లుకు బదులు తారు రోడ్లు వేస్తే నాలుగు సార్లు వేయాలి. అంటే ఇప్పుడు 40 కోట్లు మిగిలినా పదేళ్ల తరువాత వేల కోట్లు పెట్టాల్సి వస్తుంది.
అంతేకాదు.. తారు రోడ్ల కంటే సిమెంట్ రోడ్లపై ఇంధన ఖర్చు 15 నుంచి 20 శాతం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పగటి సమయంలో తారు కరిగి అది వదులుగా ఉంటుంది. భారీ వాహనాల వాస్తవ వేగం దాని వల్ల తగ్గుతుంది. అంటే సిమెంట్ రోడ్లపై 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లడానికయ్యే శక్తితో తారు రోడ్డు మీద 80 నుంచి 85 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్లగలరు. అంటే ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. ఫలితంగా కాలుష్యమూ పెరుగుతుంది.
ఇంధన పొదుపు, కాలుష్య నివారణ రెండూ అంతర్జాతీయంగా క్లైమేట్ చేంజెస్ విషయంలో కీలకాంశాలు కాగా చంద్రబాబు దానికి పెద్ద పీట వేయగా జగన్ ఇప్పుడు తూట్లు పొడుస్తున్నారన్నమాట.

* నాయకులు, అధికారుల సౌకర్యాలకు మాత్రం ఢోకా లేదు
సీఆర్డీయే అధికారులు తాజాగా ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్లో నిర్మాణాలకు సంబంధించి రెండు రకాల ప్రాధాన్యాలను నిర్ణయించారు. హైకోర్టు శాశ్వత భవనాలతోపాటు, అమరావతి ఐటీ పార్కును ద్వితీయ ప్రాధాన్యతలో చేర్చారు. తొలి ప్రాధాన్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత స్థాయి అధికారుల కోసం బహుళ అంతస్తుల భవనాలలో 432 ప్లాట్ల నిర్మాణం చేపడతారు. ఎన్జీవోల కోసం 1968, 1440 ప్లాట్లను నిర్మించి వారి వారి హోదాలననుసరించి కేటాయింపులు జరుపుతారు. మంత్రులు, న్యాయమూర్తుల కోసం 71, కార్యదర్శులు, ప్రిన్సిపల్ కార్యదర్శి హోదా వున్న అధికారుల కోసం 115 బంగ్లాలు నిర్మిస్తారు. అదేవిధంగా మూడు పాఠశాలలను ఏర్పాటు చేస్తారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్, హ్యపీనెస్ట్, ఏపీ సీఆర్డీయే ప్రాజెక్ట్ కార్యాలయం తదితర నిర్మాణాలన్నింటినీ మొదటి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని తాజా మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించారు.
ఎమ్మెల్యేలు, అధికారుల భవనాల విస్తీర్ణంలో కానీ, సౌకర్యాలలో కానీ ఎక్కడా తగ్గించలేదు కొత్త ప్లానులో. కేవలం ప్రజలకు సంబంధించి సౌకర్యాలకు మాత్రమే కోత పెట్టారు.
మొత్తంగా చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో ప్లానుకు ఇప్పటికి ప్లానుకు తేడా ఏమీ లేదు. ప్రజలనుద్దేశించి చంద్రబాబు వేసిన సౌకర్యాల ప్రణాళికలన్నీ పక్కనపెట్టి జగన్ ప్రభుత్వం స్వల్ప మొత్తంలో మిగల్చాలనుకుంటోంది అంతే.