జగన్ మెడపై నవరత్నాల కత్తి

December 15, 2019

            ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాల అమలు ఏపీ సీఎం జగన్ మెడకు పెద్ద భారంగా మారుతోంది. నవరత్నాల అమలు కోసం జగన్ రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపుతారని అంతా భావిస్తున్న తరుణంలో దాంతో పాటు మరో షాక్ కూడా ఇవ్వడానికి కూడా సీఎం జగన్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. నవరత్నాల కోసం ఏకంగా ప్రభుత్వ ఆస్తులను విక్రయించడానికి రెడీ అవుతున్నారని సమాచారం.
            నవరత్నాలకు నిధుల సమీకరణ కోసం విలువైన ప్రభుత్వ స్థలాలు, భూముల అమ్మకానికి జగన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే రూ.2.25 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ప్రభుత్వం, నవరత్నాల అమలు కోసం ఆదాయ వనరులను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే విలువైన స్థలాలు, భూములను అమ్మేయాలనే యోచనకు వచ్చినట్లు చెబుతున్నారు.
            ఇప్పటికే జిల్లాల వారీగా ఎకరం నుంచి నాలుగు ఎకరాల విస్తీర్ణం ఉన్న అతిథి గృహాల జాబితా, ఇతర భూముల వివరాలను అందజేయాలని రెవెన్యూశాఖను ప్రభుత్వం ఆదేశించింది. నిరుపయోగంగా ఉన్న స్థలాలు, భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, అతిథి గృహాల స్థలాలన్నింటినీ అమ్మేసేందుకు జగన్‌ సర్కార్‌ సన్నాహాలు చేస్తోందని, బిల్డ్‌ ఏపీ పేరుతో వీటి విక్రయానికి సిద్ధమవుతోందని  విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజధాని విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంతోపాటు ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ అతిథి గృహాలు కూడా విక్రయ ఆస్తుల జాబితాలో ఉన్నాయని చెబుతున్నారు. అయితే, వైసీపీ వర్గాలు మాత్రం దీన్ని ఖండిస్తున్నాయి. నిరర్థక ఆస్తుల సద్వినియోగం కోసమే ఆ వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంటోందని చెబుతున్నారు.