ఏపీలో ఇలా జరిగే సమస్యే లేదు

August 10, 2020

ఏపీ సీఎంకి మొదట్నుంచి కరోనాపై చిన్న చూపు. అదంటే అక్కడి ముఖ్యమంత్రి, ప్రజలకు ఇద్దరికి ఏ భయమూ ఉండదన్నట్టే ఉంటుంది వ్యవహారం. నిన్న ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూశాం. మనకు ప్రధాని ప్రతి మీటింగులో మాస్కుతో కనిపిస్తాడు గాని సీఎం జగన్ మాత్రం మాస్కు వాడరు.

జగన్ మాత్రమే కాదు ఆయన తో పాటు చాలా మంది వైసీపీ నేతలు అసెంబ్లీలో మాస్కుల్లేకుండా అది వైసీపీ పాలసీ అన్నట్లు కనిపించారు. ఎవరో ఒకరిద్దరు తమ ఆరోగ్యంపై భయం ఉన్నవారు మాత్రం మాస్క్ పెట్టుకున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంటే 40ల్లో ఉన్నారు, ఆయనకు నిరంతరం పరిసరాలను శానిటైజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి వైరస్ సోకే అవకాశమూ తక్కువ. వచ్చినా దానిని తట్టుకోవడానికి ఆయన ఒంట్లో సత్తువ  ఉంది, గవర్నమెంటు రెడీగా ఉంది.

కానీ సీఎం ఇలా నిర్లక్ష్యం చేస్తే అందరూ ముఖ్యమంత్రిని ఫాలో అయితే ఏంటి పరిస్థితి? కాస్త వయసు మీద పడిన వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పిల్లలు ఇబ్బందులు పడుతారు కదా. వారి కోసమైనా మన ముఖ్యమంత్రి అపుడపుడైనా మాస్క్ పెట్టుకోవాలి కదా. ఏ సందర్భంలోను జగన్ మాస్కును వాడటం లేదు.

ఒకవైపు మాస్కు కంపల్సరీ అని మోడీ ఎంత మొత్తుకున్నా మన ముఖ్యమంత్రి గారు వినరు గాక వినరు. జనాలకు మాత్రం మూడు మాస్కులు కుట్టించమన్నారు. అవి పంచారో లేదో తెలియదు.

ఇదిగో గుజరాత్ లో ఏం జరిగిందో తెలుసా...

కేబినెట్ సమావేశానికి మాస్క్ ధరించకుండా వచ్చారంటూ మంత్రికి 200 రూపాయల జరిమానా వేశారు. కేబినెట్ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి మాస్క్ ధరించకుండా వచ్చారంటూ మంత్రి ఈశ్వరీ సిన్హా పటేల్‌కు అధికారులు జరిమానా విధించారు. మిగతా మంత్రులంతా మాస్కులతో విధిగా హాజరయ్యారు.  గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆయనకు 200 రూపాయల జరిమానా విధించారు.

జరిమానా రశీదును చూపిస్తూ మంత్రి ఏమన్నారంటే... ‘‘మాస్క్ లేదని ఫైన్ కట్టాను. నేను ఎప్పుడూ మాస్క్ ధరించే ఉంటా. కానీ ఈసారి కారు దిగే సమయంలో మరిచిపోయాను. నా తప్పును తెలుసుకున్నా’’ అని ఈశ్వర సిన్హా పేర్కొన్నారు.