జగన్ ను బుక్ చేస్తున్నది ఆయన లాయర్లే

June 06, 2020

ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, రాస్తున్న జీవోలు ఎవరు రూపొందిస్తున్నారో తెలియదు గానీ అన్నీ అసంబద్దంగానే ఉంటున్నాయి. ప్రతి దాంట్లో లోపాలు. అవగాహన రాహిత్యంతో రూపొందించిన పథకాలు. దీంతో కోర్టుల్లో నిత్యం జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలు. సరే కోర్టుకు వెళ్తే అక్కడైనా సమర్థించకునే లాయర్లకు అవగాహన ఉందా అంటే అదీ లేదు. ప్రతి సారీ జడ్జిలు వేసే ప్రశ్నలకు తెల్ల మొహం వేయడం తప్ప దీటైన సమాధానం ఇవ్వలేక నవ్వుల పాలవుతున్నారు ఏపీ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న లాయర్లు. తాజాగా ఈరోజు ఏపీ ప్ర‌భుత్వం మ‌రోమారు హైకోర్టులో ఇర‌కాటంలో ప‌డింది. 

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జ‌గ‌న్‌ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. ఏపీ ప్రజలకు ఈ నిర్ణయం అనుకూలం అని పైకి అనిపిస్తుంది గాని... ఇతర రాష్ట్రాల్లో మన అవకాశాలను విపరీతంగా దెబ్బతీసే ప్రమాదం ఉన్న కార్యక్రమం ఇది. వాస్తవానికి జాగ్రత్తగా ప్లాన్ చేసి మౌఖిక ఆదేశాలతో నడిపించుకోవాల్సిన కార్యక్రమాన్ని బహిరంగంగా జీవోలు ఇవ్వడంతో పెద్ద తలనొప్పి అయ్యింది. ఏపీ స‌ర్కారు తీసుకువచ్చిన స్థానిక రిజర్వేషన్ల జీవో రాజ్యాంగ విరుద్దమని పేర్కొంటూ  విజయవాడకు చెందిన న్యాయవాది వరలక్ష్మి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై న్యాయ‌స్థానం స్పందించింది. నెల‌లోపు ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది.

ఈ సందర్భంగా కోర్టులో ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగింది. ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్ చాలా పేలవమైన సమాధానాలు చెప్పడంతో అతని వాదనను న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకోలేదు. స్థానిక రిజర్వేషన్ల కేసు విచారణలో ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది సుమంత్ రెడ్డి (ఇక్కడ కూడా రెడ్డే) స్పందిస్తూ... ఇది లాయరు వేయాల్సిన పిటిషను కాదు, పారిశ్రామిక వేత్తలు వేయాల్సిన పిటిషను కాబట్టి దీనికి విచారణ అర్హత లేదు అని వాదించబోయారు. వాస్తవానికి పిటిషనులో అంశంపై లాయరు స్పందించకుండా పనికిరాని లాజిక్  ఒకటి తీయబోయి ప్రభుత్వం పరువు తీశాడు. కోర్టు రిజర్వేషన్ల గురించి ప్రశ్నించినపుడు అది ఎలా సమర్థనీయమో చెప్పాల్సిన లాయరు... ఆ పాయింటు వదిలేసి పిటిషను రాంగ్ పర్సన్ వేశాడు అంటూ వాదించి జగన్ ను ఇరికించాడు. ఒకవేళ పారిశ్రామిక వేత్త రేపు పిటిషను వేస్తే అపుడు ఏమని సమాధానం చెబుతారు ఈ సుమంత్ రెడ్డి? ఈయన వాదనలు పక్కనపెట్టేసిన జడ్జి... ఈ పిటిషను ఎవరేశారు అన్నది కాదు... ఇందులో ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి విచారణకు స్వీకరిస్తున్నాము అని పేర్కొన్నారు. దీంతో జగన్ ప్రభుత్వం అడ్డంగా బుక్కయ్యింది.

మొన్న రంగుల విషయంలో కూడా ఏపీ ప్రభుత్వ లాయరు ఇలాగే నవ్వుల పాలయ్యారు. మూడు నెలల సమయం కావాలని కోర్టును అడిగాడు. పోలోమంటూ గవర్నమెంటు అడిగిన మాటకు కోర్టుకు చెబితే కోర్టు అడిగే ప్రశ్నకు సమాధానం ఆలోచించి పెట్టుకోవాలి కదా. అదీ జరగలేదు. మూడునెలలు సమయం ఇస్తాం. మరి రంగులేసిన తర్వాతే ఎన్నికలు జరుపుతారా? అని జడ్జిలు అప్పట్లో ప్రభుత్వ లాయరును ప్రశ్నిస్తే... దిక్కుతోచని ఆయన సైలెటుంగా ఉండిపోయారు. అతనివద్ద ఏసమాధానమూ లేదు. చివరకు మరో వాయిదా ఇవ్వండి ప్రభుత్వాన్ని అడిగి చెబుతాను అన్నారు. దీంతో అప్పుడు ఆయన కూడా నవ్వుల పాలయ్యారు. 

రూపొందించే పథకాలు తప్పు, వాటికి అమలు ప్రణాళికలు తప్పు, జీవోలు తప్పు... వాటిని బలంగా  సమర్థించగలిగిన లాయర్లు కరవు. మరి కోర్టులో జగన్ సర్కారు అభాసుపాలు కాక ఏమవుతుంది?