​అమరావతిని ఆపేయండి... !

July 07, 2020

ముఖ్యమంత్రిగా పరిపాలనలో తన ముద్ర వేస్తాను అని అధికారంలోకి వచ్చిన జగన్​ చంద్రబాబు మొదలుపెట్టిన పనులను ఆపడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అన్ని ఇంజినీరింగ్ వర్కులను ఆపమని మొదటి రోజే ఆదేశాలు ఇచ్చిన జగన్... తాజాగా నేను మళ్లీ చెప్పేవరకు అమరావతిలో ఎక్కడి పనులు అక్కడే ఆపేయమంటూ ఆదేశాలు జారీ చేశారట. ప్రతిరోజూ ఏపీలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తితో జనం టీవీలు, పేపర్లు ఆసక్తిగా చూస్తున్నారు. రోజురోజుకు కొత్త కొత్త ఆదేశాలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నారు.
జగన్ గెలిస్తే అమరావతిని మారుస్తారు అని ఎన్నికల ముందు చంద్రబాబు పలుమార్లు అన్నారు. జగన్ మారుస్తాడో లేదో తెలియదు గాని అమరావతి పనులు ఆపమని ఆదేశాలు జారీచేయడం మాత్రం ఏపీలో కలకలం రేపింది. అయితే, జూన్ మొదటి వారంలో సీఆర్డీఏ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు జగన్. అపుడు దీనిపై తదుపరి ఆదేశాలు జారీ అవుతాయి.
అయితే, తదనంతరం కూడా అమరావతిలో చంద్రబాబు ప్రతిపాదించిన కట్టడాలన్నీ జగన్ కొనసాగించే అవకాశం కనిపించడం లేదు. దీనికి కారణం విపరీతమైన నిధుల లోటు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే... ఏటా సుమారు 40 వేల కోట్లు అదనంగా కావాలి. ఆ లెక్కన అనవసరంగా అమరావతి భారాన్ని ఎందుకు మోయాలి అన్నది జగన్ ఆలోచన. అమరావతి విషయంలో జగన్ ప్రజలకు ఏ హామీ ఇవ్వలేదు. కాకపోతే రాజధానిని మార్చను అని ఒకసారి చెప్పారు. మరో ఇంటర్వ్యూలో అమరావతి మార్పుపై ఏమీ చెప్పలేను అన్నాడు. తాత్కాలిక భవనాలు అనే కాన్సెప్టు తీసేసి... ప్రస్తుతం ఉన్న వాటిని పర్మనెంట్ భవనాలుగా చేయాలని జగన్ భావిస్తున్నాడు. పరిపాలనకు అవి చాలన్నది జగన్ ఆలోచన. అనవసర ఖర్చు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అన్నది ఒకటైతే... ఇపుడు తాను కొనసాగించినా ఆ పేరు చంద్రబాబుకే వచ్చేది. అలాంటపుడు ఆ భారాన్ని ఎందుకు మోయాలని జగన్ ప్రశ్నిస్తున్నారట. అంటే తెలుగు వారికి హైదరాబాదు వంటి అమరావతి క్యాపిటల్ జగన్ ఉన్నంత వరకు కలగానే మిగిలిపోవడం గ్యారంటీ.