జ‌గ‌న్ ఫాం-7 బండారం .... ఇదీ స్కెచ్ !

October 17, 2019

ఒకే వ్య‌క్తి రెండు ర‌కాల వాద‌న‌లు. ఒక‌రు త‌ప్పు చేశార‌న్న ఆరోప‌ణ ఒక వైపు.. అదే వేళ‌లో తాము చేసిన త‌ప్పును.. ఒప్పుగా స‌మ‌ర్థించుకుంటున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఐటీ గ్రిడ్స్ కంపెనీలో త‌ప్పు జ‌రిగింద‌ని పోలీసులు కూడా నిర్దారించ‌క‌ముందే.. దేశంలో అతిపెద్ద సైబ‌ర్ క్రైం అంటూ జ‌గ‌న్ ఆరోప‌ణ‌. త‌ప్పు జ‌రిగిపోయింది.. మోసం చేసేశారంటూ అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేయ‌టం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు?  నేరం ఇలా జ‌రిగింద‌ని పోలీసులు సైతం చెప్ప‌లేక‌పోతున్న వేళ‌.. విచార‌ణ పేరుతో కుస్తీ ప‌డుతున్న స‌మ‌యంలో.. జ‌గ‌న్ కు మాత్రం నేరం ఎలా జ‌రిగిందో ఎట్లా తెలుస్తుంది? ఇదే ఇపుడు అంద‌రి అనుమానం. పోలీసులు చెప్ప‌బోయే దానిని జ‌గ‌న్ చెబుతున్నారా? జ‌గ‌న్ చెప్పేదాన్ని పోలీసులు నిజ‌మ‌ని నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారా? 

జ‌గ‌న్ రెడ్డి మీడియాతో చెప్పిన రెండు అంశాల్ని ఆయ‌న మాట‌ల్లోనే చూద్దాం. త‌ర్వాత క్వ‌శ్చ‌న్లు వేసుకుందాం. ప్రాధ‌మికంగా బుర్ర‌లో కాస్తంత గుజ్జు ఉన్నోడికి క‌లిగే సందేహాల‌తో తూకం వేద్దాం. గ‌వ‌ర్న‌ర్ కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై  ఫిర్యాదు చేస్తూ.. విన‌తిప‌త్రం ఇచ్చిన సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి ఎలా త‌ప్పు చేశార‌న్న  విష‌యాన్ని జ‌గ‌న్ మాట‌ల్లోనే చూద్దాం.

బాబు త‌ప్పు చేసిన‌ట్లుగా జ‌గ‌న్ ఊహ‌.. ఆయ‌న మాట‌ల్లో..

Point 1.

" చంద్రబాబు ప్రభుత్వం గత రెండేళ్లుగా ప్రజల వద్దకు వెళ్లి పల్స్‌ సర్వే అని, ఆర్టీజీఎస్‌ అని రకరకాల సర్వేల పేరిట వారి సమాచారం సేకరించింది. అలా సేకరించిన డేటాను కూడా తెలుగుదేశం సేవామిత్ర యాప్‌తో అనుసంధానం చేశారు"

Point 2.

"ఇలా అనుసంధానించిన డేటాను, సేవామిత్ర యాప్‌లో రిజిస్టర్‌ అయిన టీడీపీ నేతల ట్యాబ్‌లకు పంపించారు. టీడీపీ నేతలు వారి వారి గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఈ ఓటరు ఎవరు? ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాడు? వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఓటేస్తాడా? లేక టీడీపీకి ఓటేస్తాడా? అంటూ సర్వేలు చేశారు"

Point 3.

"ఆ తర్వాత ఎవరైతే టీడీపీకి ఓట్లేయరో వారి ఓట్లన్నీ ఒక పద్ధతి, ఒక పథకం ప్రకారం తీసేయడం మొదలు పెట్టారు. మరోవైపు రెండేసి ఓట్లను చేర్చడం మొదలు పెట్టారు. టీడీపీకి అనుకూలమైన ఓటరు పేరు ఒకటి కాదు, రెండేసి కనిపిస్తున్నాయి. అంటే ఒకవైపు డూప్లికేట్‌ ఓటర్లను చేర్చి తమకు అనుకూలురైన ఓటర్ల సంఖ్యను పెంచడం, మరో వైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓటర్లను ఒక పద్ధతి ప్రకారం తొలగించడం చేస్తున్నారు.  రెండేళ్లుగా చంద్రబాబు ఒక పథకం ప్రకారం చేస్తూ వచ్చిన పని ఇదే"

ల‌క్ష‌లాదిగా ఫామ్ 6.. ఫామ్ 7ను వైఎస్సార్ కాంగ్రెస్ అప్ల‌యి చేసింది. వాటిపై జ‌గన్ ఏమ‌న్నాడో చూడండి.

Point 4.

"అసలు ఫామ్‌–7 అంటే ఏమిటి? ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి.. దర్యాప్తు చేయండి, వచ్చి చూసి ఎంక్వయిరీ చేసిన తర్వాత దొంగ ఓటు అని తేలితే ఆ ఓటును తీసేయండి? అని అర్థం. ఎన్నికల కమిషన్‌ చేయాల్సిన పనికి మేం సహకరించాం. దర్యాప్తు చేసి నిజం తెలుసుకోండి.

