నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

August 07, 2020

మితిమీరుతున్న కేసులు, సమయానికి అందుబాటులో లేని అంబులెన్సులు, ఆక్సిజన్ ఫెయిలూర్స్, ఆస్పత్రుల్లో బెడ్ల కొరత వల్ల సరైన సమయంలో చికిత్స అందకచనిపోతున్నారని ఆరోపించారు నారాలోకేష్. నిర్లక్ష్యం వల్ల, ఆలస్యం వల్ల సంభవించిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమంతటా మందులు అందుబాటులోకి వచ్చినా వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని లోకేష్ విమర్శించారు. 

అందుకే ఈ నిర్లక్ష్యపు మరణాలను ఇకపై ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని టీడీపీ నేత నారా లోకేష్‌ ఆరోపించారు. ఏపీలో కరోనా సోకిన వారు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని... వీరిని మనం కాపాడుకోలేకపోవడం విచారకరం అన్నారు. మరోవైపు రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు లెక్కతేలుతున్నాయని... వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని లోకేష్ ఆరోపించారు. 

క్వారంటైన్ సెంటర్లలో వసతులు సరిగా లేవని... ప్రభుత్వం ప్రచారం చేస్తున్నదొకటి.. అక్కడ జరుగుతున్నది ఒకటి అని లోకేష్ అన్నారు. రోడ్ల మీదే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న విషయం అందరూ చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం కేవలం డబ్బు కోణంలోనే తన పనిని చెప్పుకుంటోందని లోకేష్ తప్పుపట్టారు. 

ఇంత జరుగుతున్నా కూడా మద్యం దుకాణాల ద్వారా కరోనా వ్యాప్తికి ప్రభుత్వం కారణం అవుతోంది. ప్రస్తుత నేపథ్యంలో బంద్ చేయాల్సింది పోయి అమ్మకాలను ప్రోత్సహించడానికి మరింత ఎక్కువ సమయం మద్యం అమ్మడానికి సిద్ధమైనారంటే మీ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు.

రేట్లు పెంచతారు, సమయం పెంచుతారు... మళ్లీ మద్యపాన నిషేధం అంటూ కబుర్లు చెబుతారా? అని దుయ్యబట్టారు. మద్యపాన నిషేధం అంటూ మహిళల్ని మోసం చేసారని లోకేష్ అన్నారు. తక్షణం వైన్ షాపులు క్లోజ్ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.