జగన్ రెడ్డీ... ప్రెజెంట్ సార్ !!

July 03, 2020

సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ గడప ముందు గడిగడికీ మోకరిల్లుతూ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాడు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో కేసీఆర్ అంత మంచోడు లేరని చెప్పిన జగన్ ... తెలంగాణకు ఆధీనంలో ఉన్న ఏపీకి సామంత రాజులాగా వచ్చినపుడల్లా గవర్నర్ నరసింహన్ కి, సీఎం కేసీఆర్ కి దండాలు పెట్టి పోతున్నాడు. మరి గంటలు గంటలు పదేపదే ముచ్చట్లు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ.. ఇపుడు ఆయన ఏపీ ముఖ్యమంత్రి. అంటే ఏపీ ప్రజల ప్రతినిధి. మాటిమాటికీ... ఏపీ సర్వనాశనానికి కారకుడైన కేసీఆర్ ముందు, నరసింహన్ ముందు తలవంచడం ఎవ్వరికీ నచ్చడం లేదు.
గవర్నర్ వద్దకు పోయినపుడు జగన్ కూర్చునే తీరులో సంస్కారం కంటే కూడా భయం, అతివినయం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఆంధ్రాను జగన్ పాలిస్తున్నాడో లేక కేసీఆర్ - నరసింహన్ లు పాలిస్తున్నారో అర్థం కాని పరిస్థితి.
ఇప్పటికే అనేకం తెలంగాణకు దారాదత్తం చేసిన జగన్ .... వచ్చినపుడల్లా ఏదో ఒకటి ఇచ్చిపోతున్నాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అన్నట్లు కొనసాగాల్సిన సంబంధాలు కాస్తా జగన్ ఆస్తుల భయం వల్ల దండాలు సామీ... అన్నట్లు ఉన్నాయి. పిలవని పేరంటానికి పోయినోడులాగా జగన్ కేసీఆర్ ని తరచూ కలుస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ కు వచ్చిన జగన్.. విమానం దిగీ దిగగానే నేరుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఆయనకు నమస్తే పెట్టిన వెంటనే కాసేపు మాట్లాడి రాజ్ భవన్ నుంచి నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్ కు వెళ్లారు. అసలు ఇది షెడ్యూల్ చేయని మీటింగ్. పైగా కేవలం మర్యాద పూర్వకంగా కలిసినట్లు ఏపీ సీఎంవో చెప్పింది. అంటే... ఏపీ ముఖ్యమంత్రి మాటిమాటికి తెలంగాణముఖ్యమంత్రికి అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఏంటో? జగన్ తాను ఒక పార్టీ అధినేత మాత్రమే కాదు... ఏపీ ముఖ్యమంత్రి. తన స్థాయిని అర్థం చేసుకుని... దానికి తగిన గౌరవం తేవాలని ఏపీ జనం కోరుకుంటున్నారు. జగన్ ఫ్రీక్వెంట్ మీటింగ్స్ పై సెటైర్లు పడుతున్నాయి. జగన్ రెడ్డీ అని కేసీఆర్ అనగానే ప్రెజెంట్ సార్ అంటూ జగన్ అటెండవుతారా ఏంటి అని జనం గుసగుసలాడే పరిస్థితి.