 "అసలు ఏపీ ప్రభుత్వానికి, దీనికి సంబంధం ఏమిటి? ఎన్నికల కమిషన్‌ అనేది ఒక ఖ్వాజీ జుడిషియల్‌ అథారిటీ (న్యాయపరమైన అధికారాలు కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ). దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ సంబంధమే లేదు. అలాంటి రాజ్యాంగ బద్ధమైన సంస్థకు.. ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఫామ్‌–7 సమర్పించడం, ఇక్కడ మా ఓటరు నమోదు కాలేదు, నమోదు చేయండి అని ఫామ్‌–6ను సమర్పించడం అనేది మా హక్కు. మేం అప్లికేషన్‌ పెట్టగానే వాళ్లేమీ ఆ ఓట్లను తీసేయరు. అలాగే ఓట్లను చేర్చరు. మేం సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా తొలుత సంబంధిత ఊరికి వచ్చి దర్యాప్తు చేయాలి. దర్యాప్తులో మేం చెప్పింది సరైనదిగా తేలితే ఆ ఓటర్లకు టిక్‌ పెడతారు. డూప్లికేట్‌ అని తేలితే తీసేస్తారు. ఓటరును నమోదు చేయాల్సిన అవసరం ఉంటే చేస్తారు. ఇదొక ప్రక్రియ. ఇది ఎన్నికల కమిషన్‌కు సహకరించే ఒక బాధ్యత. ఇది మేమే కాదు విజ్ఞత గల ప్రతి ఒక్కరూ చేయాలి. విజ్ఞత గల ప్రతి పేపరు, ప్రతి టీవీ చానెల్‌ చేయాలి"

జ‌గ‌న్ మాట‌ల్ని జాగ్ర‌త్త‌గా చ‌దివిన‌ప్పుడు ఒక విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఓట్లు తీసేయ‌టం అన్న‌ది ఎవ‌రి చేతుల్లో ఉండ‌దు. ఎన్నికల క‌మిష‌న్ స్వ‌యంగా వ‌చ్చి చెక్ చేసిన త‌ర్వాతే తీసేస్తుంద‌ని. మ‌రి.. అలాంట‌ప్పుడు సేవామిత్ర యాప్ తో త‌మ‌కు అనుకూలంగా లేని వారి ఓట్లు టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం ఎలా తీసివేస్తారు?

ప‌లు స‌ర్వేలు చేసిన డేటాతో చంద్ర‌బాబు స‌ర్కారు సేవామిత్ర యాప్ కు త‌ర‌లించింద‌ని అనుకుందాం. అదే నిజ‌మైప్పుడు.. అంత పెద్ద వ్య‌వ‌స్థ చేతిలో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఓట‌ర్ల జాబితాను, డేటాను సంపాదించే వీలున్న‌ప్పుడు.. విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డేటాను ఎలా సంపాదించింది?

ఓట్ల తొల‌గింపు రిక్వెస్టులు చేసిన పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఓట్లు తీసేయాలని వైసీపీ  ఎన్ని అప్లికేష‌న్లు పెట్టింద‌నేది జ‌గ‌న్ చెప్ప‌లేదు కానీ.. తాము ఓట్లు తీయాలంటూ అప్లికేష‌న్లు పెట్టిన‌ట్లుగా జ‌గ‌న్ త‌న‌కు తానే ఒప్పుకున్నారు. ఆయ‌న మాట ప్ర‌కార‌మే చూస్తే.. త‌ప్పుగా ఉన్న ఓట్ల‌ను తీసివేయాలంటూ ద‌ర‌ఖాస్తు పెట్టింది జ‌గ‌న్ పార్టీ అయితే.. చంద్ర‌బాబు మీద విమ‌ర్శ‌లు చేయ‌టంలో అంత‌ర్యం ఏమిటి?

సేవామిత్ర యాప్ తో ఒక ప్రైవేటు కంపెనీ డేటా చౌర్యం చేసింద‌న్న‌ది ఒక ఆరోప‌ణ మాత్ర‌మే. అందులో నిజం ఎంత అన్న‌ది ఇప్ప‌టివ‌ర‌కూ తెలీదు. అలాంటి వేళ‌.. అనుమానాన్ని నిజం అనిపించేలా మాట్లాడ‌టం ఒక ఎత్తు. మ‌రోవైపు ల‌క్ష‌ల ఓట్ల‌ను తొల‌గించాలంటూ ద‌ర‌ఖాస్తులు పెట్టిన‌ట్లుగా జ‌గ‌న్ చెబుతున్నారు. మ‌రి.. ఆయ‌న ఆ ప‌ని ఎలా చేశారు?  ఎవ‌రు చేశారు?  ఓట్లు త‌ప్పుగా ఉన్నాయ‌ని ఎలా గుర్తించారు?  దాని ప్రాతిప‌దిక ఏమిటి?  ఏ డేటాతో వారు త‌ప్పుల్ని గుర్తించారు?  ఈ ప‌ని ఎవ‌రు చేశారు? ఎంత మంది చేశారు?  ఏ సాంకేతిక‌త‌ను ఇందుకోసం వినియోగించారు?  అన్న ప్ర‌శ్న‌ల‌కు జ‌గ‌న్ స‌మాధానం చెబితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 

ఒక వేళ చంద్ర‌బాబు త‌ప్పు చేసిన‌ట్ల‌యితే ఎల‌క్ష‌ను క‌మిష‌ను కూడా ఇందులో భాగ‌స్వామి కావాలి. అదే క‌నుక నిజం అయితే... అదే ఎల‌క్ష‌ను క‌మిష‌ను తెలంగాణ ఓట్ల తొలగింపులో కూడా టీఆర్ఎస్ కుమ్మ‌క్క‌యిన‌ట్లే క‌దా. 

మ‌రి ఈ అయోమ‌యం కేసు ఎక్క‌డిదాకా వెళ్తుందో వేచి చూడాలి.