జగన్ సర్కారుకు చెమటలు పట్టాయి !!

August 04, 2020

డాక్టర్ సుధాకర్ వ్యవహారం మొదలు... జగన్ హయాంలో ఎందుకో గాని ఏపీలో దళితులపై వేధింపులు పెరిగాయా అన్నట్లు... పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వరుసగా జరగడం ఉద్దేశపూర్వకమా? కోఇన్సిడెన్నా అన్నది వేరే చర్చ గాని... కొన్ని ఘటనలు అత్యంత విస్మయానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల గోదావరి జిల్లాల్లో వరుసగా జరిగిన రెండు ఘటనలు జగన్ సర్కారుకు చెమటలు పట్టించాయి.

కొద్ది రోజుల క్రితం ఒక బాలికను 4 రోజులు మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేశారని, ఆమెను పోలీసుస్టేషను వద్దే వదిలి పోలీసులకే నిందితులు సవాలు చేశారని వార్తలు వచ్చాయి. దీనిపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ తీవ్రంగా స్పందించారు. దిశ చట్టం ఏమైంది? ఇంత అమానుషమా? దళితులపై ఇన్ని అరాచకాలా అంటూ తీవ్రంగా స్పందించారు. ఆ ఘటన గోదావరి జిల్లాల్లో కలకలం రేపింది. 

తాజాగా మరో ఘోరం జరిగింది. దీంతో దళితనేతలు జగన్ సర్కారు చపలత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. విచారకరం ఏంటంటే... ఈసారి పోలీసుస్టేషనులోనే ఘోరం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెదుళ్లపల్లికి చెందిన వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడికి పోలీసు స్టేషనుకు తీసుకెళ్లి హింసించారట. అంతేకాదు, స్టేషనులోనే గుండు కొట్టించారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనుచరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇలా వ్యవరించారట. వైసీపీ నేతలు,  పోలీసుల అత్యుత్సాహం ఇపుడు అధికార పార్టీ భారీ డ్యామేజ్ చేసింది. శోచనీయం ఏంటంటే... ఇసుక లారీల్ని అడ్డుకున్నందుకే తనపై దాడి చేసినట్లుగా బాధితుడు ఆరోపించారు.  మునికూడలి వద్ద వైసీపీ నేత కవల క్రిష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టాడని వరప్రసాద్ ఆరోపిస్తున్నాడు.

హర్షకుమార్ ఎంట్రీ :

ఈ దుర్ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శిరోముండనం, అది కూడా పోలీసుస్టేషనులో చేయడం అంటే అరాచక పాలనకు పరాకాష్ట అంటూ వారు తీవ్రంగా మండిపడ్డారు. ఇక మాజీ ఎంపీ హర్షకుమార్ దీనిపై ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే ఈ ఘోరం జరిగిందని ఆయన ఆరోపించారు. ఎస్సై నుంచి ఎస్పీ వరకు ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని, చర్యలు తీసుకోవాలన్నారు. 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే దళితుల ప్రతాపం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రముఖుల స్పందన :

పవన్ కళ్యాణ్ - శిరోముండన ఘటనలో బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు. ప్రేరేపించిన వారిని శిక్షించాి.

అనిత వంగలపూడి - దళిత బిడ్డకు శిరోముండనం చేయిస్తారా? దీని వెనకున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. పోలీసుల్ని కఠినంగా శిక్షించాలి.

నారా లోకేష్ - దళితుల‌పై జగన్ దమనకాండ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో అధికార పార్టీ నాయ‌కుడి ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు ద‌ళిత యువకుడు వరప్రసాద్‌ని చిత్రహింసలకు గురిచేసి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చెయ్యడం ఘోరం.​ అధికార‌పార్టీ నేత‌ల అడుగుల‌కు మ‌డుగులొత్తుతూ ఇసుక మాఫియాని నిల‌దీసిన ద‌ళిత‌యువ‌కుడిపై పోలీసులే గూండాల్లా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.  

రఘురామ కృష్ణంరాజు : దళిత యువకుడికి శిరోముండనం అమానుషం. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ద‌ళిత యువకుడు వరప్రసాద్‌ని చిత్రహింసలకు గురిచేసి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చెయ్యడం ఘోరం. తీవ్రంగా ఖండిస్తున్నాను. 

రాష్ట్రం అట్టుడికి పోవడంతో ముఖ్యమంత్రి జగన్ దిగొచ్చారు. చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ఎస్సైని, కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతం ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి వ్యవహారశైలిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. నిన్ననే కోర్టు పోలీసుల తీరుపై తీవ్రంగా చీవాట్లు పెట్టింది. అయినా పోలీసుల తీరు మారలేదు.