మిగిల్చింది గోరంత.. మింగింది కొండంత

July 01, 2020

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గద్దెనెక్కగానే చెప్పిన మాట దుబారా తగ్గించడం.. తాను చంద్రబాబులా హిమాలయ వాటర్ తాగనని, కిన్లే వాటర్ తాగుతూ రాష్ట్ర ఖజానాకు తన వంతుగా రోజుకు కనీసం రూ.100 మిగుల్చుతానని చెప్పారు. జీతం కూడా తనకు నెలకు రూపాయి చాలన్నారు. అయితే.. జగన్ చెప్పిన ఈ దుబారా నియంత్రణ.. ఖజానాపై భారం తగ్గించడం మాటలకే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. వాటర్ బాటిళ్లు ఖరీదైనవి వాడకుండా.. జీతం తీసుకోకుండా మిగిలించిన డబ్బు కంటే ఇతర సొంత ఖర్చులకు ఆయన ఖజానా నుంచి వాడుకున్నది చాలా రెట్లు ఎక్కువని చెబుతున్నారు. ముఖ్యంగా తన వ్యక్తిగత పర్యటనలు, తన ఇంటి పనులు, లెక్కకు మించి నియమించుకున్న సలహాదారుల కోసం జగన్ విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
జగన్ అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే తాడేపల్లి ఇంటితోపాటు తెలంగాణలోని లోటస్ పాండ్ కోసం కోట్లు విడుదల చేస్తూ జీవోలిచ్చారు. మొక్కు తీర్చుకునేందుకు జెరూసలెం కుటుంబంతో వెళ్తూ తన సొంత ఖర్చుతో వెళ్తున్నానని ఆడంబరంగా ప్రకటించుకుని, సెక్యూరిటీ ఖర్చుల పేరుతో 25 లక్షల మేరకు విడుదల చేయించుకున్నారు. కుమార్తెను చూసేందుకు లండన్ తన వ్యక్తిగత ఖర్చులపై వెళ్తున్నానని చెప్పినా సెక్యూరిటీ కోసం 90 లక్షలు ఖర్చయింది.
ఇక ఆరునెలల్లో ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న జీతం నెలకు రూపాయి చొప్పున ఆరు రూపాయలు మాత్రమే అయినా, సలహాదారుల పేరుతో ఆరు నెలల్లో 60 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి 20 మంది సలహాదారులున్నారు. తాను నెలకు రూపాయి జీతమే తీుకుంటున్నా సలహాదారుల పేరుతో తన వెంట ఉన్నవారికి మాత్రం భారీగా ఖర్చు చేస్తున్నారు.
చంద్రబాబు హయాంలో ఆరుగురు సలహాదారులు మాత్రమే ఉన్నారు. వీరిలో నలుగురికి కేబినెట్‌ ర్యాంకు ఉండేది. ఈ సలహాదారుల్లోనూ చివరిదాకా ఉన్న వారు ఇద్దరు మాత్రమే. ఆరునెలల్లో 20 మంది  సలహాదారుల్ని పెట్టుకున్న జగన్ ఖజానాకి 60 కోట్లు మేరకు ఖాళీ చేశారు.  ఈ లెక్కన జగన్ సీఎం పదవీకాలం ముగిసేసరికి ఒక్క సలహాదారులు వారి పరివారానికి 600 కోట్లు చెల్లిస్తారన్నమాట. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసి..ఆ తరువాత పదవీవిరమణ చేసిన అజయ్ కల్లం రెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా పనిచేసిన సజ్జల రామక్రిష్ణారెడ్డి, జర్నలిస్టు యూనియన్ నేత దేవులపల్లి అమర్, సాక్షి ఈడీగా చేసిన రామచంద్రమూర్తి, తుమ్మల లోకేశ్వరరెడ్డి, సాగి దుర్గాప్రసాదరాజు,  వీఎన్ భరత్ రెడ్డి, కె రాజశేఖర్ రెడ్డి, జె విద్యాసాగర్ రెడ్డి, దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిలతోపాటు ఇంకా చాలా మంది సలహాదారులు, కన్సల్టెంట్లు ఉన్నారు. వీరిలో కొందరికి అన్ని కలిపి నెలకు రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుండగా మరికొందరి నెలకు రూ. 2 కోట్ల వరకు ఖర్చవుతోందట. 

Read Also

లండన్‌లో ఘ‌నంగా "కేసీఆర్ - దీక్షా దివస్"
బాబు పదవిచ్చి ఆదరిస్తే... ఈ నేత చేసిందేమిటి?
శ్రీల‌క్ష్మి కోసం సాయిరెడ్డి ప్ర‌ద‌క్షిణ‌లు... రీజ‌న్ ఇదే...!