టార్గెట్ పవనే.. జగన్ ప్లాన్ బయటపడిపోయింది

September 17, 2019

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఆశ.. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో ఎన్నో పనులను చేయిస్తోంది. అధికారం సాధించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ అధినేత వలసలపై దృష్టి సారించడం వెనుక కూడా ఎన్నో వ్యూహాలు ఉన్నాయన్నది సుస్పష్టం అవుతోంది. తాజాగా సినీ నటులు జీవిత, రాజశేఖర్ ఆ పార్టీలో చేరడానికి గల కారణం కూడా బయటపడిపోయింది. కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. సినిమా వాళ్ల అందరిలాగే వీళ్లు కూడా చేరిపోయారని అంతా అనుకున్నారు. అయితే, వీళ్లను వైసీపీలో చేర్చుకుంది జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసేందుకేనని తెలిసింది. గతంలో మెగా ఫ్యామిలీతో వివాదాలు ఎదుర్కొన్న ఈ జంట.. తాజాగా పవన్‌ను విమర్శించేందుకు వైసీపీ గూటికి చేరిందని సమాచారం. తాజాగా జరిగిన ఓ పరిణామమే దీనికి బలం చేకూర్చుతోంది.

వైసీపీలో చేరిన జీవితా రాజశేఖర్ ఎన్నికల సమరంలోకి దిగారు. అధినేత ఆదేశాల ప్రకారం వాళ్లిద్దరూ పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని లయన్స్ క్లబ్‌లో జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో జీవిత, రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్లు ప్రసంగిస్తూ.. ‘‘దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆరోగ్య శ్రీ, 108 లాంటి పథకాలతో ఎంతో మందికి ప్రాణదాత అయ్యారు. ఫీజు రియిబర్స్‌మెంట్, వైఎస్సార్ కంటే మంచి పథకాలను వైఎస్ జగన్ అమలు చేస్తారు. కాబట్టి జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి. ఆయన ఎంతో మంచి మేనిఫెస్టోను రూపొందించారు. అందులో పేర్కొన్న ప్రతి అంశాన్ని కచ్చితంగా అమలు చేస్తారనే నమ్మకం ఉంది. అందుకే ఆయనకు తప్పకుండా ఓటు వేయండి. వైసీపీ అభ్యర్థులను గెలిపించి, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయండి’’ అని కోరారు.

అంతేకాదు, ఈ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడికి అనుభవం ఉందని సీఎం చేసి అంతా మోసపోయారు. అమరావతి పేరుతో ముప్పైవేల ఎకరాల పంట భూములను నాశనం చేశారు. అమరావతిని సింగపూర్‌ చేస్తానని భ్రమపెట్టారు. అక్కడి కంపెనీల దగ్గర కమీషన్లు కొట్టేశారు. పసుపు-కుంకుమ డబ్బులతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆయన్ను నమ్మెుద్దు. వేల కోట్లు సంపాదన వదిలేసి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సంపాదన వదిలేసింది కేవలం చంద్రబాబు దగ్గర బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ కోసమే. వాళ్లిద్దరూ ఒక్కటే. టీడీపీ-జనసేన తెర వెనుక రాజకీయాలు చేస్తున్నాయి. కాబట్టి ప్రజల కోసం బ్రతికే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్‌ జగన్‌ మాత్రమే. మన భవిష్యత్తు బంగారంలా ఉండాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయ్యాలి.