జగన్ నయా మంత్రం... ప్లాన్ 3C !!

May 30, 2020

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.... ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నయా మంత్రాన్ని అమలు చేస్తున్నారు. ఆంగ్ల పదం ‘సీ’తో అల్లుకున్న ఆ మంత్రాన్ని అందరూ ఇప్పుడు ‘ట్రిపుల్ సీ’ గా పిలుస్తున్నారు. ఈ మంత్రం విపక్షానికి చెందిన నేతలను, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న అధికారులను టార్గెట్ చేసేందుకే కాకుండా... తన సొంత పార్టీకి చెందిన సొంత మనుషుల వియంలోనూ జగన్ ఇదే ఫార్మూలాను అమలు చేస్తున్నట్లుగా కూడా ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు... సాంతం డిఫెన్సివ్ మోడ్ లోనే సాగిన జగన్... అధికారం చేతికందగానే అఫెన్సివ్ మోడ్ లోకి వచ్చేశారు. ఈ క్రమంలో ట్రిపుల్ సీ ఫార్ములాను విపక్షం విషయంలో ఒక రకంగా, తన సొంత పార్టీ నేతల విషయంలో మరోరకంగా అమలు చేస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నారు.

సరే... ముందుగా విపక్షానికి అన్వయిస్తున్న ట్రిపుల్ సీ కి అర్థం ఏమిటంటే... సీ-కరప్షన్, సీ- క్యాస్ట్, సీ- కేడర్ (టీడీపీ). సో... టీడీపీ విషయంలో ట్రిపుల్ సీ అంటే... కరప్షన్, క్యాస్ట్, కేడర్ గా జగన్ తన ఫార్మూలాకు పేరు పెట్టేసుకున్నారు. ఇక సొంత పార్టీ వాళ్ల విషయానికి వచ్చేసరికి... సీ- క్యాష్, సీ- క్యాస్ట్, సీ-కేడర్ (వైసీపీ)గా ట్రిపుల్ సీకి జగన్ నిర్వచనం పెట్టేసుకున్నారు. 

ఈ ఫార్మూలాను టీడీపీ విషయంలో ఎలా అమలు చేస్తున్నారన్న విషయానికి వస్తే... తన వైరి వర్గానికి చెందిన నేతలను దెబ్బ తీసేందుకు జగన్ ముందుగా అవినీతిని బయటకు తీస్తున్నారు. ఆ అవినీతి కూడా టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే టార్గెట్ చేసేలా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు అంశాలతోనే టీడీపీ కేడర్ ను చెల్లాచెదురు చేసేలా ప్లాన్ రచిస్తున్నారు. ఇందుకు ఉదాహరణలుగా ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావులపై జగన్ సర్కారు తీసుకున్న చర్యలే నిదర్శనంగా చెప్పుకోవాలి. అదే సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని ముద్ర పడిన సీనీయర్ ఐఏఎస్ అధికారి సతీశ్ చంద్ర... చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వారు కాకపోవడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదట. 

ఇక ఇదే ఫార్మూలాను వైసీపీ నేతల విషయంలో జగన్ ఎలా అమలు చేస్తున్నారన్న విషయానికి వస్తే.. పార్టీలో దాదాపుగా అన్ని సామాజిక వర్గాలకు చెందిన నేతలున్నా... తన సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలకు మాత్రమే భారీగా నిదులు మంజూరు చేస్తూ... సదరు నేతలు తమ కార్యకర్తల బలాన్ని పెంచుకునేలా వ్యవహరిస్తున్నారట. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి మాత్రమే భారీ నిధులు కేటాయిస్తున్న జగన్ తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. అదే సమయంలో సొంత పార్టీకే చెందిన ఇతర సామాజిక వర్గాల నేతలను బాగానే చూసుకున్నట్లుగానే కనిపిస్తున్న జగన్... వారికి మాత్రం నిధుల విషయంలో అంతగా ఆసక్తి చూపడం లేదట. ఈ కారణంగానే జగన్ కేబినెట్ లో ఉన్నా, పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నా... ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతలకు ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు విడుదల కావడం లేదట.