జగన్ రెడ్డి... మీ మామ ఏం పాపం చేశారండీ?

July 12, 2020

నవ్యాంధ్రకు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తన కేబినెట్ లో తన సామాజిక వర్గానికి బెర్తులు భారీగా తగ్గించేసి... బెర్తులన్నీ బడుగు, బలహీన వర్గాలకు కేటాయిస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చారు గానీ... ఆ కలరింగ్ అసలు రంగేమిటో ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. జగన్ కేబినెట్ లో మొత్తం 25 మంది మంత్రులుంటే... వారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కేవలం నలుగురే ఉన్నారు. ఎస్సీల నుంచి ఏకంగా ఐదుగురికి, బీసీల్లో ఏడుగురికి, కాపుల్లో నలుగురికి, గిరిజనులు, ముస్లింలకు ఒక్కరేసి సభ్యులకు జగన్ అవకాశం కల్పించారు. అయితే పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అంతగా ప్రాదాన్యం ఇచ్చేలా జగన్ కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే... జగన్ ఏర్పాటు చేసిన తొలి కేబినెట్ సబ్ కమిటీ నిలుస్తోందని చెప్పక తప్పదు.

చంద్రబాబు హయాంలో జరిరిగిన అవినీతిని వెలికి తీసేందుకంటూ జగన్ బుధవారం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో మొత్తం ఐదుగురు మంత్రులకు చోటు కల్పించిన జగన్... ఆ ఐదుగురిలో ముగ్గురు రెడ్లనే ఎంపిక చేశారు. వారెవరంటే... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డిలు. ఇక మిగిలిన ఇద్దరు ఎవరంటే... కాపు సామాజిక వర్గానికి చెందిన కురసాల కన్నబాబు, బీసీకి చెందిన అనిల్ కుమార్ యాదవ్. ఈ లెక్కన కేబినెట్ లో తన సామాజిక వర్గానికి చెందిన వారు నలుగురు ఉంటే.. వారిలో ఏకంగా ముగ్గురికి సబ్ కమిటీలో వేసిన జగన్... తన మామ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డిని మాత్రం పక్కన పెట్టారు.

కేబినెట్ సబ్ కమిటీ ఏం తేలుస్తుందో తెలియదు గానీ... జగన్ పాలనలోనే అత్యంత కీలక కమిటీగా పరిగణిస్తున్న ఈ కమిటీలో ముగ్గురు రెడ్లకే చోటు కల్పించి... తన నిజ నైజం ఏమిటో చూపించుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ కూర్పును చూసివారంతా నలుగురు రెడ్లు ఉంటే... ముగ్గురిని తీసుకున్న జగన్... తన మామ అయిన బాలినేనిని ఎందుకు ఉపేక్షించారంటూ తమదైన శైలి సెటైర్లు సంధిస్తున్నారు. జగన్ రెడ్డీ... బాలినేని ఏం పాపం చేశారండీ అంటూ మరికొందరు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.