జగన్ రాజధాని ప్లాన్ వెనుక ఇంత కథ ఉందా?

May 22, 2020
CTYPE html>
విపక్ష నేతగా ఉన్న సమయంలో నవ్యాంధ్ర నూతన రాజధానిగా అమరావతికి జైకొట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తాజాగా తాను సీఎం కాగానే మాట మార్చేశారు. ఏపీకి మూడు రాజధానులుంటే తప్పేంటని ప్రశ్నించిన జగన్... మూడు రాజధానులతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చేమోనంటూ గత అసెంబ్లీ సమావేశాల్లో ఓ సంచలన ప్రకటన చేశారు. ఆ వెంటనే రాజధాని అమరావతి పీక పిసికేలా రచించి వ్యూహానికి మరింత పదును పెట్టారనే చెప్పాలి. జగన్ ప్రకటనపై ఓ వైపు రాజధాని రైతులు రోడ్డెక్కి నెల రోజులకు పైగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా... తనకు అవేవీ కనిపించడం లేదన్న రీతిలో సాగుతున్న జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులు కావాల్సిందేనన్న దిశగా వేగంగానే అడుగులు వేస్తున్నారు. ఈ దిశగా సాగుతున్న జగన్ ప్లాన్ వెనుక అసలు కథేమిటన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది.
 
అయినా ఇప్పటికప్పుడు ఏపీకి మూడు రాజధానులు అవసరమేనా? అన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించే ఏ వ్యక్తి అయినా... ఏపీకి మూడు రాజధానులు అవసరమే లేదని వాదిస్తున్నారు. అయితే సగటు వ్యక్తి వాదనను అసలేమాత్రం పట్టించుకోని జగన్... రాజధాని విషయంపై తాను గీసుకున్న ప్లాన్ కే కట్టుబడి సాగుతున్నారని చెప్పాలి. మరి సదరు ప్లాన్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తించే విషయమే. అదేంటంటే.. ఒక ప్లాన్ విఫలమైతే... మరో ప్లాన్.. ఇలా ఒకటి, రెండు కాదు... ఏకంగా నాలుగు ప్లాన్లను రచించుకున్నారు. ఆ నాలుగు ప్లాన్లేమిటి? వాటి వెనుక జగన్ ఉద్దేశాలు, లక్ష్యాలు ఏమిటన్న విషయంలోకి వెళ్లిపోదాం పదండి.
 
జగన్ ప్లాన్ లోని నాలుగు ప్లాన్లు ఒక్కొక్కటిగా పరిశీలిస్తే... 
స్టేజ్ 1: నవ్యాంధ్ర నూతన రాజధానిని దొనకొండలో ఏర్పాటయ్యేలా జగన్ వ్యవహరించారు. ఈ కారణంగా తన, తన వాళ్లకు చెందిన దొనకొండ భూములకు మంచి బూమ్ వస్తుందని ఆశించారు. అయితే జగన్ అనుకున్నట్టుగా దొనకొండలో ఎంతకాలం వేచి చూసినా... దొనకొండ భూముల ధరలకు రెక్కలైతే రాలేదు. మరి ఏం చేయాలి? దొనకొండను వదిలేయాల్సిందే.
స్టేజ్ 2: తనదైన వ్యూహంతో అమరావతి పరిధిలోని భూముల ధరలను అమాంతంగా పడేయాలని కూడా జగన్ ప్లాన్ వేశారు. అయితే ఆ ప్లాన్ కూడా వర్కవుట్ కాకపోగా.. రాజధాని తరలిపోతోందన్నా కూడా అమరావతి పరిధిలోని భూముల ధరలు పడిపోలేదు. అంతేకాకుండా అక్కడి భూములను విక్రయించేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు.
స్టేజ్3: తొలి రెండు దశలు విఫలం కాగా... జగన్ తన ప్లాన్ లోని మూడో స్టేజ్ కు తెర తీశారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటూ ఓ కొత్త మాటను ప్రచారంలోకి తెచ్చారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటే... ఏదో కార్యనిర్వాహక రాజధాని మాత్రమే కాదు... భవిష్యత్తులో విశాఖే పూర్తి స్థాయి రాజధాని అని ప్రచారం చేశారు. వెరసి అక్కడ కొత్తగా తెర మీదకు వచ్చే భూమ్ తో ఏకంగా కనీసం 10 వేల కోట్లైనా నొక్కేసే ప్లాన్ కు తెర తీశారు. ఈ ప్లాన్ బాగానే వర్కవుట్ అయినట్లుగానే తెలుస్తోంది. విశాఖలో బూమ్ తో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పార్టీకి నష్టమే కదా. మరి దాన్నెలా పూడ్చుకునేది?
స్టేజ్ 4: ఇక్కడే జగన్ మరో మాస్టర్ ప్లాన్ వేశారు. ఎన్నికలకు ఎలాగూ ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది కదా. తనకు బాగానే గిట్టుబాటు అయిన విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను తరలించేస్తున్న జగన్... ఓ రెండేళ్ల పాటు విశాఖలో అభివృద్ధి పేరిట బాగానే దండుకుంటారట. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉందనగా... తిరిగి విజయవాడపై దృష్టి సారించి అక్కడ అభివృద్ధి మంత్రం పఠిస్తే సరిపోతుంది కదా అని జగన్ భావిస్తున్నారట. 
తన స్వలాభమే లక్ష్యంగా జగన్ గీసుకున్న ఈ నాలుగు ప్లాన్ లు బాగానే ఉన్నా... వచ్చే ఎన్నికల్లో ఇదే ప్లాన్ వైసీపీకి గంగలో కలిపేయడం ఖాయమన్న వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.