జగన్ మైండ్ బ్లాంక్...

February 27, 2020

ఏపీ సీఎం హోదాలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు నిజంగానే మైండ్ బ్లాంక్ అయ్యిందని చెప్పాలి. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనదైన వ్యూహంతో ఇచ్చిన షాక్ తో నిజంగానే ఇప్పుడు జగన్ మైండ్ బ్లాంక్ అయిపోగా... అసలు నెక్ట్స్ స్టెప్ ఏమిటన్న విషయం తెలియన గిలగిలా కొట్టుకుంటున్నారని చెప్పక తప్పదు. చంద్రబాబు ప్రకటించిన రాజధాని అమరావతిని పీక పిసికేసి చంపేయడమే లక్ష్యంగా సాగుతున్న జగన్... ఏపీకి మూడు రాజధానులంటూ కొత్త మాట ఎత్తుకున్నారు. అసెంబ్లీలో తనకు క్లిస్టర్ క్లియర్ మెజారిటీ ఉందని, తాను నిర్ణయం తీసుకుంటే తనను ఆపగలిగే వారు ఎవరన్న దిశగా సాగుతున్న జగన్... అసలు చంద్రబాబు తనను నిలువరించడం కాదు కదా.. కనీసం టచ్ కూడా చేయలేరన్న వాదనతోనే సాగారు. 

అయితే అదను కోసం ఎదురు చూసిన చంద్రబాబు... అసెంబ్లీలో తన సమక్షంలోనే తనను... తన వయసులో సగం కూడా లేని వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నా కూడా పెద్దగా పట్టించుకోనట్టే కనిపించారు. అనువు గానీ చోట అధికులమనరాదన్న రీతిలో సాగిన చంద్రబాబు... తాను పెంచి పోషించిన అమరావతిని పీక పిసికి జగన్ చంపేస్తున్నా కూడా అసెంబ్లీలో అలా చూస్తుండిపోయారు. అలా చంద్రబాబు సైలెంట్ గా కూర్చున్న వైనాన్ని చూసిన జగన్... ఇక చంద్రబాబు తనను ఏమీ చేయలేరని కూడా అనుకున్నారన్న వాదన కూడా లేకపోలేదు. సరిగ్గా జగన్ లో ఇదే భావనను గమనించిన చంద్రబాబు... శాసనమండలిలో తనకున్న బలాన్ని వినియోగించుకుని జగన్ ను కోలుకోలేని దెబ్బ తీశారు. వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులను కూడా నేరుగా సెలెక్ట్ కమిటీకి పంపేలా చేశారు. 
 
శక్తి లేనట్టే కనిపించి... తనను కోలుకోలేని దెబ్బ కొట్టిన చంద్రబాబును చూసి జగన్ ఇప్పుడు విలవిలా కొట్టుకుంటున్నారట. తనను ఇంతలా ఇబ్బంది పెట్టేసిన చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్న దిశగా సాగుతున్న జగన్... అసలు తన మైండ్ మొత్తంగా బ్లాంక్ గా మారిపోగా... ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. తనకు బ్రేకులేసిన మండలిని రద్దు చేద్దామంటే... తన కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు, అందునా తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు మండలిలో సభ్యులుగా ఉన్నారు. బాబుపై కోపంతో మండలిని రద్దు చేసిన తన అనుంగులను తన కేబినెట్ నుంచి బయటకు పంపలేరు. అలాగని నిత్యం తనను ఇబ్బందులకు గురి చేస్తున్న మండలిని అలా చూస్తూ కూడా ఉండలేరు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుంటున్న చంద్రబాబు మాటేసి దెబ్బ కొడితే ఇలాగే ఉంటుంది మరి.