రాజధాని మార్చాలంటే... జగన్ ఆ పనిచేయాలి-  RRR

August 03, 2020

ప్రజాస్వామ్యంలో మీకు ఇష్టం లేకపోయినా ప్రజాభిప్రాయం తీసుకోవాలి, కనీసం అలా వ్యవహరించాలి... భారీ మెజారిటీ ఉంది నా కిష్టం వచ్చింది చేస్తానంటే కుదరదు... రెఫరెండం పెట్టి ప్రజలందరూ మీ నిర్ణయాన్ని ఆమోదిస్తే రాజధాని శుభ్రంగా మార్చుకోండి... అపుడు ఎవరికీ అభ్యంతరం లేదు అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామరాజు  సూచించారు.

అసలు 40 మందికిపైగా మీ ఎమ్మెల్యేలకే రాజధాని మార్చడం ఇష్టం లేదు. కానీ వారు బయటకు చెప్పలేక నలిగిపోతున్నారు. డప్పులు కొట్టుకుంటూ వైఎస్ విగ్రహం వద్దకు వెళ్లండని చెబితే వారు కుమిలిపోతున్నారు. మీరు ఎక్కువ రోజులు పదవిలో ఉండాలంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలి అని రఘురామరాజు హెచ్చరించారు.

మూడు రాజధానులు అనేది జగన్ ఎంత తలచుకున్నా జరగదు.  ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ను ఒకసారి చదవండి. దాని ప్రకారం రాజధాని ఏర్పాటుకు శ్రీ శివరామకృష్ణన్ కమిటీ కేంద్రం ఏర్పాటుచేసి రాజధాని గుర్తిస్తుంది. అది రాజధాని అవుతుందని ప్రముఖంగా పేర్కొన్నారు. ఆ కమిటీ సూచించిన దాని ప్రకారమే కృష్ణా -గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుచేశారు. అందుకే అమరావతి రైతులు ఆందోళన చెందొద్దు. రైతులు ఆందోళన చెందొద్దు. గాంధీ మార్గంలో నిరసన తెలియజేయండి. కచ్చితంగా కోర్టుల్లో గవర్నరు గారు ఆమోదించిన చట్టం నిలబడదు అని రఘురామరాజు పేర్కొన్నారు.

పెద్ద నిర్ణయాలు తీసుకునేటపుడు అఖిలపక్ష సమావేశం పెట్టడం ఒక సంప్రదాయం. ఆ పద్ధతిని కూడా ఫాలో కాలేదు. మీరు ఎక్కువ కాలం పదవిలో ఉండేలా వ్యవహరించండి. ప్రజాస్వామ్యయుతంగా పాలించండి.... దక్షిణాఫ్రికాలో ఉన్న మీ బంధువులు ఎవరో చెప్పారని మూడు రాజధానులు పెట్టమంటే మీ చేతిలో పనే కదా అనుకుంటున్నారు. అది జరగదు.

రాష్ట్రపతి నోటిఫై చేసిన హైకోర్టును ఒక గవర్నరు చేసిన చట్టం ద్వారా మార్చలేదు అని ఆయన బల్లగుద్ధి చెప్పారు.