ఉండవల్లి సంచలనం... జగన్ దారి తప్పుడు దారేనట

February 25, 2020

నవ్యాంధ్ర నూతన రాజధానిగా టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎంపిక చేసిన అమరావతిని పీక పిసికేసి... ఇప్పుడు కొత్తగా మరో రెండు రాజధానులంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? అంటే.. కరెక్టేనని వైసీపీ వర్గాలు... ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు తప్పంటే తప్పేనని టీడీపీ వర్గాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే మరి న్యూట్రల్ గా చూస్తే... జగన్ నిర్ణయం కరెక్టేనా? అన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికేసినట్టేనని చెప్పక తప్పదు. తెలుగు నేల రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల దిశగా జగన్ తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లు తప్పేనని ఉండవల్లి బల్ల గుద్ది మరీ చెప్పేశారు. 

ఈ సందర్భంగా ఉండవల్లి ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘సచివాలయం వస్తే ఏమీ రాదు. ఉద్యోగాలు రావు, అభివృద్దీ రాదు. రాజధానిని జగన్ తన కార్లో ఫ్రంట్ సీట్లో పెట్టుకోమనండి. కానీ రాయలసీమ, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు ఆహ్వానించడానికి ఉచిత భూమి, ట్యాక్స్ ఇన్సెంటివ్ లు ఇస్తే పరిశ్రమలు వాటంతటవే వస్తాయి. ఆ ఇన్సెంటివ్ లు ఐదేళ్ల వరకు ఇస్తే చాలు. దానితోనే రాష్ట్రం బాగుపడిపోతుంది. అభివృద్ది చెందుతుంది’’ అని ఉండవల్లి చాలా సూటిగానే చెప్పేశారు. ఉండవల్లి మాటలు వింటే... మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెబుతున్న జగన్ వాదన తప్పేనని అర్థమవుతుంది కదా. మరి వైసీపీ నేతలు జగన్ వాదననను ఎందుకు తప్పనరు? ఎందుకంటే... తమ పార్టీ స్టాండ్ ను వారు తప్పబట్టలేరు కాబట్టి. 

అయినా కేవలం చంద్రబాబు ఎంపిక చేసిన రాజధాని అమరావతిని చంపేసి.. విశాఖను పూర్తి స్థాయి రాజధానిగా ఏర్పాటు చేయాలన్న భావనతోనే జగన్ ఇప్పుడు మూడు రాజధానుల మాటను భుజానికెత్తుకున్నారన్న మాట కూడా వినిపిస్తోంది. ఆ మాట ఎలా ఉన్నా ప్రస్తుతం అమరావతిని కేవలం లెజిస్లేటివ్ కేపిటల్ కు మాత్రమే పరిమితం చేసేసి... విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా, కర్నూలును జ్యుడిషియల్ కేపిటల్ గా మార్చేస్తే... ఆ రెండు ప్రాంతాలు ఇప్పటికిప్పుడు అభివృద్ది చెందుతాయని చెప్పడమంటే అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టినట్టేనన్న మాట. ఈ తరహాలో జగన్ తీసుకుంటున్న మూడు రాజధానుల నిర్ణయంలోని అంతర్యాన్ని, దానిలోని పసలేని తనాన్ని ఉండవల్లి ఈ విధంగా ఎండగట్టారన్న మాట. అంటే.. జగన్ మూడు రాజధానుల నిర్ణయం నూటికి నూరు పాళ్లు తప్పేనన్న మాట.