ముందు నుయ్యి, వెనుక గొయ్యి... జగన్ పరిస్థితి ఇదే

May 25, 2020

తనను తాను బలమైన నేతగా అభివర్ణించుకుంటున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు నిజంగానే పెద్ద కష్టం వచ్చి పడింది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా జగన్ పరిస్థితి తయారైందన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరి ఈ విపత్కర పరిస్థితి నుంచి జగన్ ఎలా బయటపడతారో తెలియదు గానీ.. మొత్తానికైతే ఈ సమస్యను ఇబ్బంది రాకుండా పరిష్కరించేందుకు జగన్ నానా తంటాలు పడుతున్న వైనం కూడా ఆసక్తికరంగా మారిపోయింది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రిక్వెస్ట్ చేసిన మేరకు రిలయన్స్ సంస్థలో కీలక వ్యక్తిగా ఉన్న పరిమళ్ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభ సీటు ఇస్తే... జగన్ కు సొంత నేతల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

రెండు రోజుల క్రితం పరిమళ్ నత్వానీతో పాటుగా తన కుమారుడు అనంత్ అంబానీని వెంటేసుకుని అమరావతి వచ్చిన ముఖేశ్... నేరుగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. అక్కడ స్వాగత సత్కారాలు ముగిశాక.. అంబానీ బృందంతో జగన్ ఏకాంతంగా భేటీ అయ్యారు. దాదాపుగా రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో ఇతరత్రా చిన్నా చితకా విషయాలు చర్చకొచ్చినా.. ప్రధానంగా నత్వానీకి వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే విషయంపైనే చర్చ జరిగినట్టుగా సమాచారం. ఇదే విషయాన్ని ఆ మరునాడే నత్వానీ స్వయంగా వెల్లడించారు కూడా. మరి అంబానీ కోరినట్లుగా నత్వానీకి జగన్ తన పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇస్తారా? అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. అంతేకాకుండా బయటి వ్యక్తులకు తన పార్టీ పదవులు ఇచ్చే సంస్కృతి ఇప్పటిదాకా లేదని అంబానీకి చెప్పిన జగన్... దానిపై నిర్ణయం తీసుకునేందుకు మూడు రోజుల సమయం కావాలని అడిగారట. 

అంబానీతో భేటీ జరిగి బుధవారం నాటికి మూడు రోజులు అవుతోంది. అంటే... బుధవారం సాయంత్రం లోగా నత్వానీకి సీటిచ్చే విషయంపై జగన్ క్లారిటీ ఇవ్వక తప్పదు. ఇప్పటికే ఈ విషయంపై తన పార్టీ నేతలతో జగన్ మాట్లాడే ఉంటారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ రాజ్యసభ సభ్యత్వం కోసం ఇప్పటికే చాలా మంది నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా సామాజిక సమీకరణాలంటూ జగన్ చెబుతున్న దాని ప్రకారం ఎస్సీ మహిళకు ఓ సీటివ్వాల్సిందేనట. ఇక మిగిలిన మూడు సీట్లలో ఓ సీటును బీసీలకు ఇస్తే... మిగిలేది రెండంటే రెండే. ఈ రెంటిలో ఓ సీటును నత్వానీకి ఇస్తే... మిగిలేది ఒక్కటే. ఆ ఒక్క సీటు కోసం వైసీపీలో కాసుక్కూర్చున్న నేతలు చాలా మందే ఉన్నారు. ఈ ఒక్క సీటును ఎవరికిచ్చినా కూడా మిగిలిన వారు గయ్యిమని లేచే ప్రమాదం లేకపోలేదు. అలాగని నత్వానీకి సీటివ్వనని చెప్పే ధైర్యం జగన్ కు లేదనే చెప్పాలి. ఎందుకంటే... ఆ ప్రతిపాదన ఏకంగా బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుంచి వచ్చినది మరి. దానిని తిరస్కరిస్తే... జగన్ జైలుకెళ్లడం గ్యారెంటీ. అంటే ముందు నుయ్యి. వెనుక గొయ్యేనన్న మాట.