రాజకీయ చరిత్రలోనే జగన్ ది బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ !

February 23, 2020

​రాజకీయ పార్టీలు అపుడపుడు కొన్ని పొరపాట్లు చేసి ఓడిపోవడం సహజమే. దాదాపు అన్ని పార్టీలు ఇలాంటి తప్పులు ఎపుడో ఒకసారి చేస్తుంటాయి. అయితే... తాజాగా జగన్ కూడా సరిదిద్దుకోలేని పొరపాటు చేశాడని పలువురు విశ్లేషిస్తున్నారు. నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ఉపసంహరించుకోవడం ఇటీవలే సహజమే అయినా.. అన్నింట్లో అలా కుదరదు. అలా కుదరని ఓ నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. అంతే... ముందుకు వెళ్లినా నష్టమే, ఆలోచన విరమించుకున్నా నష్టమే అన్న సంకట స్థితిలో ఉన్నారు జగన్. 

ఎన్నికల ముందు ఇతర కులాలను రెచ్చగొట్టి వ్యూహాత్మకంగా తెలుగుదేశంపై కుల ముద్ర వేయడంలో సక్సెస్ అయిన జగన్ రెండోసారి కూడా అదే సూత్రం వాడారు. గెలుపు అనంతరం జగన్ కుల వ్యూహాలతోనే గెలిచిన విషయం అందరికీ అర్థమైపోయింది. ఇంతవరకు కులరాజకీయాలను ఇంత సమర్థంగా ఎవరూ చేయలేదు. రెండు మతాలు ఒకరే ఉపయోగించుకోవడం కూడా జగన్ కే సాధ్యమైంది. ఇందులో సూపర్ సక్సెస్ అయ్యాను కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసి రాజధాని తరలించి టీడీపీని ట్రాప్ చేయగలను అనుకున్న జగన్ వ్యూహం విపలమైంది. దీనికి కారణం... ఎన్నికల్లో వాడిన పాత కుల ఐడియానే అమరావతి మార్పు విషయంలోనూ జగన్ వాడే ప్రయత్నం చేశారు. అది బెడిసి కొట్టింది. దీంతో రాజధాని ప్రకటన మొదట్లో పదేపదే కులం ప్రస్తావించిన వైసీపీ నాయకులు ఇపుడు వేరే వాదనలు వినిపిస్తున్నారు. వారు ఊహించిన దాని కంటే పెద్ద తిరుగుబాటు అమరావతి గురించి ప్రజల్లో రావడంతో పరిస్థితి జగన్ చేయిదాటిపోయింది. 

పైగా జనం స్పందన తర్వాత బీజేపీ కూడా ఈ విషయంలో జగన్ కి మద్దతు పలకడం మానేసింది. పైగా జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుని వైసీపీతో రహస్య పొత్తుకు గుడ్ బై చెప్పింది. వైసీపీకి బీజేపీతో చెడడానికి ఈ రాజధాని నిర్ణయం కూడా ఒక ప్రధాన కారణంగా తెలుస్తోంది.  అంటే రాజధాని మార్పు అనే నిర్ణయం వల్ల అటు బీజేపీతో సంబంధాలు తెగిపోవడం, జనసేన బలపడటం, చంద్రబాబుకు మళ్లీ విమర్శనాస్త్రాలు అందించడం, రెండు జిల్లాల్లో వ్యతిరేకత సంపాదించుకోవడం ఇలా ఎటుచూసినా వైసీపీకి బ్యాడయ్యింది.

ఇదిలా ఉండగా ఈ నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నిమ్మలకిష్టప్ప మాట్లాడుతూ...రాష్ట్రంలో మూడు రాజధాను ల ఏర్పాటు వైసీపీని ముంచబోతోందని, దుర్మార్గపు ఆలోచనవల్ల జగన్మోహన్‌రెడ్డి శాశ్వతంగా రాజకీయాలకు దూరం కానున్నారని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ విభజనతో నాశనమైతే వైసీపీ రాజధాని మార్పుతో నాశనం కానుందన్నారు.