రాజధానిని మారిస్తే.. జగన్ బాక్స్ బద్దలే. How ?

February 17, 2020

ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించే దిశగా దూకుడుగానే సాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాక్ప్ బద్దలైపోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగానే ఉన్నాయన్న వాదనలు అంతకంతకూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం ఏకంగా 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల ఆవేదనను పట్టించుకోకుండా అమరావతి పీక పిసికేందుకు సిద్దమైపోయిన జగన్ పీకను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పిసికేసే ప్రమాదం పొంచి ఉందన్న వాదనలు కొత్తగా తెర మీదకు వచ్చాయి. ఏపీ రాజధాని వికేంద్రీకరణపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సైలెంట్ గా ఉన్న విషయాన్ని తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్న జగన్... అదే మోదీ సర్కారు చేతిలో పెద్ద దెబ్బ తినడం కూడా ఖాయమన్న వాదన ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఈ దిశగా వినిపిస్తున్న వాదనలోని కథాకమామీషు ఏమిటన్న విషయానికి వస్తే... అమరావతిలో రాజధాని వస్తే... రాజధానికి తగ్గ విమానాశ్రయం కూడా దానికి సమీపంలోనే ఏర్పాటు కావాలి కదా. ఈ క్రమంలో విజయవాడకు కూతవేటు దూరంలో గన్నవరంలో చిన్నగా ఉన్న ఎయిర్ పోర్టును భారీగా విస్తరించారు. ఇందుకోసం అవసరమైన భూములను కూడా కేంద్రంలోని పౌర విమానయాన శాఖకు ఏపీ ప్రభుత్వం సేకరించి ఇచ్చింది. ఈ భూములు గన్నవరం పరిధిలోని రైతులవేనట. ఈ భూములను ఎయిర్ పోర్టుకు ఇచ్చిన రైతులకు రాజదాని అమరావతిలో ప్లాట్లను కేటాయించాల్సి ఉందట. ఈ ప్రాతిపదికననే ఏపీ ప్రభుత్వం ఎయిర్ పోర్టు విస్తరణకు రైతుల భూములను సేకరించిందట. 

ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి పీక పిసికేస్తే... రాజధాని రైతుల మాట అటుంచితే... ఇప్పటికే ఎయిర్ పోర్టు విస్తరణకు ఇచ్చిన భూములను పౌర విమానయాన శాఖ వినియోగించేసింది. ఎయిర్ పోర్టును విస్తరించేసింది కూడా. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు భూములను తిరిగిచ్చినా పెద్ద సమస్య కాబోదని, ఎయిర్ పోర్టు విస్తరణకు భూములిచ్చిన రైతులకు మాత్రం అమరావతి పరిధిలో ప్లాట్లను ఇవ్వక తప్పదు కదా. ఎందుకంటే ఇప్పటికే ఆ భూములను కేంద్రం వినియోగించేసింది కదా. మరి అమరావతిలో రాజధానే లేకుంటే ఎయిర్ పోర్టుకు భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేది ఎక్కడ? వేరే ఎక్కడైనా ప్లాట్లు కేటాయిస్తే ఎయిర్ పోర్టు భూముల రైతులు ససేమిరా ఒప్పుకోరు. మరి వారంతా తమకు న్యాయం చేయాలని ఎవరిని అడుగుతారు? ఇంకెవరిని తమ భూములను వినియోగించేసిన కేంద్రాన్నే కదా. అప్పుడు కేంద్రం ఎవరిని ప్రశ్నిస్తుంది? ఇంకెవరిని ఏపీ సీఎం సీట్లో కూర్చోవడంతో పాటుగా అమరావతి పీక పిసికేసిన జగన్ నే కదా. అంటే రాజదాని అమరావతి నుంచి తరలిపోతే... జగన్ వర్సెస్ మోదీనేనన్న మాట. అంటే... మోదీ చేతిలో జగన్ కు బ్యాండ్ బాజానేనన్న మాట.