AP : ఇలాంటి ఆలోచన్ విధానం జగన్ ఫ్యాన్స్ కే సొంతం

August 13, 2020

మనిషి ముఖ్యమంత్రి అయిపోగానే కొత్త శక్తులేమీ రావు. అతనిలో సహజ లక్షణాలు అలాగే ఉంటాయి. అయితే, అనుకున్నది చేయడానికి అవసరమైన వనరులు, వ్యవస్థ ఉంటుంది. అందరూ స్వచ్ఛంగా ఏం ఉండరు. మనకు మంచి ఉద్దేశాలుంటే, సంకల్పం ఉంటే... మంచి వారిని ఏరుకుంటారు. లేదు పగలు ప్రతీకారాలు, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగితే... పరిస్థితి ఏపీలా ఉంటుంది. పొగిడే వాడి కంటే విమర్శించేవాడి వల్ల మనం మెరుగవుతాం అన్న విషయాన్ని అటు మోడీ, ఇటు కేసీఆర్, జగన్ లు ఇద్దరూ మరిచిపోతున్నారు. జై అన్న వాడిని పక్కన పెట్టుకోవడం, నిజాలు చెప్పిన వాడి మీద పగబట్టడం.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వాటిలో కోర్టు అన్నిటినీ తప్పు పట్టలేదు. కొన్నిటినే తప్పు పట్టింది. వరుసగా కొన్ని వ్యతిరేక తీర్పులు ఇచ్చేసరికి తాను చేసిన ప్రతి పనినీ కోర్టు తప్పు పట్టిందని ఏకంగా కోర్టునే తప్పు పడున్నారు వైసీపీ నేతలు. అనుచరులు అయితే ఏకంగా కోర్టును, న్యాయమూర్తులను బూతులు తిడుతున్నారు. తప్పు చేయడం మానవ సహజం. లోపాలు ఎవరైనా చెబితే సరిదిద్దుకోవాలి. లేదంటే కనీసం తదనంతరం అయినా లోపరహితంగా విధానాలు తయారుచేసుకోవాలి.

పార్టీ రంగులు వేయొద్దు అని కోర్టు చెప్పింది - నిజమే కదా ప్రభుత్వ డబ్బుతో, ప్రభుత్వ ఆఫీసులకు పార్టీ రంగులు వేయడం తప్పు కాదా?

డాక్టరు సుధాకర్ కేసు సీబీఐకి ఇచ్చింది - గవర్నమెంటు తప్పు లేకపోతే హైకోర్టు సీబీఐకి ఇస్తే ఏంటి? సీఐఏకి ఇస్తే ఏంటి? 

ఇంగ్లిష్ మీడియం జీవో రద్దు - కోర్టు తెలుగు మీడియం ఉండాల్సిందే అని చెప్పింది. ఆ జీవోలో అది లేదు కాబట్టి తెలుగు కూడా పెట్టమన్నారు. ఇందులో తప్పేముంది? దేశంలో 29 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాలు వారి మాతృభాషలోనే స్కూళ్లు నడుపుతున్నాయి.

ఎల్జీ పాలిమర్స్ సీజ్ - మనుషుల్ని చంపిన కంపెనీని మూసేయకుండా ముద్దు పెట్టుకోవాలా?

ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టుంగ్ ఇమ్మంది - ఐఏఎస్ అధికారి తప్పు నిరూపణ కాకుండా జీతం లేకుండా పక్కన పెట్టి కేసులు పెట్టారు. మరి సీబీఐ కేసుల్లో ఉంటూ ముఖ్యమంత్రి హోదాలో ఎలా ఉన్నారు మీరు పక్కునుండాలి కదా?

తప్పులు పాలకులు చేసి కోర్టులు మమ్మల్ని ఏమీ అనకూడదు అంటే ఎలా అవుతుంది? కుదరదు కదా. తప్పులు అందరూ చేస్తారు. దానిని సరిదిద్దుకోవడం ఉత్తమ లక్షణం. తనంతట తాను సరిచేసుకునే అవకాశం లేనప్పుడు ఇంకొకరు ఆ పనిచేస్తే ఆత్మపరిశీలన చేసుకుని దిద్దుకోవాలి. అది పాలకుల లక్షణం. పాలకులకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం కోర్టులకు కొత్త కాదు. గతంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను తప్పు పడుతూ ఎన్నో తీర్పులొచ్చాయి.

ఇలా జరిగినపుడు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు అపీలుకు వెళ్లేవి. అక్కడ కేసు తీవ్రత, సమర్పించిన ఆధారాలు, వాదనల ఆధారంగా ఒక్కోసారి అనుకూలంగా, మరొకసారి వ్యతిరేకంగా తీర్పులు వచ్చేవి. అంతెందుకు కేసీఆర్ కు తొలి ఏడాదిలో హైకోర్టు ఎన్నో మొట్టికాయలు వేసింది. తర్వాత కేసీఆర్ తన లోపాలు సరిదిద్దుకున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా పాలసీలను రూపొందించాడు. దీంతో అన్నీ సర్దుకున్నాయి. 

జగన్ బృందం మాత్రం హైకోర్టులో తమ పాలసీలకు ఎందుకు ఎదురు దెబ్బ తగిలిందో సమీక్షించుకోండా మా తీర్పులనే తప్పు పడతారా అన్నట్లు అక్కసు పెంచుకుంది. హైకోర్టును టార్గెట్ చేయమని అంతర్గతంగా పార్టీలో సందేశాలు పంపింది. అందుకే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పార్టీ శ్రేణులు కోర్టులను తిట్టడం మొదలుపెట్టాయి. ఇది అరాచకమైన ఆలోచన విధానం. ఏమాత్రం సహించదగినది కాదు. ఇలాంటిది న్యాయవ్యవస్థల విధ్వంసానికి దారితీస్తే సమాజం భవిష్యత్తులో తీవ్రంగా నస్టపోతుంది. 

వ్యతిరేక తీర్పులను ఓర్వలేక అక్కసుతో, తీర్పులిచ్చిన న్యాయాధికారులపై అనుచరులు, భజన బృందాలతో  బురద చల్లించే దిక్కుమాలిన ఆలోచన వైసీపీ పార్టీ మానుకోవాలి. ఇలాంటి దాఖలాలు స్వతంత్ర భారతావనిలో ఏ రాష్ట్రంలోను కనిపించలేదు. ఇలాంటి వాళ్లు చరిత్ర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

హైకోర్టులు ఇచ్చిన వ్యతిరేక తీర్పులనే అవమానంగా భావించి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రులెందరో పదవులకు రాజీనామా చేశారు. కానీ ఇక్కడ తప్పు చేసిన వారు సిగ్గుపడకపోగా కోప్పడుతున్నారు. ఇది ఏమి కర్మో !!