ఆ విషయంలో కేసీఆర్ సలహాను పట్టించుకోని జగన్

July 04, 2020

కీలక స్థానాల్లో ఉన్నవారు కొందరు ఆసక్తికర విషయాల్ని చెబుతుంటారు. తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని అలాంటి విషయాన్నే చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తారన్న కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాని మాట్లాడుతూ.. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పారన్నారు.
అలా చేస్తే.. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ప్రభుత్వానికి గుది బండగా మారతాయని.. విలీనం చేయటం పెద్ద పొరపాటు నిర్ణయంగా పలువురు అభివర్ణించారన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని పలువురు వ్యతిరేకించినా.. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టుదలతో వ్యవహరించారన్నారు.
తెలంగాణ సీఎం మాటల్ని జగన్ సవాలుగా తీసుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. కార్మికుల పట్ల ప్రభుత్వ విధానాలు తప్పని భావిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. తాను చేస్తున్న పనుల్లో తప్పులు ఉన్నట్లుగా నిరూపిస్తే సారీ చెప్పేందుకు తాను వెనుకాడనని చెప్పారు. మొత్తంగా మంత్రి నాని మాటల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సలహాలు ఇచ్చినా.. వాటి విషయంలో ఏపీ సీఎం జగన్ తాను ఏమనుకుంటారో అదే చేస్తారు తప్పించి.. పట్టించుకోరన్న విషయాన్ని చెప్పినట్లైంది.