​జగన్ కి ఎమ్మెల్యేలు వద్దు... కానీ వారు కావాలి

June 30, 2020

జగన్ ఎమ్మెల్యేలను కొనడు.. అని అసెంబ్లీలో చెబితే.. మాబాబే ఎంత మంచోడు అని సంబరపడ్డారు తెలుగుదేశం సానుభూతి పరులు. కానీ జగన్ ఎప్పటికీ జగనే. అతని ప్లాన్లు అతనికి ఉన్నాయి. ఇపుడు ఆ ప్లాన్లు చూసి కారాలు మిరియాలు నూరుతున్నారు టీడీపీ ఫ్యాన్స్. జగన్ ఐడియా టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.

వాస్తవానికి జగన్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నా జగన్ కు ఒరిగేదేమీ లేదు. పైగా చంద్రబాబుకు సానుభూతి పెరుగుతుంది. ఎందుకంటే 50-60 సీట్లు వచ్చి ఉంటే ఫిరాయింపులను జనం లైట్ తీసుకునే వారు. కానీ మరీ 23 సీట్లలో కూడా లాక్కుంటే కచ్చితంగా అది కక్ష అని భావిస్తారు జనం. అందుకే తనకు చెడ్డపేరు రాకుండా ప్రపంచానికి పెద్దగా తెలియకుండా ఫిరాయింపులను ప్లాన్ చేశాడు జగన్. అంతేకాదు... తెలుగుదేశం ఆయువుపట్టును టార్గెట్ చేశాడు జగన్.
టీడీపీ బలం ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు. ఆ పార్టీ పట్టణ, గ్రామీణ కేడర్. అంటే సర్పంచి నుంచి జెడ్పీటీసీ, ఎంపీపీలన్నమాట. వాస్తవానికి డైరెక్టు ఓటు బ్యాంకు కలిగి ఉండి.. ఊళ్లలో పార్టీని నడిపేది వీళ్లే. వీళ్లు ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా ఉంటుంది. వీరు దశాబ్దాల పాటు ఒకే పార్టీలో పనిచేసి లోకల్ గా బలంగా ఉంటారు. అంత సులువుగా పార్టీ మారరు. అందుకే ఎమ్మెల్యేలు పోతే పార్టీకి ఎన్నికల నాటికి ఎంతోమంది ఎమ్మెల్యేలు పుట్టుకువస్తారు. కానీ కేడర్ దెబ్బతింటే మళ్లీ తిరిగి పొందడం కష్టం. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజవకర్గాల వారీగా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు వల వేసే పనిలో పడింది. సామాజిక వర్గాల వారీగా జాబితా తయారుచేయించిన జగన్... తాయిలాలు, పనులు చూపి వారందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఫిరాయింపుల గొడవ కూడా ఉండదు. ఇప్పటికే అనేక చోట్ల ద్వితీయ శ్రేణి నేతలకు వైసీపీ నేతలు ఎర వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరుగుతుండటం కూడా దీనికి కారణం. ఇవి బ్యాలెట్ ఎన్నికలు కావడంతో వైసీపీలో భయం పట్టుకుంది. 40 శాతం ఓట్లు తెచ్చుకున్న తెలుగుదేశం ఈసారి స్థానిక ఎన్నికల్లో భారీగా సీట్లు పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో... పరువు కాపాడుకునేందుకు జగన్ రకరకాల ఎత్తులువేస్తున్నారు.
అయితే, రాజకీయం చంద్రబాబుకు కొత్త కాదు. అందుకే చంద్రబాబునాయుడు దీనికి ప్లాన్ రెడీ చేసి అమలు చేయడం కూడా మొదలుపెట్టాడు. కార్యకర్తలపై దాడుల్లో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. ఇప్పటికే స్వయంగా ఆయా ఇళ్లకు వెళ్లారు. మరింత మందికి పార్టీ తరఫున భరోసా ఇవ్వనున్నారు చంద్రబాబు. ఈ వ్యవహారం మీడియాకు ఎక్కకుండానే... ఇంత జరిగింది. జగన్ స్పీడుగా ఉంటే బాబు మరింత స్పీడు పెంచుతున్నారు. మరి స్థానిక ఎన్నికలు ముగిసే నాటికి ఏం జరుగుతుందో చూడాలి.