జగన్ ది శాడిజం - చంద్రబాబు

August 03, 2020

జగన్ అవినీతిపై అచ్చెన్నాయుడు వేసే ప్రశ్నలకు తట్టుకోలేక ఆయనను అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్ కుటుంబంలా అవినీతి కోసమే అధికారాన్ని వాడుకునే వారు కాదని... దశాబ్దాలుగా ప్రజా సేవలో కీర్తి గడించారు కాబట్టే వారి కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు అని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో టీడీపీ ప్రశ్నలను తట్టుకునే శక్తి లేక, సమాధానం లేక... అరెస్టులకు, ఫిరాయింపులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. 300 మంది అచ్చెన్న ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేయడానికి ఆయనేమైనా ఉగ్రవాదా? విచారణకు పిలిస్తే ఎపుడు కావాలంటే అపుడు వస్తారు. ఇది నీచమైన చర్య అని చంద్రబాబు దుయ్యబట్టారు.

చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

‘‘మొన్ననే అచ్చెన్న సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ తరువాత ఇంట్లోనే అచ్చెన్నకు వైద్యం అందిస్తున్నారు. అలాంటి స్థితిలో అర్దరాత్రి కిడ్నాప్ చేయడం నీచమైన చర్య. మందులు వేసుకోడానికి కూడా అనుమతించలేదు. సీఎం జగన్ శాడిజం పరాకాష్టకు చేరింది. చట్టవిరుద్దంగా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కట్టుకథలు చెబుతున్నారు. జగన్ అవినీతిని ఎండగట్టినందుకే అచ్చెన్నపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.

అసెంబ్లీని ఎదుర్కోలేకే ఇలాంటి దుర్మార్గాలకు తెగించారు. జగన్ ఏడాది పాలనలో అవినీతి కుంభకోణాలు. ఇసుక, మద్యం, గనులు, భూసేకరణలో స్కామ్‌లు ఇవే ఉన్నాయి. వాటిని నిగ్గదీసినందుకే అచ్చెన్నాయుడిపై దాడి చేశారు. అచ్చెన్నాయుడికి ఏమైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత.

అర్ధరాత్రి వందల మందిని పంపి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది..? అచ్చెన్నాయడు ఏమైనా ఉగ్రవాదా..? అచ్చెన్నాయుడి కంపెనీలకు గనులు 50 ఏళ్లకు లీజుకిచ్చారా..? అచ్చెన్నాయుడి కంపెనీకి నీళ్లు తీసుకున్నారా..? 

అచ్చెన్నాయుడిది 38 ఏళ్ల చరిత్రగల రాజకీయ మచ్చలేని కుటుంబం అచ్చెన్నాయుడిది. ఆయన అన్నఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా పనిచేశారు. ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్న కుటుంబం వారిది. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి ఉన్న కుటుంబం. శ్రీకాకుళంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అచ్చెన్న కుటుంబానికి ఆదరణ ఉంది.

ఎర్రన్నాయుడి కుటుంబ ప్రతిష్ట దెబ్బతీసేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక దొడ్డిదారిన దొంగదెబ్బ తీస్తున్నారు. మూడు రోజుల్లో అసెంబ్లీ ఉండగా అచ్చెన్నను ఈ సమయంలో అరెస్ట్ చేయడం జగన్ కక్షసాధింపు చర్యే. బీసీలంటే జగన్‌కు మొదటినుంచి కక్ష.. బీసీలపై కక్ష సాధింపులో భాగంగానే అచ్చెన్నను అరెస్ట్ చేశారు.

బీసీ నాయకత్వాన్ని అణగదొక్కడానికే జగన్ కుట్రలు చేస్తున్నారు. బీసిల రిజర్వేషన్లను సగానికి కోత పెట్టారు. బీసీల ఇళ్లు ధ్వంసం చేశారు, భూములు బలవంతంగా లాక్కున్నారు. బీసిలపై దాడులు అడ్డుకున్నందుకే అచ్చెన్నపై కక్ష కట్టారు. దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్, హోంమంత్రి, డిజిపి జవాబివ్వాలి.

అచ్చెన్న కిడ్నాప్ పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలి. బీసీ సంఘాలంతా ఏకం కావాలి. బీసీలపై వైసీపీ దౌర్జన్యకాండను అడ్డుకోవాలి. నల్లజెండాలతో ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలి. అచ్చెన్నాయుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలదే’’