జగన్ మాట నిలబెట్టుకున్నాడు  - చంద్రబాబు 

February 23, 2020

ఏడాదిలోపు దేశమంతా మనవైపు తిరిగి చూసేలా చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి తన మాట నిలబెట్టుకున్నట్లే ఉన్నారు. తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఆయన కూడా అలాగే ఫీలవుతున్నట్లు అర్థమవుతోంది. జగన్ అవినీతి, చేతకానితనం, తెలివితక్కువతనం, అరాచక పాలన దేశం మొత్తం  తెలిసిపోయిందని,  జాతీయ మీడియా నుంచి జాతీయ ప్రముఖుల నుంచి... గ్రామంలో ఉన్న సాధారణ గృహిణి కూడా జగన్ అసమర్థతను చూసి ఆయన్ని ‘తుగ్లక్’ అంటుంటే ఉక్రోషం పట్టలేక భౌతిక దాడులకు జగన్ సర్కారు పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు. 

జగన్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందని ఎన్నికల సమయంలో చెప్పామే అచ్చం అలాగే జరుగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రం- ఒక రాజధాని. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఇదే విధానం అమల్లో ఉంది. తాను ఒక పిచ్చి ఆలోచన చేస్తే దానికి అందరూ మద్దతు తెలుపుతారు అనుకోవడం మూర్ఖత్వం. ఇతర 5 రాష్ట్రాల రాజధానుల కంటే తమ రాజధానిని దూరంగా జరిపిన జగన్ కు హిందూపురంలో పూలమాలలు వేస్తారా? అదేపనిగా... బాలకృష్ణ వాహనం వద్ద స్థానిక ప్రజల ముసుగులో వైసీపీ నాయకులు అడ్డుపడ్డారు. ఎవరిని బెదిరించడానికి ఇవన్నీ... మా హయాంలో రాయలసీమలో ఉపాధి సృష్టించాం. నీళ్లు ఇచ్చాం. ఇపుడు మీరు అభివృద్ధి చేయరు, ఉన్న కంపెనీలను బెదిరిస్తారు... ఇంత అసమర్థ పాలనను దేశం ఎన్నడూ చూడలేదని చంద్రబాబు విమర్శించారు. 

మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రేపుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే పరిశ్రమలను విశాఖ, ఉత్తరాంధ్ర, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు తరలించామని... రాజధానితో పాటు సమాంతరంగా ఏపీని మొత్తం అభివృద్ధి చేశామని... చంద్రబాబు వెల్లడించారు. దుష్ప్రచారాలతో, అబద్ధపు హామీలో ప్రజలను నమ్మించి ఈరోజు పాలన చేతకాక వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.