బాబుపై జగన్ ది కక్షసాధింపే... ఇదే నిలువెత్తు నిదర్శనం

May 28, 2020

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షసాధింపు ధోరణితోనే సాగుతున్నారని చెప్పడానికి ఇప్పుడు నిలువెత్తు నిదర్శనం దొరికేసింది. బాబుపై తాను సాగిస్తున్న కక్షసాధింపు వైఖరిని వేరెవరో బయటపెట్టాల్సిన పని లేకుండా స్వయంగా జగనే దానిని బయటపెట్టేసుకున్నారు. అదే బాబు హయాంలో రాష్ట్రప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై దర్యాప్తు చేపట్టాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేస్తూ శుక్రవారం రాత్రి పొద్దుపోయాక జగన్ సర్కారు జీవో ఆర్టీ నెంబరు 344ను విడుదల చేసింది. ఈ జీవో చూస్తే జగన్ కక్షసాధింపు ఏ రేంజిలో ఉందో ఇట్టే తెలిసిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

చంద్రబాబురనాయుడే టార్గెట్ గానే ఈ సిట్ ను ఏర్పాటు చేశారని కూడా చెప్పక తప్పదు. ఇంటెలిజెన్స్ లో డీఐజీగా పని చేస్తున్న ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఈ సిట్ లో రఘురామ్ రెడ్డి సహా మొత్తం పది మంది పోలీసు అధికారులను నియమిస్తూ జగన్ సర్కారు సంచలనాలకే సంచలనంగా నిలుస్తున్న నిర్ణయం తీసుకుంది. ఈ సిట్ లో రఘురామ్ రెడ్డితో పాటుగా ఎవరెవరు ఉన్నారంటే...  అట్టాడ బాబూజీ (విశాఖ ఎస్పీ), సీహెచ్ వెంకటఅప్పలనాయుడు (ఇంటెలిజెన్స్ ఎస్పీ), శ్రీనివాస రెడ్డి (కడప అదనపు ఎస్పీ), జయరామరాజు (ఇంటెలిజెన్స్ డీఎస్పీ), విజయ భాస్కర్ (విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీ), గిరిధర్ (ఇంటెలిజెన్స్ డీఎస్పీ), కెన్నడీ (ఏలూరు రేంజి ఇన్ స్పెక్టర్), శ్రీనివాసన్ (నెల్లూరు జిల్లా ఇన్ స్పెక్టర్), రాజశేఖరరెడ్డి (గుంటూరు జిల్లా ఇన్ స్పెక్టర్)లు సిట్ లో పనిచేయనున్నారు. వీరిలో బాబూజీ, వెంకటఅప్పలనాయుడులు ఐపీఎస్ అధికారులు కాగా...మిగిలిన రాష్ట్ర సర్వీసులకు చెందిన వారే. 

ఇక ఈ సిట్ కు కట్టబెట్టిన అధికారాలు, దర్యాప్తు పరిధి చూస్తే షాక్ తినక తప్పదు. ఎందుకంటే... ఓ ఐపీఎస్ ర్యాంకు అధికారి నేతృత్వంలో వెలసిన ఈ సిట్... రాష్ట్రంలో ఎవరినైనా పిలిచి విచారించే అధికారం ఉందట. అంతేనా... ప్రభుత్వంలోని ఏ శాఖ నుంచి అయినా, ఏ విషయాన్ని అయినా పరిశీలించేందుకు, ఫైళ్లను తనిఖీ చేసేందుకు, అవసరమనుకుంటే సదరు ఫైళ్లను తమ వెంట తీసుకెళ్లేందుకు కూడా ఈ సిట్ కు అధికారం  ఉందట. అంటే... రాష్ట్ర పోలీసు శాఖ చీఫ్ గా ఉన్న డీజీపీ కార్యాలయానికి చెందిన ఫైళ్లను గానీ, రాష్ట్ర పాలనకే చీఫ్ గా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి చెందిన ఫైళ్లను కూడా ఈ సిట్ పరిశీలించే అవకాశముందట. ఈ సిట్ అడిగిన వెంటనే ఎంతటి కీలక సమాచారాన్ని అయినా అందజేయాల్సిందేనని సదరు ఉత్తర్వుల్లో జగన్ సర్కారు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేనా... ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఉన్న ఈ సిట్... డీజీపీ స్థాయి, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులను కూడా విచారించేస్తుందన్న మాట.

మొత్తంగా చూస్తే... ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క అవినీతి మరక లేని చంద్రబాబుకు ఏదో ఒక కారణంతో మకిలి అంటించడం, అవసరమైతే విచారణ పేరిట పోలీస్ స్టేషన్ కు పిలవడం, ఇంకా అవసరమైతే కేసు నమోదు చేయడం, చివరకు అరెస్ట్ చేసే అధికారం కూడా ఈ సిట్ కు ఉందన్న మాట. ఏతావతా చంద్రబాబును బుక్ చేయడానికే జగన్ సర్కారు ఈ సిట్ ను రంగంలొోకి దించిందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సిట్ లో పది మంది పోలీసు అధికారులు ఉంటే... వారిలో సిట్ చీఫ్ తో పాటు మరో ఇద్దరు అధికారులను తన సామాజిక వర్గానికి చెందిన వారినే జగన్ నియమించిన నేపథ్యంలో,... చంద్రబాబును టార్గెట్ చేసుకుని పనిచేసేందుకే ఈ సిట్ ను ఏర్పాటు చేశారన్న వాదనలకు బలం చేకూరుతోంది.