చంద్రబాబు ఒక్కడే అన్ని కులాల వాడా..?

July 07, 2020

సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ఏపీలో రాజకీయాలు అత్యంత ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. రాజ‌కీయాల్లో కుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే ఈ రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది..? మ‌రేం జ‌ర‌గ‌బోతోంది..? అనే ప్ర‌శ్న‌లు విశ్లేష‌కుల‌ను ఆలోచింప‌జేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ తిరుగులేని విజ‌యం సాధించి, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గా.. టీడీపీయేమో.. దారుణ ప‌రాజ‌యంతో అధికారం కోల్పోయి ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం అయిపోయింది. ఇక ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అధినేత చంద్ర‌బాబు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌కు సంబంధించిన ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందులో ప్ర‌ధానంగా కాపుల‌కు సంబంధించిన విష‌యం హాట్‌టాపిక్‌గా మారుతోంది.

ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు ఒంట‌రిగా బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. అయితే.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో కాపుల రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి బాగానే చ‌ర్చ జ‌రిగింది. చంద్ర‌బాబు కూడా వారికి న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇక ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా కాపుల‌కు న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అయితే.. ఏకంగా కాపు సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉన్న ప్రాంతాల్లోనే ప‌ర్య‌టించి, కుల బ‌లంతో గెలిచేందుకు ప్ర‌య‌త్నం చేసి, దారుణంగా ఓడిపోయారు. వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు కాపుల సంక్షేమం, రిజ‌ర్వేష‌న్ల చ‌ర్చ మొద‌లైంది.

కాపు నేత ముద్ర‌గ‌డ చేస్తున్న వ్యాఖ్య‌లు ఆస‌క్తిదాయ‌కంగా ఉంటున్నాయి. ఎన్నిక‌ల్లో కాపులంతా వైసీపీకే ఓట్లు వేశార‌ని, అందుకే వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింద‌ని, అందుకే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌మ త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని కాపు నేత ముద్ర‌గ‌డ అంటున్నారు. అయితే.. కాపు రిజ‌ర్వేష‌న్ల హామీ.. చంద్ర‌బాబు ఇచ్చార‌ని.. ఆయ‌న ఇచ్చిన హామీని మేమెలా చేస్తామ‌ని జ‌గ‌న్ అంటున్నారు. ఇక కుల‌బ‌లంతో ఎన్నిక‌ల్లోకి వ‌చ్చిన జ‌న‌సేన అధినేత మాత్రం కాపుల గురించి మాట్లాడ‌డం లేదు.. క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు.. ఈ నేప‌థ్యంలో ఏపీలో ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి హ‌యాంలో మ‌రీ ఇంతలా కులాల లొల్లి లేద‌ని, కాపుల‌కు ఇచ్చిన హామీ మేర‌కు ఆయ‌న చాలా చేశార‌ని, ఇదే స‌మ‌యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టార‌నే చ‌ర్చ మ‌ధ్య‌త‌ర‌గ‌తిలో మొద‌లైంది.