ప్రార్థనలు చేస్తే బతికేదానికి ఇక జగన్ ఎందుకు?

June 04, 2020

అరగంట నిడివి ఉన్న వీడియో సందేశంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకేం సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు? ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆంధ్రోళ్లు మరింత ఆందోళన చెందేలా సీఎం మాటలు ఉన్నాయా? సంక్షోభ సమయంలో చెప్పాల్సిన మాటలు ఇవేనా? కరోనా కారణంగా ఏపీ మాత్రమే ఇబ్బంది పడటం లేదు. యావత్ ప్రపంచం పోరాడుతోంది. ఏ పాలకుడి నోటి నుంచి రాని మాటలు జగన్ నోటి నుంచి రావటం వెనుక అర్థమేంది? కరోనాతో సహజీవనం చేయాలని.. వ్యాక్సిన్ వచ్చే వరకూ దాన్ని భరించక తప్పదని.. జీవితంలో ఇదో అంతర్భాగం అవుతుందని.. ఇదో నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని.. స్వైన్ ఫ్లూ మాదిరే.. ఇట్ జస్ట్ పాసెస్ ఆన్.. అంటూ ఏపీ సీఎం నోటి నుంచి వచ్చిన మాటల మర్మమేంది? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
ముఖ్యమంత్రి అంటే మామూలు స్థానం కాదు. కోట్లాది మంది ప్రజల అలనాపాలనా చూసేవాడు. వారి జీవితాలకు తాను రక్షకుడిగా ఉంటానని చెప్పేటోడు. మీకెందుకు నేనున్నానని భరోసా ఇచ్చేటోడు. నేను చెప్పింది చేయండి.. కరోనా సంగతి నే చూసుకుంటానంటూ ధైర్యం చెప్పాల్సినోడు. మరి.. అలాంటి తీరుకు భిన్నంగా కరోనా గురించి కఠిన వాస్తవాలు ఇవే అన్నట్లుగా జగన్ ఎందుకు మాట్లాడారు? అన్నది అసలు ప్రశ్న.
ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం.. చేదు మాత్రకు షుగర్ కోటింగ్ కలరింగ్ ఇవ్వటం జగన్ కు నచ్చదు. నిజాన్ని నిర్బయంగా చెబుదామన్న భావన ఆయనకు ఎక్కువే. అయితే.. అదెంత ఉండాలన్న విషయంపై క్లారిటీ మిస్ కావటంతోనే అసలు సమస్యగా చెప్పక తప్పదు. కరోనా గురించి కొన్ని విషయాలు ప్రజలకు కచ్ఛితంగా చెప్పాల్సిన అవసరం ఉందన్న మాట జగన్ నోటి నుంచి రావటం చూస్తే.. మాయదారి వైరస్ గురించి అవగాహన కలిగించే ఆలోచన ఆయన మాటల్లో కనిపిస్తుంది.
ఆలోచన మంచిదే అయినా.. అందుకు తగినట్లుగా మాటలు లేకుండా ఇబ్బంది. జగన్ ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కరోనా గురించి ఆయన చెప్పిన మాటలన్ని వాస్తవాలే. వాటితో ప్రజల్లో మరింత నిరాశను కలిగించటమే తప్పించి.. కొత్త ఆశల్ని క్రియేట్ చేయవు. యుద్ధం చేసేటోడు.. విజయమే లక్ష్యమని చెబుతాడు. అంతేకానీ.. అసలు కారణాన్ని చెప్పడు. తానేం తప్పు చేయకున్నా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. ఆ ప్రాసెస్ లో చాలా ప్రాణాలు పోతాయని.. అదంతా కామన్ అని చెప్పటం చూస్తామా?
కరోనా విషయంలోనూ అంతే. అదో అంటువ్యాధి అని.. అమ్మోరు.. ఇతర అంటువ్యాధుల మాదిరే కరోనా అని చెప్పి దాన్ని చిన్నదిగా చూపించిన సీఎం జగన్.. రానున్న రోజుల్లో అది మన జీవనంలో ఒక అంతర్భాగం అవుతుందని.. స్వైన్ ఫ్లూ కూడా అంతే.. ఇట్ జస్ట్ పాసెస్ ఆన్ అన్న వ్యాఖ్య ప్రజలకు ఏ మాత్రం రుచించదన్నది మర్చిపోకూడదు.
సమస్యను సమస్యగా చూపిస్తే ప్రయోజనం ఏముంటుంది? అధినేతగా.. ఆ సమస్యకు పరిష్కారం తన దగ్గర ఉందన్న అభయాన్ని ప్రజలకు ఇవ్వాలి. ఈ విషయంలో జగన్ వ్యూహం పక్కాగా లేదని చెప్పాలి. విరుచుకుపడే కరోనాకు చెక్ చెప్పేందుకు తాను పక్కా ప్లానింగ్ చేస్తున్నానని.. తనకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని చెప్పి.. ఏం చేయాలన్న సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి.
అందుకు భిన్నంగా ముస్లిం.. క్రిస్టియన్.. హిందూ సోదరులు నిత్యం చేసే ప్రార్థనల్లో రాష్ట్రాన్ని చేర్చాలన్న మాటలో బేలతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రజల ప్రార్థనలతో రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చన్న భావన కలిగేలా తన మాటలు ఉండకూడదన్న విషయాన్ని జగన్ ఎప్పుడు గుర్తిస్తారు. కరోనా పుణ్యమా అని లాక్ డౌన్ లో ఉన్న ప్రజలకు భవిష్యత్తు మీద కొత్త ఆశలు కలిగేలా చేయాలే తప్పించి.. కొత్త కంగారు పుట్టేలా ఉండకూడదన్న విషయాన్ని జగన్ గుర్తిస్తే మంచిది