బాధ్యతలు గోడమీద రాసుకున్న జగన్

August 03, 2020

ఏడాది ముందే జగన్ నవరత్నాలు ప్రకటించడంపై అప్పట్లో పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తంచేశారు. ఇంత ముందుగా ప్రకటించడం కరెక్టు కాదేమో అన్నారు. అయితే, ముందుగా ప్రకటించడం వల్ల అవి జనాల్లోకి బాగా వెళ్లాయని ఎన్నికల ఫలితాలే చెప్పాయి. ప్రమాణ స్వీకారం అనంతరం ఈరోజు తొలిసారిగా సచివాలయంలోకి అడుగుపెట్టిన జగన్ అక్కడ పూజలు చేయించారు. మంచి ముహూర్తం చూసుకుని సచివాలయంలో అడుగుపెట్టారు. ఇదిలా ఉండగా... ముఖ్యమంత్రి ఆఫీసు గోడలపై ఒక దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
తాను ప్రజలకు హామీ ఇచ్చిన నవరత్నాలను పాదయాత్రలోని కొన్ని మంచి దృశ్యాలతో పెద్ద ఆర్టిస్టిక్ ఫ్రేములుగా మలిచి గోడలపై ఏర్పాటుచేశారు. ఎప్పటికపుడు తన బాధ్యతలు గుర్తుచేసుకోవడానికి ప్రజల రుణం తీర్చుకోవడానికి ఇవి పనికొస్తాయి. అందులో సందేహం లేదు. వాస్తవానికి వీటిని గోడమీద వేస్తేనే గుర్తుంటాయా? అని ప్రశ్నిస్తే దానికి ఏం చెప్పలేం గాని... ప్రతి విషయంలో నేను మంచోడిని అనిపించుకోవడానికి తహతహలాడుతున్న జగన్ ఏ అవకాశం వదలడం లేదు. అందులో భాగంగానే వీటిని ఏర్పాటుచేశారు. వీటితో పాటు పక్కనే వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు చిత్రపటాన్ని ఉంచారు.
జగన్ ప్రతి నిర్ణయాల్లోనూ తాను ప్రజల ప్రశంసలు కోరుకుంటున్నారు. తనపై ఉన్న అవినీతి ముద్రను తొలగించుకోవడ అతని ప్రధాని ఉద్దేశంగా కనిపిస్తోంది. దానికోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా వారికి 27 శాతం మధ్యంతర భృతి కూడా ఇచ్చి సంతోషపెట్టారు. మరోవైపు మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా పూర్తయ్యింది. గవర్నర్ సమక్షంలో 25 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ధర్మాన కృష్ణ ప్రసాద్, చివరగా శంకర నారాయణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్, నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఆంగ్ల భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం కొత్త మంత్రి వర్గంతో గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ సంప్రదాయాన్ని పాటిస్తూ గ్రూప్ ఫొటో దిగారు.