అసెంబ్లీలో ఏపీ ప్రజలకు అవమానం - కేసీఆర్ దయతో బతకాలట

July 04, 2020

ఏపీ సీఎం జగన్ పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్ భజనలో తరిస్తున్నారు. ఆయనతో అడుగులో అడుగు వేస్తూ ఆంద్ర, తెలంగాణ అంతా కలియదిరుగుతున్నారు. స్వామీజీల దర్శనం.. ప్రాజెక్టుల సందర్శనం.. ఒకటేమిటి ఇద్దరు సీఎంలూ చెట్టపట్టాలేసుకుంటున్నారు. అది కాస్తా ఇప్పుడు ఏపీ అసెంబ్లీ వరకు పాకింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనూ సీఎం జగన్ తెలంగాణ ముఖ్యమంత్రిని పొగడడానికే ప్రాధాన్యం ఇస్తూ విలువైన సభా సమయాన్ని వృథా చేస్తున్నారు. దిగువ రాష్ట్రంగా గోదావరి, కృష్ణా జలాల వాటాల విషయంలో మోసపోకుండా, అన్యాయానికి గురికాకుండా జాగ్రత్తపడాలన్న విపక్ష నేతల సూచనలపై అంతెత్తున లేస్తూ ఎగువ రాష్ట్రాలవారు ఏం చేసినా మనమేమీ చేయలేమంటూ చేతులెత్తేయడంతోపాటు.. న్యాయవ్యవస్తపైనా నమ్మకం లేదన్న రీతిలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు జగన్. ఎగువ రాష్ట్రాలు నీటిని తరలించుకుపోయాయని కోర్టుల్లో కేసులు వేయడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని.. ఏళ్ల తరబడి ఆ కేసులు కొనసాగడమే తప్ప ఫలితం ఉండదంటూ జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పడం రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురిచేసింది. నీటి విషయంలో పొరుగు రాష్ట్రాల వలలో పడొద్దంటూ విపక్షం చేసిన సూచనపై స్పందించన జగన్ లైట్ తీస్కో అన్నట్లుగా మాట్లాడడం ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. కేసీఆర్‌పై ఈగ వాలనివ్వను అన్నట్లుగా ఆయనపై విమర్శలేంటి అంటూ జగన్ విపక్షాలను గదమాయించడం కూడా విమర్శలకు దారితీస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గురువారం ప్రాజెక్ట్‌లపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టారంటూ ఎదురుదాడి చేశారు. రాజకీయంగా దూకుడుగా మాట్లాడి ప్రతిపక్షం నోరు మూయించడం సాధారణమే అయినా ఆ క్రమంలో ఆయన పొరుగు రాష్ట్ర సీఎంను ఆంధ్రప్రదేశ్‌ను ఉద్ధరించడానికి వచ్చిన మహాపురుషుడిలా కీర్తించడం చర్చనీయమవుతోంది. హక్కులను సాధించుకోవడంపై గట్టిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి జగన్ అందుకు భిన్నంగా మంచిగా ఉంటూ పనులు సాధించుకోవాలని మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లాలని ప్రతిపక్షం అడుగుతోంది. పొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలనే వెళ్లాను. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన విన్నపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ గౌరవించారు. ఆయన ఓ అడుగు ముందుకేసి తన రాష్ట్రం నుంచి నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. తెలంగాణ నుంచి గోదావరి నీటిని తీసుకుంటున్నాం. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, కృష్ణా ఆయకట్టుకు నీటిని తరలించే ప్రయత్నం జరుగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించండి. కేసీఆర్‌ను అభినందించడం మానేసి విమర్శిస్తారా?’’ అంటూ విపక్ష నేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యంగా ఉండడం మంచిదే కానీ అందుకోసం స్వరాష్ట్ర ప్రయోజనాలను మంటగలపరాదని జలరంగ నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ సీఎం ముందుకొచ్చి ఏపీకి నీరివ్వడమేంటి? ఏపీకి గోదావరి నీటిలో వాటా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
‘ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు. అక్కడ కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా?. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం కట్టారు. ఆయన అధికారంలో ఉండగానే ఆల్మట్టీ డ్యామ్‌ ఎత్తు పెంచడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంతో స్నేహభావంతో మెలగడం తప్పా?. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి. సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు చక్రం తిప్పుతున్న రోజుల్లోనే ఆల్మట్టీ డ్యామ్‌ ఎత్తు పెంచారు. గత పదేళ్లలో కృష్ణా జలాల లభ్యత దారుణంగా పడిపోయింది.’ అని జగన్ అన్నారు.
జగన్ వ్యాఖ్యలు వినడానికి బాగానే ఉన్నా ఎన్నో ప్రశ్నలకు అవకాశమిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కాళేశ్వరం కట్టొచ్చు.. మరి, దాని వల్ల ఏపీకి నష్టం జరుగుతుందని అనుకుంటే దాన్ని వ్యతిరేకించడమో, కోర్టుకు వెళ్లడమో, పోరాడడమో.. తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమో చేయాలి. కానీ.. జగన్ కేసీఆర్‌తో పాటు వెళ్లి కాళేశ్వరం ప్రారంభించి వచ్చారు. అంటే ఆ ప్రాజెక్టును జగన్ ఎండార్స్ చేసినట్లే కదా. చంద్రబాబు ప్రబుత్వంలో కట్టిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమని తేల్చిన జగన్ ఆగమేఘాల మీద దాన్ని కూల్చివేశారు. చంద్రబాబు హయాంలో కట్టింది కదా మనకెందుకు అని వదిలేయలేదు.. కానీ, కాళేశ్వరం విషయంలో చంద్రబాబు హయాంలో కట్టింది కదా అన్న వాదనను జగన్ వినిపిచండం ఆయన అపరిణతికి నిదర్శనంగా కనిపిస్తోంది.
పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కేసులు వేసింది. ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేసింది. అలాంటి కేసీఆర్‌ను ఇప్పుడు జగన్ వెనకేసుకురావడం ఆంధ్రప్రజలను బాధిస్తోందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య జరిగిన జల వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటినిప్పుడు జగన్ పరిష్కరించాల్సింది పోయి కేసీఆర్ చెప్పిన ప్రతిదానికీ తలూపుతూ ఆయనకు భజన చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అత్తసొమ్ము అల్లుడు దానం అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ధనంతో నిర్మించిన భవనాలను జగన్ మంత్రివర్గ నిర్ణయం కానీ, శాసనసభా నిర్ణయం కానీ లేకుండా తెలంగాణ ప్రభత్వానికి అప్పగించారు. కానీ, తెలంగాణ నుంచి ఇప్పటివరకు ఏపీకి అలాంటి న్యాయబద్ధమైన ప్రయోజనమేమైనా దక్కిందా అంటే పెదవి విరవాల్సిందే. సాంస్కృతికంగా చూసుకుంటే బుద్ధుడి చితాభస్మం తప్ప ఏపీకి తెలంగాణ ఏమీ ఇవ్వలేదు. కానీ.. జగన్ మాత్రం శాసనసభ ఏపీ ప్రజల జల ప్రయోజనాలు తనకేమీ ప్రాధాన్యం కాదన్నట్లుగా తేలిగ్గా మాట్లాడారు.
పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సఖ్యత మంచిదే కానీ ఆ సఖ్యత సొంత రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించకుండా చూసుకోవడం చాలా అవసరమని జగన్ గుర్తించాలన్నది విశ్లేషకుల మాట.