రెడ్లకు సైలెంట్ గా క్లారిటీ ఇచ్చిన జగన్

May 24, 2020

పాతికమందితో ఏర్పాటైన జగన్ కేబినెట్‌పై లోకమంతా తెగ ప్రశంసలు కురిపించింది. సామాజిక న్యాయం పాటించడంలో జగన్‌ను మించినవారు లేరంటూ తెగ కీర్తించింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు.. ఇలా అందరికీ స్థానం కల్పించిన జగన్ చివరికి తన సొంత సామాజికవర్గానికి పదవులు తగ్గించారని.. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ ఇలాంటి ధైర్యం చేయలేదని అంతా ముచ్చటపడ్డారు. అయితే.. నామినేటెడ్ పదవుల విషయంలో జగన్ చేపడుతున్న నియామకాల తీరు చూస్తున్నవారు మాత్రం ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. బీసీలను పదవుల నుంచి బయటకు పంపించి రెడ్లకు వాటిని పంచిపెడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. అందుకు ఉదాహరణలు చూపుతున్నారు.
జగన్ పాలనలో ఇప్పటివరకు కేటాయించిన నామినేటెడ్ పోస్టులు కొన్నే అయినా అవన్నీ రెడ్లకే దక్కడం చర్చనీయంగా మారింది. టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ ఉండగా... ఆయన స్థానంలో వైవీ సుబ్బారెడ్డి వస్తున్నారు. సుధాకర్ యాదవ్ బీసీ కాగా వైవీ సుబ్బారెడ్డి రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. అలాగే.. తుడా చైర్మన్ గా ఇప్పటివరకు బిసి వర్గానికి చెందిన నరసింహ యాదవ్ ఉంటే, ఇప్పుడు ఆ పదవి నుంచి ఆయనను తప్పించి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి తుడా చైర్మన్ పదవిని అప్పగించారు. ఇక మంత్రివర్గంలో చోటు దక్కని రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆమె రెడ్డి సామాజికవర్గ నేత కాగా.. ఇంతవరకు ఆ పదవిలో ఉన్నది కృష్ణయ్య అనే బీసీ నేత.
మరో రెడ్డి సామాజికవర్గ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీయే చైర్మన్ పదవి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇలా చూసుకుంటే అందరి దృష్టీ పడే మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం కనిపిస్తున్నా కామ్‌గా కేటాయించే నామినేటెడ్ పదవులు మాత్రం సొంతవారికే ఇస్తున్నారని టాక్. ఆయా మంత్రిత్వ శాఖలతో సంబంధముండే ఈ పదవుల్లో రాజకీయంగా బలంగా ఉన్న రెడ్లకు ఇవ్వడం వల్ల మంత్రి పదవులో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను వీరు డామినేట్ చేసి తమ హవా చెలాయించే ప్రమాదముందన్న వాదనా వినిపిస్తోంది.