కొత్త లుక్.. కళ్లజోడుతో జగన్

May 31, 2020

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త లుక్ లో కనిపించారు. కళ్లజోడు పెట్టుకున్న ఆయన ఫోటో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకీ జగన్ కళ్లజోడు పెట్టుకోవటానికి కారణం ఏమిటన్న విషయంలోకి వెళితే.. గుంటూరు పట్టణంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో వైద్య ఆరోగ్య శాఖ.. విద్యాశాఖ.. నగరపాలక సంస్థలు కలిసి ఉచిత కళ్లజోళ్ల పంపిణీ స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి.
ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో అక్కడున్న కళ్లజోళ్లను పరిశీలించారు జగన్. ఈ సందర్భంగా సీఎం పక్కనున్న గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఒక కళ్లజోడును జగన్ చేతికి ఇచ్చారు. దీంతో.. దాన్ని అందుకున్న ఆయన.. కళ్లజోడు బాగుందంటూ.. పెట్టుకొని చిరునవ్వు నవ్వారు.
రోటీన్ కు భిన్నంగా కళ్లజోడుతో దర్శనమిచ్చిన ముఖ్యమంత్రి జగన్ ను ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు. కళ్లజోడులో సరికొత్తగా కనిపిస్తున్నారని అక్కడి అధికారులు వ్యాఖ్యానించగా.. జగన్ నవ్వుకుంటూ ముందుకెళ్లారు. ఈ కార్యక్రమం తర్వాత అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బాధితులకు చెక్కులు అందించారు. రూ.10వేల లోపు డిపాజిటర్లకు చెక్కులు పంపిణీ చేశారు. తర్వలోనే రూ.20వేలు అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసిన వారికి కూడా చెక్కులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసిన డిపాజిట్ దారులను ఆదుకుంటామన్న హామీని ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చినంతనే ఆ పని చేసి బాధితుల ముఖాల్లో నవ్వులు పూయించారని చెప్పాలి.