జగన్ కి ఆ బెంగ లేదు... ఇక ఏపీ అంతేనా !!

August 02, 2020

వైఎస్ జగన్... సినిమాల్లో వర్మ, పూరి జగన్ టైపు. మంచి చెడులు అనే ప్రామాణికాలు ఉండవు. నేటి తరానికి ఏది నచ్చితే అది చేసి చప్పట్లు కొట్టించుకోవడం వరకే కావాలి. అంటే ఒక రకంగా పబ్ జి పాలన. ఈ తరం విపరీతంగా ఇష్టపడిన గేమ్ పబ్ జి. దానిని ఇష్టపడని యువత చాలా తక్కువ. మెజారిటీకి నచ్చినంత మాత్రాన దానిని ఆమోదించలేం కదా. ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది ఏపీలో. అత్యధిక శాతం వచ్చిన సీట్లు గురించి మాత్రమే వైసీపీ మాట్లాడుతోంది. కానీ జనాభాలో బలహీన వర్గాలు, పేదరికంలో ఉన్న వారు, ఆకలితో ఉన్న వారు తమ ప్రస్తుత అవసరాలకే ప్రాధాన్యం ఇస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే ఎమోషన్. కచ్చితంగా ఓటు వేసేది కూడా ఆ వర్గమే. దీనిని సమర్థవంతంగా క్యాష్ చేసుకుంటున్న జగన్... భవిష్యత్తుతో నాకు ఏం అవసరం లేదు. రాష్ట్ర జీడీపీతో గురించి బెంగలేదు... నాకు ఓట్లేసిన వారికి నా పాలన నచ్చుతుందా లేదా? అన్న కోణంలో మాత్రమే ముందుకు వెళ్తున్నారు. నిజమే జగన్ వారికి నచ్చుతున్నాడు... మరి రాష్ట్రం సంగతి ఏంటి?

జగన్ పాలనలో ఘోర తప్పిదానికి నిలువెత్తు నిదర్శనం... సంక్షేమ పథకాల కోసం భూములు అమ్మడం. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్ముతు పోతే ఎంత కాలం అమ్మగలం? భూమి పరిమితం. ఇపుడు ఉన్న భూములు అమ్మితే ఒక రెండు మూడేళ్లు పథకాలకు నిధులు సరిపోవచ్చు. ఆ తర్వాత ఏం చేస్తాం?

కంపెనీలు వస్తేనే అన్నీ వస్తాయి. కంపెనీలు కార్పొరేట్లకు కాసులు కురిపించడమే కాదు... సామాన్యులకు ఉపాధిని కూడా సృష్టిస్తాయి. నేరుగా జరిగే ఉద్యోగ కల్పనతో పాటు సమాజంలో ఆ ఉద్యోగుల ద్వారా జరిగే క్యాష్ ఫ్లో తో బాగుపడే ఎన్నో కుటుంబాలుంటాయి. ఉద్యోగుల అవసరాల కోసం సృష్టించబడే పనుల వల్ల ఇతర కుటుంబాలు ఆదాయం పొందుతాయి. తద్వారా నిరుద్యోగం ప్రత్యక్షంగా పరోక్షంగా తగ్గిపోతుంది. నిరుద్యోగం తగ్గిపోవడం అంటే... ఇతరులకు మెరుగైన అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. కానీ ఇదంతా అర్థం కావాలంటే సమాజం మీద, రాష్ట్రం మీద ప్రేమ ఉండాలి. వ్యవస్థలపై అవగాహన ఉండాలి. కానీ కాలే కడుపు అన్నం కోసం చూస్తుంది, కానీ సమాజం భవిష్యత్తు కోసం చూస్తుంది... కాలే కడుపును నింపి పబ్బం గడుపుకోవడం అంటే... భావి తరాలను నిత్యం అంధకారంలో ఉంచి రాజకీయ అవసరాలను తీర్చుకోవడం వంటిదే. 

ఇప్పటికీ ఎంబీఏలు, డిగ్రీలు, ఇంజినీరింగులు చేసిన వారు 20 వేలు, 30 వేలు ఉద్యోగాలు దొరికితే బ్రహ్మాండం అనుకునే రోజులివి. కానీ శారీరక బలం తప్ప ఏ ఇతర నైపుణ్యాలు లేని కూలీలు భార్యభర్త ఇద్దరు పనిచేస్తారు. రోజు పల్లెల్లో 300 నుంచి 500 వస్తుంది. పట్టణాలు, నగరాల్లో 400 నుంచి 700 వస్తుంది. అంటే ఇద్దరు కలిసి పనిచేసి 20-30 వేలకు తక్కువ సంపాదించడం లేదు. అంటే సాధారణ మధ్యతరగతి కుటుంబం కంటే పేద కుటుంబం ఆదాయం ఎక్కువగా ఉంది. కానీ పథకాలు మాత్రం పేదలకు కేటాయిస్తారు. నిజంగా అవసరం ఉన్న వాళ్లు రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతున్నారు. సాధారణ ప్రజలను పథకాలతో మభ్య పెట్టి పాలకులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకుంటూ రాష్ట్ర భవిష్యత్తును పాడు చేస్తే... భవిష్యత్తు ఏమవుతుందో తలచుకుంటేనే భయం వేస్తుంది. పాలకుడు పేద వాడి సంక్షేమాన్ని చూడాలి. సమాజం అవసరాలను పట్టించుకోవాలి, భవిష్యత్తు నిర్మాణం చేయాలి. వీటన్నింటిని బ్యాలెన్స్ చేసినపుడే ఆ రాష్ట్రానికి భవిష్యత్తు. బ్యాలెన్స్ తప్పితే... ఇక భావితరాలు శాశ్వతంగా ఇతర రాష్ట్రాలకు వలసపోయి బతకాల్సిందే. లక్షల కోట్ల డాలర్ల విలువైన వనరులు ఉన్న ఆఫ్రికా, అరబ్ దేశాల కంటే.... ఏ వనరులు లేని పాశ్చాత్య దేశాలు సుఖంగా బతకడానికి కారణాలివే. భవిష్యత్తును నిర్మించుకోవడం నేర్చుకున్న వారే బాగుపడతారు.