రాజధాని రైతుల్లో చీలిక... బాబుపై జగన్ కోపమే కారణమా?

February 25, 2020

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ సీఎంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన మార్కు వ్యూహంతో ముందుకు సాగుతున్నారన్న మాట ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు రాజధానిని అమరావతి నుంచి తరలించబోనని మాటిచ్చిన జగన్... ఎన్నికలకు ముగిసి తాను సీఎం అయిపోగానే ఆ మాటను మరిచిపోయనట్లుగానే వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. రాజధానిలో చేపట్టిన నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ... దానిని వెలికి తీస్తానని చెబుతున్న జగన్... రాజధాని నిర్మాణాన్ని దాదాపుగా నిలిపివేశారు. అంతేకాకుండా అమరావతి నుంచి రాజధానిని తరలించే దిశగా సాగుతున్న జగన్... ఆ దిశగా చాలా స్లోగానే అడుగులు వేస్తున్నా... తనదైన మార్కు కక్షపూరిత వైఖరితో సాగుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

 

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై కోపంతోనే జగన్ అమరావతిని చంపేసే దిశగా సాగుతున్నారనేందుకు కూడా ఇప్పుడు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలు రాజధానిలో ఏం జరుగుతుందో చూద్దామంటూ ఈ నెల 28న చంద్రబాబు అమరావతిలో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ పర్యటనలోనే చంద్రబాబుకు చుక్కలు చూపించాలని జగన్ కంకణం కట్టుకున్నట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చిన రైతుల్లో జగన్ చీలిక తెచ్చేశారు. ఇందుకు నిదర్శనంగా సోమవారం రాజదానిలో మీడియా ముందుకు వచ్చిన రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడమేనని చెప్పక తప్పదు.

 

ఓ వర్గమేమో రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు చేసిన కృషిని కీర్తిస్తూ... అసలు రాజధానిని అమరావతిలో కడతారా? లేదా? చెప్పాలంటూ జగన్ సర్కారును నిలదీసినంత పనిచేసింది. ల్యాండ్ పూలింగ్ పేరిట చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఎంతో ఉదాత్తమైనదని, అందుకే తాము రాజధాని కోసం భూములు ఇచ్చామని ఆ వర్గం రైతులు బహాటంగానే చెప్పేశారు. అయితే ఇంకో వర్గం రైతులు... తమ నుంచి రాజధాని నిర్మాణం కోసమంటూ వేలాది ఎకరాల భూములు తీసుకున్న చంద్రబాబు... వాటిలో ఏ మేర అభివృద్ధి చేశారో చెప్పాకే రాజదానిలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. మొత్తంగా జగన్ సర్కారు అనుసరిస్తున్న వ్యూహంతో రాజధానికి భూములిచ్చిన రైతుల్లో ఏకంగా చీలికే వచ్చేసిందన్న మాట. మరి ఈ తరహా పరిణామాలు మున్ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో?