జగన్ పేషీ... అంతా ముసలొళ్లే !

May 26, 2020

కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లుగా... ఏపీకి కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్న మాట ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. అది కూడా అదికారుల సర్కిళ్లలో ఈ మాట మరింత గట్టిగా వినిపిస్తోంది. అధికారం కోసం ఏకంగా పదేళ్ల పాటు వెయిట్ చేసిన జగన్... తనకు అధికారం దక్కినంతనే ఏమేం చేయాలన్న విషయాలపై ముందుగానే కసరత్తు చేసినట్లుగా కనిపిస్తోంది. అయితే జగన్ కు అధికారం దక్కేందుకు చాలా సమయమే పట్టింది కదా. మరి అప్పుడు కాదు ఇప్పుడు సీఎం అవుతానంటూ ప్రణాళికలు రచించుకున్న జగన్.... చాలా ఆలస్యంగా సీఎం కుర్చీలో కూర్చున్నా... అప్పుడెప్పుడో వైసీపీ ప్రారంభం నాడే రచించుకున్న ప్రణాళికలను అమలు చేస్తున్నారు.

తాను అధికారంలోకి వస్తే... ఎవరెవరికి పదవులు కట్టబెట్టాలన్న విషయంపై జగన్ గతంలోనే ఓ నిర్ణయం తీసుకోగా... జగన్ ఎంపిక చేసిన అధికారులంతా ఆయన సీఎం అయ్యే నాటికి రిటైర్ అయిపోయారు. అయితేనేం... రిటైరైన వారిని తీసుకోకూడదా? అన్న కోణంలో మొండిగా వెళుతున్న జగన్... పదవీ విరమణ చేసిన వారికే తన కార్యాలయంలో నియమించుకుంటున్నారు. ఫలితంగా ఇప్పుడు ఏపీ సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం) ముసలోళ్లతో నిండిపోయింది. ప్రస్తుతం జగన్ కార్యాలయంలో ఐదుగురు కీలక అధికారులు ఉన్నారు. వీరిలో ఇద్దరంటే ఇద్దరు మాత్రమే సర్వీసులో ఉన్న అధికారులు. మిగిలిన ముగ్గురు అధికారులు రిటైరైన ఐఏఎస్ అధికారులే.

సర్వీసు ఉన్న అధికారుల్లో జగన్ ఏరికోరి నియమించుకున్న తన సామాజిక వర్గానికి చెందిన ధనుంజయ రెడ్డి కాగా... మరొకరు సాల్మన్ ఆరోఖ్యరాజ్. ఇక రిటైరై జగన్ వద్ద నియమితులైన ఐఏఎస్ లు ఎవరన్న విషయానికి వస్తే... జగన్ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అజేయ కల్లం ఒకరు కాగా... మొన్ననే పదవీ విమరణ చేసిన పీవీ రమేశ్ మరొకరు. ఇక తాజాగా మరో రిటైర్ అయిన జె. మురళి అనే అధికారిని జగన్ తన కార్యాలయంలో నియమించుకున్నారు. మొత్తంగా ఇప్పుడు జగన్ పేషీలో ఐదుగురు కీలక అధికారులు ఉంటే... వారిలో ముగ్గురు రిటైరైన ముసలొళ్లేనన్న మాట. మరి ఈ ముసలాళ్లతో జగన్ ఎలా నెట్టుకొస్తారో చూడాలి.